Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు పునుపటి టీమిండియా..

By:  Tupaki Desk   |   7 Feb 2022 3:30 PM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు పునుపటి టీమిండియా..
X
ఎన్నాళ్లయిందో టీమిండియా నుంచి ఇలాంటి ప్రదర్శన చూసి.. ఎన్ని రోజులైందో ఇంత సాధికారికంగా ఆడి.. బ్యాటింగ్ లో రాణిస్తే బౌలింగ్ లో తేలిపోయి.. బౌలింగ్ రాణిస్తే బ్యాటింగ్ లో చేతులెత్తేసి.. ..ఇదీ ఇటీవలి కాలంలో మన క్రికెట్ జట్టు ఆటతీరు. మరీ ముఖ్యంగా దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా స్థాయి తీసికట్టుగా మారినట్లనిపించింది. మళ్లీ 80లు, 90ల కాలం నాటి జట్టుగా మారిపోతోందా? ఐపీఎల్ ఇచ్చిన ఊపంతా కరిగిపోతోందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికితోడు జట్టులో లుకలుకలున్నట్లు ప్రచారం. రోహిత్ శర్మ ఫిట్ నెస్ ఇబ్బందులకు తోడు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి ఒక్కో ఫార్మాట్ పగ్గాలు వదిలేయడంతో అంతా శూన్యంగా కనిపించింది. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇంకా స్థాయి అందుకోకపోవడంతో భవిష్యత్ అగమ్య గోచరంగా కనిపించింది. అయితే, తాజాగా వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో మన జట్టు అదరగొట్టింది. తిరుగులేని ఆటతీరు తో ప్రత్యర్థి దుమ్ముదులిపింది. వెయ్యవ వన్డేను చక్కటి విజయంతో మరుపురానిదిగా మలుచుకుంది.

బ్యాటింగ్ లో అదరగొట్టిన రోహిత్.. కోహ్లినే ప్చ్..?
గాయం నుంచి కోలుకుని మైదానంలోకి దిగిన రోహిత్ శర్మ తొలిసారిగా పూర్తి స్థాయి కెప్టెన్ గా వ్యవహరిస్తూ జట్టును ముందుండి నడిపించాడు. బ్యాటింగ్ లో తనదైన దూకుడు చూపుతూ 51 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, సిక్స్ ఉండడం గమనార్హం. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ క్రీజులో నిలదొక్కుకుని అండగా నిలిచాడు. అయితే కిషన్ 36 బంతులో్ల 28 పరుగులు మాత్రమే చేశాడు. దూకుడైన ఆటకు పేరుగాంచిన కిషన్ ఈ మ్యాచ్ లో దానిని చూపలేకపోయాడు. వాస్తవానికి టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కొంత ఆశ్చర్యపర్చింది. కానీ, ఆ నిర్ణయానికి పూర్తి న్యాయం చేస్తూ బౌలర్లు చెలరేగారు. విండీస్ జట్టులో మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్ (71 బంతుల్లో 57) తప్ప మిగతావారెవరూ సాధికారికంగా ఆడలేకపోయారు. 9వ స్థానంలో వచ్చిన ఫాబియాన్ అలెన్ (29) టాపార్డర్ బ్యాట్స్ మన్ కంటే నయమనిపించాడు. హైదరాబాదీ పేసర్ సిరాజ్ 8 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టి శుభారంభం ఇవ్వగా.. వాషింగ్టన్ సుందర్ (9-1-30-3) రాకతో పరిస్థితి మారిపోయింది. ఇక యజువేంద్ర చహల్ 9.5 ఓవర్లలో 49 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టి కరీబియన్లను కోలుకోకుండా చేశాడు.దీంతో విండీస్ 176 పరుగులకే పరిమితమైంది. అయితే, భారత బ్యాటింగ్ కూడా ఏమంత వేగంగా సాగలేదు. రోహిత్ ఒక్కడే దూకుడు చూపాడు. కిషన్ నిదానంగా ఆడాడు. నిలదొక్కకున్నాక అనవసరంగా ఔటయ్యాడు. ఇక కోహ్లి వైఫల్యం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఎదుర్కొన్న నాలుగు బంతుల్లో మధ్యలో రెండింటిని బౌండరీకి తరలించిన అతడు నాలుగో బంతికి ఔటయ్యాడు. దీంతో విశ్లేషకులు కోహ్లికి కొంత మానసిక విశ్రాంతి కావాలేమోనని వ్యాఖ్యానించారు. కీపర్ రిషభ్ పంత్ (11) అనూహ్యంగా రనౌటైనా.. సూర్య కుమార్ యాదవ్ (34 నాటౌట్), కొత్త కుర్రాడు దీపక్ హుడా (26 నాటౌట్)తో కలిసి విజయ లాంఛనం పూర్తి చేశాడు. కోహ్లి తప్ప జట్టు ప్రదర్శన అంతా బాగున్నా.. రెండో వన్డేకు కేఎల్ రాహుల్ అందుబాటులోకి రానున్నాడు. మూడో వన్డేకు ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా సిద్ధమవుతాడు. మరి అప్పడు కూర్పు ఎలా ఉంటుందో చూడాలి.