Begin typing your search above and press return to search.

భారత్ లేనిదే కరోనా వ్యాక్సిన్ కల సాకారం కాదు!

By:  Tupaki Desk   |   11 Sep 2020 5:30 PM GMT
భారత్ లేనిదే కరోనా వ్యాక్సిన్ కల సాకారం కాదు!
X
కరోనా మహమ్మారి బారి నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు వ్యాక్సిన్ తయారీలో పలు దేశాలు తలమునకలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే, కరోనా వ్యాక్సిన్ `స్పుత్నిక్-వి`ని రష్యా విడుదల చేసింది. తమ రెండో వ్యాక్సిన్ అయిన `స్పుత్నిక్-5` మూడో దశ ప్రయోగాలు జరుపుకుంటోందని రష్యా ప్రకటించింది. అయితే, భారీ స్థాయిలో `స్పుత్నిక్-5` ఉత్పత్తి చేయాలనుకుంటున్న పుతిన్ సర్కార్ అందుకు భారత్ సహకారం కోరింది. ఫార్మా, బల్క్ డ్రగ్ రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన భారత్ తో ఇందుకు గాను చర్చలు జరుపుతోందని కోవిడ్-19 వ్యాక్సీన్ సంబంధిత జాతీయ నిపుణుల బృందం చీఫ్, నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ తెలిపారు. భారత్ భారీ స్థాయిలో స్పుత్నిక్-5 వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలగడం ఇటు రష్యాకు, అటు భారత్ కు చాలా ప్రయోజనకరం అని ఆయన అన్నారు. గతంలో ప్రపంచంలోని పలు దేశాలకు హైడ్రాక్సీ క్లోరో క్విన్ ను సరఫరా చేసిన భారత్....వ్యాక్సిన్ ను కూడా అందించగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

స్పుత్నిక్-5ను మొదటి, రెండవ ట్రయల్స్ గణాంకాలను భారత శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని, అవసరమైతే మూడో దశ ట్రయల్ కోసం చర్యలు మొదలుపెడతామని పాల్ అంటున్నారు. స్పుత్నిక్-5 వ్యాక్సీన్ తయారీకి 3 భారత ఫార్మా కంపెనీలు ముందుకు వచ్చాయి.

జెనెరిక్ మందులు తయారీ, ఎగుమతుల్లో అగ్రస్థానం ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2019లో భారత్ 201 దేశాలకు జెనెరిక్ మందులు విక్రయించి, బిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించింది. ఈ క్రమంలోనే భారత్ పై రష్యా కన్నుపడింది. వ్యాక్సీన్ ఉత్పత్తి, సరఫరా చేసే దేశాల జాబితాలో కూడా భారత్ ప్రపంచంలోని టాప్‌ దేశాల్లో ఒకటిగా నిలిచిందని ఇంటర్నేషనల్ మార్కెట్ ఎనాలసిస్ అండ్ కన్సల్టింగ్(ఐఎంఎఆర్‌సీ) గ్రూప్ నివేదిక చెబుతోంది. యునిసెఫ్‌కు 60 శాతం వరకు వివిధ వ్యాక్సీన్లను మన దేశం తయారుచేసి అందిస్తోంది. భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ ఖర్చు, ఉత్పత్తి వ్యయం కూడా తక్కువ కావడం కూడా భారత్ కు కలిసివచ్చింది.

కరోనా టీకాను ప్రపంచంలో ఏ మూల తయారు చేసినా....భారత్ సహకారం లేకుండా దానిని భారీగా ఉత్పత్తి చేయడం అసాధ్యమని ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరాం భార్గవ్ అన్నారు. ప్రపంచంలోని వ్యాక్సిన్లలో 60 శాతం భారత్ నుంచే సరఫరా అవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తయారు చేస్తోన్న కోవ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. ఐసీఎంఆర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ‘కోవాక్సిన్’ అనే టీకాను భారత్ బయోటెక్ తయారు చేసింది. గతంలో పోలియో, రోటా వైరస్, జికా వైరస్ లాంటి వాటికి కూడా టీకాలు భారత్ బయోటెక్ తయారు చేసింది. భారత్‌లో తయారైన వ్యాక్సీన్ ‘మొట్టమొదటి టీకా’గా మార్కెట్లోకి వస్తే, దానివల్ల భారత వ్యాక్సీన్, ఫార్మా ఇండస్ట్రీ దశ పూర్తిగా మారిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.