Begin typing your search above and press return to search.

ఆకలి రాజ్యంలో భారత్ స్థానం?

By:  Tupaki Desk   |   13 Oct 2016 5:00 AM GMT
ఆకలి రాజ్యంలో భారత్ స్థానం?
X
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. అయితే ఈ దేశంలో ఆకలి కేకలు ఎలా ఉన్నాయి.. పౌష్టికాహారలోపం ఏ స్థాయిలో వెంటాడుతుంది.. వంటి అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు భారత్ తోపాటు అభివృద్ధి చెందుతున్న 118 దేశాల మీద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జి.హెచ్.ఐ) సర్వే చేసింది. ఈ సర్వేలో భారత్ లో ఆకలి కేకలకు - పౌష్టికాహార లోపాలకు కొదవలేదని తేలింది! ఈ 118 దేశాలపై చేసిన సర్వే ర్యాంకింగ్స్ లో భారత్ 97వ స్థానంలో నిలిచింది.

ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చేసిన సర్వేలో ప్రధానంగా రెండు అంశాలను దృష్టిలో ఉంచుకున్నారు. వాటిలో ఒకటి పౌష్టికాహారానికి నోచుకోని జనాభా కాగా మరొకటి ఐదేళ్ల వయసులోపు పిల్లల మరణాలు - చదువుకునేవారి సంఖ్య. ప్రధానంగా ఈ రెండు కీలకాంశాలనే బేస్ చేసుకుని జరిగిన ఈ సర్వేలో... భారత జనాభాలో 15శాతం మంది పోషకాహారలోపంతో బాధపడుతున్నారని తేలింది. వీరిలో ఐదేళ్లలోపు పిల్లల్లో అయితే ఈ పోషకాహార లోపం మరీ ఎక్కువగా ఉందని ఈ సర్వే చెబుతుంది. అయితే తక్కువ మొత్తంలో మంచి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లే ఇది జరుగుతుందని - దీని కారణంగానే శిశుమరణాలు, తక్కువ ఎత్తు పెరగడం లాంటి సమస్యలు భారత్ లో ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వే పేర్కొంది. ఇదే సమయంలో ప్రపంచంలో రెండు అతిపెద్ద పిల్లల పౌష్టికాహార పథకాలను భారత్ అమలు చేస్తున్నా కూడా పౌష్టికాహారలోపం ఈ దేశాన్ని ను వెంటాడుతూనే ఉందని జి.హెచ్.ఐ వ్యాఖ్యానించింది.

కాగా, ఈ సర్వేలో నైజీరియా - ఇథియోపియా - సియర్రా లియోన్ - చాడ్ - ఆప్ఘనిస్తాన్ - పాకిస్తాన్ ల పరిస్ధితి భారత్ కంటే దారుణంగా ఉండగా... బంగ్లాదేశ్ - శ్రీలంక - చైనా - నేపాల్ లు భారత్ కంటే మెరుగ్గానే ఉన్నాయి. పేదరికం - నిరుద్యోగం - సురక్షిత తాగునీటీ కొరత - అపరిశుభ్రత - హెల్త్ కేర్ అవసరాలు తీర్చలేకపోవడం లాంటివే ప్రధానంగా భారత్ ను జీహెచ్ ఐ ర్యాంకింగ్స్ లో దిగజార్చాయని తెలుస్తుంది!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/