Begin typing your search above and press return to search.

ఇంటర్నెట్ వాడుతున్నది ఎంతమందో తెలుసా.?

By:  Tupaki Desk   |   22 Sept 2015 12:51 PM IST
ఇంటర్నెట్ వాడుతున్నది ఎంతమందో తెలుసా.?
X
ప్రపంచం ఇంటర్ నెట్ మయమైంది... విశ్వం కుగ్రామమైపోయింది అని అంతా అంటుంటే నిజమే అనుకుంటాం కదా... కానీ, అంత సీన్ లేదన్న సంగతి ఐరాస నివేదికతో బయటపడింది. ఈ ఏడాది ఇంటర్నెట్‌ వృద్ధిలో తగ్గుదల చోటు చేసుకోనుందని ఐక్యరాజ్య సమితి బ్రాడ్‌ బాండ్‌ కమిషన్‌ వెల్లడించింది. అంతేకాదు... ప్రపంచంలో ఇప్పటికీ సగం మంది ప్రజలకు నెట్‌ అందుబాటులోకి రాలేదన్న వాస్తవాన్నీ వెల్లడించింది. చాలా అభివృద్ది చెందిన దేశాల్లో నెట్‌ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరినప్పటికీ... అయితే 90 శాతం ప్రజలున్న 48 పేద దేశాల్లో మాత్రం నెట్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని తేల్చింది.

నెట్ విస్తరణ 2012 వరకు వరుసగా ఏకంగా రెండంకెల వృద్ధిలో దూసుకుపోయింది. ప్రస్తుత ఏడాదిలో ఇంటర్ నెట్‌ వృద్ధి 8.1 శాతానికి పడిపోనుందని అంచనా. 2014లో 8.6 శాతం వృద్ధి నమోదయింది. అయితే.. 2020 నాటికి ప్రపంచంలో నెట్‌ వినియోగదారులు 400 కోట్లకు చేరుతారని అంచనా వేస్తున్నారు. 2014లో 290 కోట్ల మంది వినియోగదారులు నమోదయ్యారు. ఇది మొత్తం జనాభాలో 43.4 శాతం. 2020 నాటికి యుఎన్‌ 60 శాతం ప్రజలకు నెట్‌ ను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టింది.

మరోవైపు ఇంటర్ నెట్ సాధారణ వాడకం కంటే ఫేస్‌ బుక్‌ వాడకం భారీగా పెరుగుతోందని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని 57 శాతం మంది ఇప్పటికీ ఇంటర్ నెట్‌ ను రెగ్యూలర్‌ గా ఉపయోగించడం లేదని యుఎన్‌ రిపోర్టు వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో 25 శాతం మంది మహిళలు నెట్‌ వినియోగిస్తున్నారు. కొన్ని దేశాల్లో ఇది 50 శాతంగా కూడా ఉంది.

- ఇంటర్ నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా గణంకాల ప్రకారం జూన్‌ 2015 నాటికి భారత్‌ లో 35.4 కోట్ల మంది నెట్‌ వినియోగిస్తున్నారు..

- ప్రపంచంలోనే చైనా తర్వాత నెట్‌ వినియోగదారుల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది.

- ఈ ఏడాది తొలి 6 నెలల్లో 17 శాతం వృద్ధి చోటు చేసుకుంది. గతేడాది నెట్‌ వినియోగదార్లు 32 శాతం వృద్ధితో 30.2 కోట్లకు చేరారు.

- దశాబ్దం క్రితం దేశంలో కోటి మంది నుంచి 10 కోట్లకు చేరడానికి పదేళ్లు పట్టింది. అనంతరం మూడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అయి 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెరిగింది. మరో ఏడాదిలోనే 20 కోట్ల నుంచి 30 కోట్లకు చేరింది. జూన్‌ 2015 నాటికి మొబైల్‌ నెట్‌ ఖాతాదారుల సంఖ్య 21.3 కోట్లకు చేరింది.