Begin typing your search above and press return to search.

భార‌త్ - డ్రాగ‌న్ల మ‌ధ్య ఏందీ డోకాలా లొల్లి?

By:  Tupaki Desk   |   3 July 2017 11:40 AM IST
భార‌త్ - డ్రాగ‌న్ల మ‌ధ్య ఏందీ డోకాలా లొల్లి?
X
భార‌త్‌ను నిందిస్తూ.. పాత రోజుల్ని గుర్తు చేస్తూ మాతో పెట్టుకుంటేనా? అంటూ చైనా తెగ‌ప‌డ‌టం తెలిసిందే. గ‌తంలో మాదిరి ప‌రిస్థితి లేద‌ని.. ఇప్పుడున్న‌ది 1962 నాటి రోజులు కావ‌ని.. 2017 అంటూ మోడీ స‌ర్కారులో కీల‌క భూమిక పోషించే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర స్వ‌రంతో చేసిన వ్యాఖ్య‌లు వార్త‌ల్లో హెడ్ లైన్స్ గా మారాయి. చైనాను అంత సూటిగా.. ఎలాంటి సుత్తి లేకుండా షాకిచ్చేలా భార‌త్ వ్యాఖ్య‌లు చేయ‌టం ఈ మ‌ధ్య కాలంలో ఇదే తొలిసారిగా చెప్పాలి. ఉన్న‌ట్లుండి డ్రాగ‌న్ పై భార‌త్ ఎందుకంత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ప‌నికి మాలిన క‌బుర్ల‌కు.. ప్ర‌భుత్వాల్ని అదే ప‌నిగా పొగిడేయ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్న తెలుగు జ‌ర్న‌లిజంలో.. దేశ ర‌క్ష‌ణ‌కు అత్యంత కీల‌క‌మైన స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ఏం జ‌రుగుతుంద‌న్న గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చే మీడియా సంస్థ‌లు చాలా చాలా త‌క్కువ‌. ఒక‌వేళ‌.. ఇచ్చినా ఆ వార్త‌ల్ని అయితే సింగిల్ కాల‌మ్‌.. లేదంటే డ‌బుల్ కాల‌మ్‌ లో పూర్తి చేస్తున్నారు. ఒక‌వేళ ఇచ్చినా నాలుగో పేజీలో రాళ్ల గుగ్గిళ్ల భాష‌లో ఇవ్వ‌టం ద్వారా సామాన్య పాఠ‌కుడికి విష‌యం అర్థం కాకుండా పోతున్న ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో.. ప‌రిస్థితి తీవ్ర‌త గురించి తెలుసుకునే అవ‌కాశం మిస్ అవుతోంది.

ఇంత‌కీ.. సిక్కిం స‌రిహ‌ద్దుల్లో అస‌లేం జ‌రుగుతోంది? భార‌త్‌.. చైనా మ‌ధ్య‌న న‌డుస్తున్న తాజా లొల్లి ఏంది? అదెక్క‌డి వ‌ర‌కూ వెళ్ల‌నుంది? తాజాగా అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితి ఉంద‌న్న విష‌యాల్లోకి వెళితే..

ఈ మొత్తం వివాదంలో త‌ర‌చూ వినిపిస్తున్న పేరు డోకా లా. ఇదెక్క‌డ ఉందంటే సిక్కిం రాష్ట్రంలో ఉంది. దీని ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. భార‌త్‌.. చైనా.. భూటాన్ ఉమ్మ‌డి స‌రిహ‌ద్దుల్లోని కీల‌క భూభాగ‌మే ఈ డోకా లా. వివాదం ఎక్క‌డ షురూ అయ్యిందంటే.. బుజ్జి దేశ‌మైన భూటాన్ అధీనంలో ఉన్న ప్రాంతంలో తేలిక‌పాటి యుద్ధ ట్యాంకులు.. పరిక‌రాల్ని మోసుకెళ్లేందుకు వీలుగా చైనా రోడ్డు నిర్మిస్తోంది. గ‌తంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. రోడ్డు నిర్మాణం చేయ‌కూడ‌దు. అదే విష‌యాన్ని చైనాకు గుర్తు చేస్తూ రాయ‌ల్ భూటాన్ సైన్యం చైనాకు ఈ విష‌యాన్ని చెప్పింది. ఎవ‌రి మాటా విన‌ని మొండి చైనా స‌సేమిరా అంది. ఈ వివాదంలోకి భార‌త్ జోక్యం చేసుకోవ‌టానికి కార‌ణం లేక‌పోలేదు. చైనా వేస్తున్న రోడ్డుకు టార్గెట్ భూటాన్ కాదు. మ‌న‌మే దాని టార్గెట్‌. ఎందుకంటే రోడ్డు నిర్మాణం పూర్తి అయితే.. ఈశాన్య భార‌తంతో మిగ‌తా దేశాన్ని క‌లిపే బెంగాల్లోని చికెన్ నెక్ కు చైనా సులువుగా చేరుకునే వీలుంది.

అంటే.. లెక్క తేడా కొడితే.. భార‌త్ లోకి ప్ర‌వేశించేందుకు చైనాకు రాజ‌మార్గంగా తాజా రోడ్డు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ విష‌యాన్ని గుర్తించిన భార‌త్ వెంట‌నే స్పందించింది. రోడ్డు ప‌నుల్ని అడ్డుకునేలా పావులు క‌దిపింది. ఇక్క‌డ ఇంకో విష‌యాన్ని చెప్పాలి. భూటాన్ బుజ్జి దేశం. దానికి సైన్యం.. ర‌క్ష‌ణ‌కు సంబంధించి అంత బ‌ల‌మైంది కాదు. భూటాన్ తో భార‌త్‌ కు విడ‌దీయ‌లేని అనుబంధం ఉంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. భార‌త్ లోకి రావాలంటే భూటాన్ ను ట‌చ్ చేసి మాత్ర‌మే రావాలి. అందుకే.. శ‌త్రువు భూటాన్‌ ను ట‌చ్ చేయ‌కుండా కాప‌లా కావాల్సిన అనివార్య ప‌రిస్థితి భార‌త్‌ కు ఉంది. అందుకే.. భూటాన్ ర‌క్ష‌ణ‌కు సంబంధించిన చాలా అంశాల్ని భార‌త్ స‌మ‌కూరుస్తూ ఉంటుంది.

తాజా ఎపిసోడ్‌ లోనూ చైనా దుర్మార్గ బుద్ధిని గుర్తించిన భార‌త్ వెంట‌నే రంగంలోకి దిగింది. భూటాన్‌కు మ‌ద్ద‌తుగా త‌న సైన్యాన్ని భూటాన్ ప్రాంతంలో మోహ‌రించి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంది. అంత పెద్ద డ్రాగ‌న్ దేశానికి.. ఇలాంటివి స‌హ‌జంగానే కోపాన్ని క‌లిగిస్తాయి. అందుకే.. భూటాన్ లోని భార‌త సైన్యానికి చెందిన బంక‌ర్ల‌ను ధ్వంసం చేసింది. దీంతో.. ఒక్క‌సారిగా ఉద్రిక్త‌త‌లు పీక్స్ కు చేరుకున్నాయి.

భార‌త్‌.. చైనా ద‌ళాల క‌మాండ‌ర్లు చ‌ర్చ‌లు జ‌రిపినా ఉద్రిక్త‌త‌లు త‌గ్గ‌లేదు. అప్ప‌టి నుంచి రెండు దేశాల మ‌ధ్య ప్ర‌క‌ట‌న‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఇందులో భాగంగానే త‌మ భూభాగంలోకి భార‌త బ‌ల‌గాలు ప్ర‌వేశించాయ‌ని చైనా నిర‌స‌న తెలుపుతోంది. అయితే.. చైనా చెబుతున్న భూభాగం త‌మ‌ద‌న్న విష‌యాన్ని భూటాన్ స్ప‌ష్టం చేస్తున్నా చైనా ఒప్పుకోవ‌టం లేదు. భార‌త్ మీద పైచేయి సాధించ‌టానికి వీలుగా.. చైనా మైండ్ గేమ్ షురూ చేసింది. ఇందులో భాగంగానే 1962లో చైనాతో జ‌రిగిన పోరులో ఎదురైన ఓట‌మిని గుర్తు చేస్తూ.. పాత రోజుల్ని గుర్తు చేసుకోవాల‌ని చెప్ప‌టంతో పాటు.. కైలాస మాన‌స స‌రోవ‌ర్ యాత్ర‌కు పోయే నాథూలా మార్గాన్ని మూసి వేస్తున్న‌ట్లుగా చైనా వెల్ల‌డించింది.

అయితే.. చైనా చ‌ర్య‌ల‌కు వెన‌క్కి త‌గ్గ‌ని భార‌త్‌.. ఆ దేశం ఏ మాత్రం ఊహించ‌ని రీతిలో మాట‌ల‌తో బ‌దులిచ్చింది. చైనా అనుకున్న‌ట్లుగా భార‌త్ ఇంకా 1962లోనే లేద‌ని.. ఇప్పుడు 2017లో ఉందంటూ ధీటైన మాట చెప్ప‌టం చైనా ఏమాత్రం ఊహించ‌ని ప‌రిణామంగా చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్త‌త‌ల వేళ‌.. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కోవ‌టానికి వీలుగా డోకా లా ప్రాంతానికి భార‌త్ మ‌రిన్ని బ‌ల‌గాల్ని పంప‌టం మొద‌లెట్టింది. 1962 త‌ర్వాత భార‌త్‌.. చైనా దేశాల మ‌ధ్య నెల‌కు పైనే సుదీర్ఘ ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకోవ‌టం ఇదే తొలిసారిగా చెప్పాలి. తాజాగా నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో భార‌త ఆర్మీ చీఫ్ స్వ‌యంగా డోకా లాకు వెళ్లి ప‌రిస్థితి స‌మీక్షించటం ఒక ఎత్తు అయితే.. మ‌రోవైపు చైనా త‌న స‌రిహ‌ద్దుల్లో యుద్ధ ట్యాంకుల్ని మోహ‌రించ‌టం ఇప్పుడు మ‌రింత ఉద్రిక్త‌త‌లు పెరిగేలా చేస్తోంది. ఇదిలా ఉంటే.. భార‌త ఆర్మీ త‌న బ‌ల‌గాల్ని డోకా లా ప్రాంతానికి పంపింది. యుద్ధసామాగ్రితో వెళుతున్న సిబ్బంది కాల్పులు జ‌ర‌ప‌ర‌ని.. తుపాకీ గొట్టాల‌ను కింద‌కు దించే ఉంచుతామ‌ని అధికార వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఏమైనా.. ప‌రిస్థితి మామూలు క‌న్నా భిన్నంగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/