Begin typing your search above and press return to search.

మిగ్ తో భారీ న‌ష్టం!..అయినా రీప్లేస్ చేయ‌రా?

By:  Tupaki Desk   |   9 March 2019 2:30 PM GMT
మిగ్ తో భారీ న‌ష్టం!..అయినా రీప్లేస్ చేయ‌రా?
X
మిగ్ 21... ఇప్పుడు జ‌నం నోళ్ల‌లో బాగా నానుతున్న ఫైట‌ర్ జెట్. భార‌త వైమానిక ద‌ళం అమ్ముల పొదిలో ఉన్న ప్ర‌ధాన అస్త్రం. మొన్న‌టి మొన్న పాక్ భూభాగంలోని ఉగ్ర‌వాద శిబిరాల‌పై జ‌రిగిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌-2లో మిగ్ 21 ఫైట‌ర్ జెట్లే కీల‌క భూమిక పోషించాయి. నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను చేధించ‌డంలో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కు బాగానే స‌హ‌క‌రించాయి. అంతేకాదండోయ్‌... భార‌త్‌ - పాక్‌ ల హ‌ధ్య నెల‌కొన్న యుద్ధ మేఘాల మాటున భార‌త్ వైపు దూసుకువ‌చ్చిన ఓ ఫైట‌ర్ జెట్ ను కూల్చి వేసేందుకు మిగ్ 21నే వినియోగించిన భార‌త పైల‌ట్ అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ శ‌త్రు దేశానికి చిక్కారు. మిగ్ 21లోని లోపాల కార‌ణంగానే అభినంద‌న్ పాక్ సైన్యం చేతికి చిక్కార‌ని వార్త‌లు వినిపించినా ప్ర‌భుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఆ త‌ర్వాత కూడా పాక్ తో ఉద్రిక్త‌త‌ల నేపథ్యంలో భార‌త వాయుసేన గ‌స్తీ కోసం ఇంకా మిగ్ ల‌నే వినియోగిస్తోంది.

నిన్న‌టికి నిన్న స‌రిహ‌ద్దు వెంట మ‌రో మిగ్ 21కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో పైల‌ట్ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించి కింద‌కు దూకేశారు. ఈ దూకడంలో ఆయ‌న భార‌త భూభాగంలో ప‌డ్డారు గానీ... అదే పాక్ భూభాగంలో ప‌డి ఉంటే... మ‌రో అభింద‌న్ వ‌ర్ధ‌మాన్ గా మారేవారు. వ‌ర్ధ‌మాన్‌లా ఈ పైల‌ట్ ను కూడా విడిపించుకునేందుకు భార‌త్ నానా క‌ష్టాలు ప‌డాల్సి వ‌చ్చేది. అంటే... మిగ్ 21ల వ‌ల్ల భార‌త వాయుసేన‌కు పెద్ద న‌ష్ట‌మే జ‌రుగుతున్నా... ఆ ఫైట‌ర్ జెట్ ను వ‌దిలించుకునేందుకు ప్ర‌భుత్వం ఎందుకు సిద్ధ‌ప‌డ‌టం లేదో అర్ధం కాని ప‌రిస్థితి. అప్పుడెప్పుడో బాలీవుడ్ మూవీ *రంగ్ దే బ‌సంతి* చిత్రం కూడా మిగ్ ప్ర‌మాదాల‌ను నేప‌థ్యంగా రూపొందించిన సినిమానే. మిగ్ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడి కుటుంబానికి న్యాయం జ‌ర‌గ‌ని నేప‌ధ్యాన్ని ప్ర‌శ్నిస్తూ.. ఆయ‌న మిత్రులు ప్ర‌భుత్వం మీద చేసిన పోరాట‌మే రంగ్ దే బ‌సంతి చిత్రం క‌థ‌.

ఈ చిత్రంలో ఆ వీర సైనికుడి ముగ్గురు మిత్రులు ప్రాణాలు కోల్పోయి కూడా మిగ్ ల న‌ష్టాన్ని దేశానికి తెలిసేలా చేస్తారు. మ‌రి క‌ళ్లెదుటే ఇన్ని ప్ర‌మాదాలు జ‌రుగుతున్నా... ఈ ప్ర‌మాదాల్లో లెక్క‌లేనంత మంది సైనికులు చ‌నిపోతున్నా... ఈ ఫైట‌ర్ జెట్ ను ఎందుకు వ‌దిలించుకోలేక‌పోతున్నామో అర్థం కాని ప‌రిస్థితి. అస‌లు మిగ్ క‌థేంటీ, దాని లోపాల కార‌ణంగా జ‌రిగిన ప్ర‌మాదాలెన్ని - అందులో చ‌నిపోయిన వారు ఎంత‌మంది? అన్న వివ‌రాల‌ను ఓ సారి ప‌రిశీలిస్తే... ఆస‌క్తిగొలిపే విష‌యాలు బ‌య‌ట‌కు రాక‌మాన‌వు. సోవియ‌ట్ యూనియ‌న్‌ - ఆ త‌ర్వాత పేరు మార్చుకున్న ర‌ష్యా త‌యారీ యుద్ధ విమానాలైన మిగ్ త‌ర‌హా విమానాల‌ను మ‌న దేశం 872 ఫైట‌ర్ జెట్ ల‌ను కొనుగోలు చేసింది. వీటిలో మిగ్ 21తో పాటు మిగ్ 27 - మిగ్ 29 ర‌కాల ఫైట‌ర్ జెట్లున్నాయి. వీటిలోనూ మిగ్ 21ల‌దే అగ్ర తాంబూలం. వీటిలో ఇప్ప‌టిదాకా 215 మిగ్ 21లు కూలిపోగా... ఈ ప్ర‌మాదాల్లో 171 మంది పైల‌ట్లు - 40 మంది సాధార‌ణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకేనేమో... భార‌త ర‌క్ష‌ణ మంత్రిగా ప‌నిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దీనిని అత్యంత ప్ర‌మాద‌కర ఫైట‌ర్ జెట్ గా అభివ‌ర్ణించారు. ర‌ష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్ 21ల‌లో ఇప్ప‌టికే స‌గానికి (55 శాతం) పైగా కూలిపోయాయి.

ఎగిరితే మ‌ళ్లీ సేఫ్ గా దిగుతుందో - లేదో తెలియ‌ని మిగ్ 21లే మ‌న‌కు దిక్కా? అంటే... అదేమీ లేదు. మిగ్ 21ల కంటే అత్యాదుని టెక్నాల‌జీతో రూపొదించిన సుఖోయ్ యుద్ధ విమానాలు కూడా భార‌త వాయుసేన‌కు అందుబాటులోనే ఉన్నాయి. అయినా కూడా మిగ్ 21ల‌ను ఎందుకు ప‌క్క‌న‌పెట్ట‌డం లేదన్న‌దే అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌. మిగ్ 21 ఫైట‌ర్ జెట్ల‌ను వినియోగించ‌డంలోనే కాకుండా ఈ యుద్ధ విమానంపై ఇత‌ర దేశాల సైనికుల‌కు కూడా శిక్ష‌ణ ఇచ్చిన దేశంగా భార‌త్ ట్రాక్ రికార్డును క‌లిగి ఉంది. మిగ్ 21ల‌పై ఇరాకీ సైనికులకు బార‌త్ ఇచ్చిన శిక్ష‌ణ ఓ రికార్డే అని చెప్పాలి. ఈ రికార్డును ఏ దేశం - ఏ ఫైట‌ర్ జెట్ విభాగంలో కూడా బ‌ద్ద‌లు కొట్ట‌లేక‌పోయింది. అంటే... ర‌ష్యాలోనే త‌యారైనప్ప‌టికీ... మిగ్ 21 అంటే భార‌త సొంత అస్త్ర‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక ఈ ఫైట‌ర్ జెట్ కే అంటుకుని ఉండ‌టానికి ఇంకో కార‌ణం కూడా ఉంది. అదే... అతి తక్కువ వ్య‌యంతో ఈ యుద్ధ విమానాన్ని రూపొందించ‌గ‌ల‌గ‌డం. మొత్తంగా కార‌ణాలేమైనా... అత్యాధుని టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌స్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌మాదాల‌కు నెల‌వుగా మారిన మిగ్ 21కు స్వ‌స్తి చెప్పాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఈ దిశగా భార‌త సైన్యం ఎప్పుడు నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.