Begin typing your search above and press return to search.

చైనా కొట్టిన తాజా దొంగ‌దెబ్బ ఇది

By:  Tupaki Desk   |   30 Dec 2016 10:02 PM IST
చైనా కొట్టిన తాజా దొంగ‌దెబ్బ ఇది
X
పొరుగునే ఉండి ప‌క్క‌లో బ‌ల్లెం వ‌లే మారిపోయిన చైనా మ‌రోసారి త‌న భార‌త్ వ్య‌తిరేక బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకుంది. త‌న చిర‌కాల మిత్రుడు పాకిస్థాన్‌ కు కొమ్ముకాసింది. నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ జైషే మ‌హ్మ‌ద్ చీఫ్ మ‌సూద్ అజ‌ర్‌ పై నిషేధం విధించాల‌న్న భార‌త్ డిమాండ్‌ ను మ‌రోసారి అడ్డుకుంది. ఇప్ప‌టికే రెండుసార్లు ఏవో సాకులు చెప్పి మ‌సూద్‌ పై నిషేధం ప‌డ‌కుండా కాపాడిన చైనా.. తాజాగా శుక్ర‌వారం త‌న వీటో ప‌వ‌ర్ ఉప‌యోగించి ఇదే చ‌ర్య‌కు పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం.

ఐక్య‌రాజ్య‌స‌మితి అల్‌ ఖైదా ఇస్లామిక్ స్టేట్ బ్లాక్‌ లిస్ట్‌లో మ‌సూద్ అజ‌ర్ పేరును చేర్చాల‌న్న భార‌త్ డిమాండ్‌ ను మొద‌ట ఏప్రిల్‌లో చైనా పెండింగ్‌ లో పెట్టింది. ఆ త‌ర్వాత అక్టోబ‌ర్‌ లో సాంకేతిక కార‌ణాలు చూపుతూ.. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు నిషేధం విధించ‌కుండా అడ్డుకుంది. అది శ‌నివారంతో ముగుస్తుండ‌టంతో శుక్ర‌వార‌మే త‌న వీటో ఉప‌యోగించింది. దీంతో మ‌సూద్ అజ‌ర్‌ పై నిషేధం విష‌యంలో చైనా అభ్యంత‌రాలు తాత్కాలికం కాద‌ని తేలిపోయింది. ఇప్ప‌టికే ఐక్యరాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి జైషే మ‌హ్మ‌ద్‌ పై నిషేధం విధించినా.. దాని చీఫ్ మ‌సూద్‌ ను మాత్రం నిషేధించ‌లేదు.

కాగా ఈ ప‌రిణామంతో త‌న చిర‌కాల మిత్రుడు పాకిస్థాన్‌ కు అనుకూలంగానే చైనా ఇలా అడ్డుకుంటోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ప‌ఠాన్‌ కోట్‌ లో ఆర్మీ స్థావ‌రంపై జ‌రిగిన దాడి జైషే ఉగ్ర‌వాదుల ప‌నే అని భార‌త్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఘ‌ట‌న‌పై పాకిస్థానీ భ‌ద్ర‌తా అధికారులు ఓ ప్ర‌త్యేక టీమ్‌ ను విచార‌ణ కోసం నియ‌మించామ‌ని, ఇందులో మసూద్ పాత్ర లేద‌ని వాళ్లు తేల్చార‌ని చెప్పారు. ఒక‌వేళ మ‌సూద్‌ పై యునైటెడ్ నేష‌న్స్ నిషేధం విధిస్తే.. అత‌నికి వివిధ దేశాల ప్ర‌యాణంపై నిషేధం ప‌డుతుంది. ఆస్తుల జ‌ప్తు కూడా ఉంటుంది. ఈ ప‌రిణామం భార‌త్ ఘాటుగా స్పందించింది. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న పోరులో చైనా ద్వంద్వ నీతికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని భార‌త విదేశాంగ శాఖ ఘాటుగా రియాక్ట‌యింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/