Begin typing your search above and press return to search.

లడఖ్ ‌లో రాజ్‌నాథ్‌ .. గన్ చేతపట్టి చైనాకి సవాల్

By:  Tupaki Desk   |   17 July 2020 1:30 PM GMT
లడఖ్ ‌లో రాజ్‌నాథ్‌ .. గన్ చేతపట్టి చైనాకి సవాల్
X
భారత్, చైనాల మధ్య గత రెండు నెలలుగా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తత పరిస్థితులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే రెండు దేశాలు కూడా తొలి దశలో వివిధ ప్రాంతాల నుంచి తమ సైన్యాలను వెనక్కు మళ్లించాయి. మిగతా ప్రాంతాల్లో బలగాల తరలింపుపై మూడు రోజుల కిందట భారత్, చైనా సైనికాధికారుల స్థాయి చర్చలు జరిగాయి. ఇటువంటి సమయంలో సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకున్న పరిస్థితిని సమీక్షించడానికి రెండు రోజుల పర్యటనకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఉదయం లడఖ్‌ పర్యటనకి వెళ్లారు.

ఢిల్లీ నుంచి ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి లేహ్‌‌ కు చేరుకున్న మంత్రి రాజ్‌నాథ్ కి సైనిక, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత స్టాక్నా సైనిక స్థావరంలో పర్యటించిన రాజ్‌నాథ్ అక్కడ నిర్వహించిన సైనిక విన్యాసాలన ఆసక్తిగా తిలకించారు. అంతేకాదు, ఆయుధాలను వినియోగించే విధానాన్ని కూడా స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యుద్ధ ట్యాంకులు, శతఘ్నుల సన్నద్ధత, ఏకే 47 చేత్తో పట్టుకుని చైనాతో కయ్యానికైనా వియ్యానికైనా సిద్దమే అని సంకేతం ఇచ్చారు. చైనా, పాకిస్థాన్‌లతో సరిహద్దుల్లోనూ వివాదాలు లు తీవ్రమవుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు రాజ్‌నాథ్ నేరుగా ఫీల్డ్ కమాండర్స్‌తో సమావేశం కానున్నట్టు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. మంత్రి రాజ్‌నాథ్‌ వెంట సీడీఎస్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే తదితరులు ఉన్నారు.