Begin typing your search above and press return to search.

ఇండియా-పాక్ మ్యాచ్.. భార్యపై భర్త ఫిర్యాదు.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   6 Nov 2021 11:30 PM GMT
ఇండియా-పాక్ మ్యాచ్.. భార్యపై భర్త ఫిర్యాదు.. ఎందుకంటే?
X
ఇండియా-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ను ఇరు దేశాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. ఈ మ్యాచ్ ఉందంటే చాలు ఎంతోమంది తమ పనులు మానుకోని మరీ టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఈ దాయాదుల మధ్య పోరు అంటే పిల్లల నుంచి పెద్దల దాకా ఆసక్తి ఉంటుంది. ఈ ప్రెస్టీజియస్ మ్యాచ్ లో భారత్ గెలవాలని అభిమానులు గట్టిగా కోరుకుంటారు. ఈ సారి అందరూ అదే కోరుకున్నారు. ఎంతో ఆసక్తిగా ఆటను చూశారు. కానీ అక్టోబర్ 24న జరిగిన భారత్-పాక్ మ్యాచ్ లో ఇండియా జట్టు ఓడిపోయింది. ఫలితంగా ఎంతోమంది నిరాశపడ్డారు. జనాలు ప్రస్తుతం ఆ విషయాన్ని నెమ్మదిగా మర్చిపోతున్నారు. అయితే ఈ మ్యాచ్ ప్రస్తుతం ఓ భార్యాభర్తల మధ్య కొత్తరకం వివాదాన్ని లేపింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్యపై ఫిర్యాదు చేశాడు. ఇండియా ఓడిపోవడంతో తన భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు.

ఇండియా-పాక్ మ్యాచ్ కు ఆ భార్యభర్తల మధ్య గొడవకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..! అదేనండి అందరు క్రికెట్ అభిమానుల్లాగే ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఇషాన్ మియాాన్ అనే వ్యక్తి ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూశాడు. ఈ ప్రతిష్ఠాత్మక ఆటను దిల్లీలో తన స్నేహితులతో కలిసి వీక్షించాడు. అయితే భారత్ ఓడిపోవడం పట్ల తీవ్ర నిరాశకు లోనయ్యాడు. భారతజట్టు అనూహ్యంగా పరాజయం పాలుకావడంతో ఇషాన్ చాలా డిజపాయింట్ అయ్యాడు. అయితే ఇదే సమయంలో తన భార్య రబియా ఓ ఆసక్తికర స్టేటస్ పెట్టడం గమనార్హం. ఇండియా జట్టు ఓడిపోయిందని నిరాశగా వాట్సాప్ చూసిన ఇషాన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంతేకాకుండా తన భార్యపై విపరీతమైన కోపం తెచ్చుకున్నాడు.

భారత్-పాక్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయిన సందర్భంగా ఇషాన్ భార్య సంబురపడుతూ ఓ స్టేటస్ పెట్టిందని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాక్ ను సమర్థిస్తూ స్టేటస్ పెట్టిందని వెల్లడించాడు. భారతదేశంపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆరోపించాడు. ఈ క్రమంలోనే రామ్ పూర్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య చేసిన నిర్వాకాన్ని ఆధారలతో సహా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. అంతేకాకుండా భారత్ పై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఇషాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితురాలి స్టేటస్ ను పరిశీలించిన తర్వాత పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రామ్ పూర్ పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.

ఇండియా-పాక్ మ్యాచ్ రసవత్తరంగా ఉంటుంది. అయితే అది భార్యభర్తల గొడవ, పోలీసుల దాకా చేరింది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. దాయాదుల మధ్య పోటీ కాస్తా భార్యాభర్తల పోటీగా మారిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ కోసం భార్యపైనే ఫిర్యాదు చేశాడంటే... క్రికెట్ అంటే వీరాభిమానం ఉన్నట్టుందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైన ఇండియా-పాక్ జట్ల మధ్య జరిగిన పోరుతో ఈ భర్త భార్యపై ఫిర్యాదు చేయడం వైరల్ గా మారింది