Begin typing your search above and press return to search.

నల్లధనం లెక్కెంతో తెలుసా?

By:  Tupaki Desk   |   6 Jun 2016 12:22 PM IST
నల్లధనం లెక్కెంతో తెలుసా?
X
ఇండియాలో నల్లధనం విషయంలో కొద్దికాలంగా చర్చోపచర్చలు జరుగుతున్నా దాన్ని అరికట్టడంలో మాత్రం అడుగులు ముందుకు పడడం లేదు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నా ఇండియాలో నల్లధనం లెక్కలు వింటుంటే మాత్రం షాక్ తినాల్సిందే. నల్లధనంపై చర్యలు పెరుగుతుండడంతో దేశంలో కొన్నేళ్లుగా నల్లధనం తగ్గుతూ వస్తున్నా ఆ పరిమాణం భారీగా ఉంది. కొన్ని దేశాల బడ్జెట్ కంటే కూడా మన వద్ద ఉన్న నల్లధనం ఎక్కువగా ఉందట. ఇక మన ఆర్థిక వ్యవస్థనే ఉదాహరణగా తీసుకుంటే... భారత్‌ లో ప్రస్తుతం నల్ల ఆర్థిక వ్యవస్థ విలువ రూ.30లక్షల కోట్లకు పైగా ఉంది. ఇది మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 20శాతం. అంటే అయిదో వంతన్నమాట.

యాంబిట్‌ క్యాపిటల్‌ రీసెర్చి సంస్థ భారత్ లో నల్లధనం పై నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. నల్లధనంపై నియంత్రణ చర్యల వల్ల అనుకోని ఫలితాలు ఎదురయ్యాయని ఈ అధ్యయనం తేల్చింది. నల్ల ఆర్థికవ్యవస్థ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి మూలధన వ్యయం పెరిగిందని... భౌతిక రూపంలోని నగదుకు ప్రాధాన్యం పెరిగిందని, బ్యాంకుల లావాదేవీలను ఉపయోగించుకోవడం గణనీయంగా తగ్గిందని తెలిపింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. డిపాజిట్లు బాగా తగ్గాయని.. డెబిట్‌ కార్డుల వినియోగం తగ్గిందని పేర్కొంది. ఫలితంగా ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. 1970లు, 1980ల్లో భారత నల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరించిందని అధ్యయనం వెల్లడించింది. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోందని తెలిపింది.

మరోవైపు 2016లో భారత జీడీపీ దాదాపు రూ.1,50,00,000 కోట్లు అని అంచనా వేయగా, దేశంలోని నల్ల ఆర్థిక వ్యవస్థ పరిమాణం రూ.30లక్షల కోట్లకు పైనే. థాయ్‌ లాండ్‌ - అర్జెంటీనా వంటి దేశాల జీడీపీ కన్నా ఇది ఎక్కువ. నల్లధనంలో ఎక్కువ భాగం బంగారం - స్థిరాస్తి వంటి ఆస్తుల రూపంలో ఉందట. స్థిరాస్తి రంగంలో నల్లధనం ఎంత పరిమాణంలో ఉన్నదీ అధికారిక గణాంకాలు లేనప్పటికీ భారత స్థిరాస్తి రంగంలో నల్లధనం వాటా 30శాతం వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.