Begin typing your search above and press return to search.

వణికిపోతున్న డ్రాగన్ సైన్యం

By:  Tupaki Desk   |   7 Jun 2021 5:30 AM GMT
వణికిపోతున్న డ్రాగన్ సైన్యం
X
అవును చైనా సైన్యం నిజంగానే వణికిపోతోంది. అయితే డ్రాగన్ సైన్యం వణికిపోవటం దేనికంటే లడ్డాఖ్ లో వాతావరణానికి తట్టుకోలేకనట. లడ్డాఖ్ సరిహద్దుల్లోని లోయలు, పర్వత ప్రాంతాల్లో కాపలాకాయటమంటే మామూలు విషయం కాదు. ముందుగా అక్కడి వాతావరణ మార్పులకు, తీవ్రమైన చలికి అలవాటుపడాలి. లేకపోతే ఎముకలుకొరికే చలిని తట్టుకోవటం కష్టమే. అయితే ఈ విషయాలేవీ గమనంలోకి తీసుకోకుండా డ్రాగన్ లడ్డాఖ్ ప్రాంతంలో 50 వేలమంది సైన్యాన్ని మోహరించేసింది.

మామూలుగా ఈ ప్రాంతంలో కాపలాకు వచ్చే మన సైనికులు రెండేళ్ళపాటు పనిచేస్తారు. రెండేళ్ళకొకసారి మొత్తం సైన్యంలో 40 శాతంమందిని మిలిటరీ ఉన్నతాధికారులు మారుస్తుంటారు. అయితే చైనా మాత్రం గొప్పగా 50 వేలమందిని సరిహద్దుల్లోకి దింపేసింది. అయితే వాళ్ళువచ్చి ఏడాది కూడా కాకుండానే 90 శాతం మందిని మార్చేసిందట. ప్రతిరోజు సరిహద్దుల్లోని డ్రాగన్ సైన్యంలో చాలామంది కొత్తముఖాలే కనిపిస్తున్న విషయాన్ని గమనించింది.
కారణాలు ఆరాతీసినట్లు ఎక్కువమంది సైన్యం తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలిసింది. దీనికి రెండు కారణాలు ప్రధానంగా ఉన్నట్లు మన సైన్యం విశ్లేషించింది. మొదటిదేమో దేశంలో ఎక్కడెక్కడో ఉండే సైన్యాన్ని లడ్డాఖ్ ప్రాంతానికి మార్చేయటం. ఈ ప్రాంతంలోని వాతావరణాన్ని తట్టుకోలేక సైన్యం అనారోగ్యం పాలవుతోందట. ఇక రెండో కారణం ఏమిటంటే కొత్తగా సైన్యంలో చేరిన వారికి కొద్దిపాటి శిక్షణ ఇచ్చిన వెంటనే లడ్డాఖ్ ప్రాంతంలో డ్యూటీలేసేస్తుండటం.

పై రెండు పద్దతుల్లో సరిహద్దుల్లో కాపలాకు వచ్చిన సైన్యం వాతావరణానికి తట్టుకోలేకపోతున్నారట. దాంతో ప్రతిరోజు వందలాదిమంది సైనికులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారట. దాంతో చేసేది లేక ఇప్పటివరకు 90 శాతంమందిని కొత్తవారిని కాపలాకు తీసుకొస్తోంది. పర్వాతల పైన ఎక్కడో కాపలాకాయాల్సిన చైనా సైన్యంలో చాలామందికి సరైన ఆక్సిజన్ కూడా అందక శరీరమంతా నీలంరంగులోకి మారిపోతోందట. దాంతో వాళ్ళని అప్పటికప్పుడు ఎయిర్ లిఫ్ట్ చేయాల్సొస్తోందట.

ఇదే విషయంలో మన సైన్యాన్ని తీసుకుంటే మన వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావటం లేదు. ఎందుకంటే లడ్డాఖ్ ప్రాంతంలో సైన్యానికి లేదా కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకు అదేపనిగా కొన్ని నెలలు శిక్షణిస్తారు. దాంతో ఇక్కడి వాతావరణానికి మన సైన్యం అలవాటు పడిపోతోంది. అందుకనే పర్వాలపైన కాపలా కాసే సైన్యానికి కూడా పెద్దగా ఇబ్బందులు ఎదురుకావటంలేదు. మొత్తానికి ఏదో విధంగా మనల్ని దెబ్బతీయాలని పెద్దఎత్తున మోహరించిన డ్రాగన్ సైన్యం ఇపుడు వణికిపోతోంది.