Begin typing your search above and press return to search.

థియేటర్లలో క్రికెట్ మ్యాచ్

By:  Tupaki Desk   |   19 March 2016 10:14 AM GMT
థియేటర్లలో క్రికెట్ మ్యాచ్
X
భారత్, పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ ఉందంటే ఇక క్రికెట్ అభిమానులకు పండగే పండగ.. రెండు దేశాల మధ్య మ్యాచ్ ను వీక్షించేందుకు అటు పాక్ లోనూ, ఇటు భారత్ లోనూ తెగ ఉత్సాహ పడతారు. మ్యాచ్ టిక్కెట్ల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు.... టిక్కెట్లు దొరక్కపోతే టీవీల్లో మ్యాచ్ చూడడానికి అన్ని పనులు మానుకుని రెడీగా ఉంటారు. అవసరమైతే ఆఫీసులకు సెలవులు కూడా పెట్టేస్తారు. అంతగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు క్రికెట్ ప్రియులు.

శనివారం కోల్ కతాలో టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఈడెన్ గార్డెన్సులో భారత్- పాక్ ల మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ను తిలకించేందుకు పాకిస్తాన్ లోని పెషావార్ నగరంలో ఏకంగా సినిమా థియేటర్లలో శనివారం లైవ్ మ్యాచ్(ప్రత్యక్ష ప్రసారం) కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు అక్కడి పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు.. 100 (పాకిస్తాన్ కరెన్సీలో) చొప్పున సినిమా థియేటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేస్తున్నారట.

ప్రత్యేకంగా యువకులను ఆకర్షించేందుకు సినిమా థియేటర్ల వద్ద పెద్ద సైజులో పోస్టర్లు - బ్యానర్లు పెట్టారు. హోటళ్లు, రెస్టారెంట్లు - ప్రభుత్వేతర సంస్థలు కూడా ప్రజలందరూ భారత్ - పాక్ లైవ్ మ్యాచ్ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఇటీవల ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ - పాక్ ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో కూడా ఈ తరహా ఏర్పాట్లే చేశారు. భారత్ - పాక్ మ్యాచ్ సమయంలో ఆయా సినిమా థియేటర్లలో అంతరాయం లేకుండా విద్యుత్ తప్పనిసరిగా సరఫరా చేయాలని క్రికెట్ అభిమానులు పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొత్తానికి పెషావర్ పాక్-ఇండియా క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతోంది.