Begin typing your search above and press return to search.

డ్రాగన్ కంట్రీకి దడ పుట్టిస్తున్న ఎస్‌ ఎఫ్ ఎఫ్ ... ఎస్ ఎఫ్ ఎఫ్ అంటే చైనాకి ఎందుకంత భయం !

By:  Tupaki Desk   |   4 Sept 2020 10:30 AM IST
డ్రాగన్ కంట్రీకి దడ పుట్టిస్తున్న ఎస్‌ ఎఫ్ ఎఫ్ ... ఎస్ ఎఫ్ ఎఫ్ అంటే చైనాకి ఎందుకంత భయం !
X
ఎస్ ఎఫ్ ఎఫ్ .. స్పెషల్‌ ఫ్రాంటియర్స్‌ ఫోర్స్‌. ఈ పేరు వింటే చైనా వెన్నులో వణుకు ఖాయం. దీనికి ప్రధాన కారణం.. గత నెల 29న ఎల్ ‌ఏ సీ వద్ద సరిహద్దులు మార్చేందుకు చైనా సైన్యం చేసిన ప్రయత్నాలను ఎస్ ‌ఎఫ్ ఎఫ్‌ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది. అలాగే, గత నెల వరకు పాంగాంగ్‌ సరస్సు వద్ద ఫింగర్‌-2 వరకే పరిమితమైన భారత గస్తీని, ఇప్పుడు ఫింగర్‌-5 వరకూ తీసుకెళ్లడం వెనక ఎస్ ‌ఎఫ్ ఎఫ్‌ ఘనత ఉంది. ఎస్‌ ఎఫ్ ఎఫ్‌ భారత సైన్యంలో భాగం కాదు. ఆ దళం చేసే సాహసాలకు, త్యాగాలకు బహిరంగంగా గుర్తింపు ఉండదు. అదంతా అత్యంత రహస్యం. ఆ దళం చేసే పని కూడా రహస్యమే. మన సైన్యానికి కూడా ఎస్‌ ఎఫ్ ఎఫ్‌ కదలికలు తెలియవు.

కేవలం ప్రధాన మంత్రి కార్యాలయం పరిధిలో ఈ దళం పనిచేస్తుంది. రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా) ఆదేశాలతో మాత్రమే ముందుకు సాగుతుంది. అప్పగించిన బాధ్యతలను కూడా ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా పూర్తిచేస్తుంది.

అసలు ఈ ఎస్ ఎఫ్ ఎఫ్ ఎప్పుడు , ఎలా పుట్టుకొచ్చింది అంటే .. 1962 చైనా యుద్ధం తర్వాత.. చైనా అతిక్రమణలను అడ్డుకోవడానికి ఓ ప్రత్యేక దళం అవసరమని భారత ప్రభుత్వం గుర్తించి 1962 నవంబరు 14న అప్పటి ప్రధాని నెహ్రూ పుట్టినరోజున మేజర్‌ జనరల్‌ సుజాన్ ‌సింగ్‌ ఉబన్‌ నేతృత్వంలో ఎస్‌ ఎఫ్ ఎఫ్‌ పురుడు పోసుకుంది. ఉత్తరాఖండ్‌ లోని ఛహ్రాదాలో 5 వేల మందితో ఈ ఎస్ ఎఫ్ ఎఫ్ ఏర్పాటైంది. ఈ దళాన్ని ‘వికాస్‌ సేన’ అని కూడా పిలుస్తారు. టిబెట్‌ నుంచి వచ్చిన శరణార్థులు, భారత సైన్యంలోని గోర్ఖా రెజిమెంట్‌ కు చెందినవారిని మాత్రమే ఎస్‌ ఎఫ్ ఎఫ్ లో రిక్రూట్‌ చేసుకుంటారు. దీనికి అసలు టిబెటన్లు, గోర్ఖాలకు పర్వత ప్రాంతాలపై మంచి పట్టు ఉండటం, అక్కడి వాతావరణం వారికి అలవాటే... గెరిల్లా యుద్ధం, అధునాతన ఆయుధాలను ఉపయోగించడం, టెక్నాలజీ సాయంతో శత్రువు జాడను కనిపెట్టడం వంటి అంశాల్లో వీరు సుశిక్షితులు. తొలినాళ్లలో అమెరికా నిఘా సంస్థ వీరికి శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం సంప్రదాయ యుద్ధ విద్యల్లో ఇజ్రాయెల్‌, రష్యా సైన్యం శిక్షణనిస్తోంది. ఈ దళంలో మొదటి తరంలో రిక్రూట్‌ అయినవారు కూడా ఇంకా సేవలు అందిస్తున్నారు.