Begin typing your search above and press return to search.

ఏటా ఒక షికాగో క‌ట్ట‌క‌పోతే..భార‌త్ బాగుప‌డదు

By:  Tupaki Desk   |   13 July 2018 12:02 PM IST
ఏటా ఒక షికాగో క‌ట్ట‌క‌పోతే..భార‌త్ బాగుప‌డదు
X
``భార‌త్ వెలిగిపోతోంది`` ఇది ఒక పార్టీ నినాదం అనుకోకండి. దేశంలోని వాస్త‌వ ప‌రిస్థితి. ఔను. భార‌త‌దేశంలో పెద్దఎత్తున‌ - శ‌ర‌వేగంగా ప‌ట్ట‌ణ జ‌నాభా పెరుగుతోంది. ఆదాయాన్ని స‌ముపార్జించే కేంద్రాలుగా ప‌ట్ట‌ణాలు మారుతుండ‌టంతో ప‌ట్ట‌ణాల్లో స్థిర‌ప‌డే వారి సంఖ్య వృద్ధి చెందుతోంది. దీంతో భార‌త గ్రాఫ్ మారుతోంది. తాజాగా కేంద్ర మంత్రి హర్‌ దీప్‌ సింగ్ పురి ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఐక్యరాజ్యసమితిలో అత్యున్నత రాజకీయ వేదిక(హెచ్ ఎల్‌ పీఎఫ్)ను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ భారత్‌ లో 2030 నాటికి 40 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తారని, ఈ భారీ డిమాండ్‌ ను తట్టుకునేందుకు దేశంలో ఏటా ఒక షికాగో అంతటి నగరాన్ని నిర్మించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ``2030 నాటికి భారత్‌ లో సుమారు 60 కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తారు. మొత్తం దేశ జనాభాలో ఇది 40శాతంగా ఉండనుంది. దేశంలో పట్టణీకరణ వేగం అనూహ్యంగా పుంజుకుంటుంది. ఈ భారీ డిమాండ్‌ ను అందుకోవాలంటే ఏటా పట్టణాల్లో 70-90 కోట్ల చదరపు మీటర్ల స్థలం కావాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ఏటా ఒక కొత్త షికాగో నగరాన్ని నిర్మించాల్సి ఉంటుంది.`` అని అన్నారు.

2030 నాటికి అవసరమైన కొత్త పట్టణ మౌలికసదుపాయాల్లో 70శాతాన్ని భారత్ నిర్మించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి అన్నారు. ఇందుకోసం దేశంపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఐరాస నిర్దేశించిన 2030 అభివృద్ధి ఎజెండాను విజయవంతంగా సాధించేందుకు ఇది దోహదపడుతుంది అని చెప్పారు. సమ్మిళిత వృద్ధిలో భాగంగా హరిత నగరాల నిర్మాణం - అధునాతన మౌలిక వసతుల కల్పన - కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణానికి భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నదని వెల్లడించారు. మానవహక్కులకు ప్రాధాన్యమిస్తూనే అభివృద్ధి ఎజెండాను అమలుచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం భారత జనాభా 120 కోట్లకు పైగా ఉందని, ఇందులో 30 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారని, 1947లో ఇది కేవలం 17 శాతమేనని మంత్రి పేర్కొన్నారు. పట్టణాల్లో మురికివాడలను రూపుమాపి అదే ప్రదేశంలో వారికి అధునాతన ఇండ్లను నిర్మిస్తామని తెలిపారు. అమెరికాలోని మూడో పెద్ద నగరమైన షికాగో 606 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి - 27 లక్షల జనాభాను కలిగి ఉంది.