Begin typing your search above and press return to search.

ట్రంప్ ఘ‌టికుడే అందుకే ఇండియాలోనే మ‌న‌కు షాకులు

By:  Tupaki Desk   |   25 Feb 2020 9:23 AM IST
ట్రంప్ ఘ‌టికుడే అందుకే ఇండియాలోనే మ‌న‌కు షాకులు
X
త‌న భారత పర్యటన సందర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపైనే చర్చిస్తానని, అమెరికా ఉత్పత్తులను ప్రచారం చేస్తానని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఈ టూరుకు ముందే స్పష్టం చేశారు. భారత్‌తో అద్భుతమైన వాణిజ్య ఒప్పందం జరుగొచ్చన్నారు. అయితే, ఆయ‌న చెప్పిన‌ట్లే...లెక్క‌ల ప్ర‌కార‌మే ఒప్పందాలు జ‌రిగాయి. భార‌త్ త‌మ ద‌గ్గ‌ర ర‌క్ష‌ణ ఆయుధాలు కొనుగోలు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆ ర‌క్ష‌ణ ఒప్పందం విలువ‌ సుమారు 3 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌న్నారు. అయితే, కీల‌క‌మైన ప‌లు అంశాల్లో ట్రంప్ ఇండియా కు హ్యాండిచ్చారు.


మొతేరా స్టేడియంలో ట్రంప్ మాట్లాడుతూ...ప్ర‌పంచం లోనే అత్యుత్తమ ఆయుధాలు మా ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు. ర‌క్ష‌ణ భాగ‌స్వామ్యంలో రెండు దేశాలు కీల‌కంగా మార‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. ఈ భూ మండలంలోనే అత్యంత ఉత్త‌మ‌మైన‌, భ‌యాన‌క‌మైన సైనిక ఆయుధాల‌ను అమెరికా త‌యారు చేస్తుంద‌ని ట్రంప్ అన్నారు. యాంటీ ఎయిర్ సిస్ట‌మ్స్‌ను కూడా భార‌త్ ఖ‌రీదు చేస్తుంద‌ని ట్రంప్ త‌న సందేశంలో తెలిపారు. అయితే, భార‌త్ కొనే వాటిపై స‌హ‌జంగానే ఆస‌క్తి ఉంటుంది. అమెరికా వ‌ద్ద భార‌త్ కొనుగోలు చేసే ఎంఎచ్‌-60ఆర్ సీహాక్ హెలికాప్ట‌ర్లు ఇవే. సుమారు 24 సీహాక్ హెలికాప్ట‌ర్ల‌ను ఖ‌రీదు చేసేందుకు భార‌త్ అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. డ్రోన్లను కూడా భార‌త్ ఖ‌రీదు చేసే సూచ‌న‌లున్నాయి. 24 సీహాక్ హెలికాప్ట‌ర్ల ఖ‌రీదు దాదాపు 16వేల కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వీటితో పాటు మ‌రో ఆరు అపాచీ హెలికాప్ట‌ర్లు (ఏహెచ్‌-64ఇ)ల‌ను 6వేల కోట్లు పెట్టి కొనుగోలు చేయ‌నున్నారు.

కాగా, రెండు కీల‌క‌మైన ఒప్పందాల‌పై ట్రంప్ టూర్‌లో మొద‌టి రోజు ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. భారత్‌కు నిఘా కోసం సీగార్డియన్‌ డ్రోన్లను విక్రయించేందుకు 2017లో అమెరికా అధ్యక్షుడు అంగీకారం తెలిపారు. అప్పటి నుంచి భారత్‌కు వీటి విక్రయాలపై చర్చలు జరుగుతున్నాయి. వీటికి అదనంగా గతేడాది ఆయుధ సహిత డ్రోన్లను కూడా విక్రయాలకు కూడా ట్రంప్‌ సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ డీల్‌ కూడా కొలిక్కి రాలేదు. ఇప్పటికే 186 కోట్ల డాలర్ల విలువైన ‘సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ’ (ఐఏడీడబ్ల్యూఎస్‌) విక్రయానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆ దేశ కాంగ్రెస్‌కు కూడా తెలిపింది. కానీ, నేడు జరిగిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో కేవలం హెలికాప్టర్ల డీల్‌పైనే రేపు సంతకాలు జరుగుతాయని ట్రంప్‌ ప్రకటించారు. అంటే గగనతల రక్షణ వ్యవస్థ డీల్‌ ఇంకా తుదిదశకు చేరుకోలేదనే అర్థం. ఈ రక్షణ వ్యవస్థలో ఏఎన్‌/ఎంపీక్యూ-64ఎఫ్‌ఐ సెంటినెల్‌ రాడార్‌ వ్యవస్థ, నూట పద్దెనిమిది ఆమ్రామ్‌ ఏఐఎం-120సి-7/సి-8 క్షిపణులు, మూడు ఆమ్రామ్‌ మార్గ నిర్దేశ వ్యవస్థలు, 134 స్టింగర్‌ క్షిపణులు, ఇతర అధునాతన సెన్సర్లు, సాధనాలు, లాంచర్లు ఉంటాయి. ఇంత‌టి కీల‌క వ్య‌వ‌స్థ‌ పై ట్రంప్ త‌న నిర్ణ‌యం పెండింగ్‌లో పెట్ట‌డం చ‌ర్చ‌కు తెర‌లేపింది.