Begin typing your search above and press return to search.

ఆర్థికంగా దెబ్బ తిన్న ఆసియా దేశాల్లో అగ్రస్థానం భారత్ దేనా?

By:  Tupaki Desk   |   1 Sept 2020 10:00 PM IST
ఆర్థికంగా దెబ్బ తిన్న ఆసియా దేశాల్లో అగ్రస్థానం భారత్ దేనా?
X
వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ గురించి తెలిసిన వెంటనే ఎవరూ అంత సీరియస్ గా తీసుకున్నది లేదు. ఎక్కడ చైనా.. ఎక్కడ ఇండియా? దేశం మొత్తం వ్యాపించటం.. పరిస్థితులు దారుణంగా తయారు కావటం అయ్యే పనేనా? అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తే.. భారత్ లాంటి దేశంలోకి వైరస్ కానీ ప్రబలితే.. దాన్ని అడ్డుకునే శక్తి సామర్థ్యాలు దేశానికి లేవన్న వాదనల్ని కొందరు వినిపించారు.వైరస్ తో ప్రజల అనారోగ్యం.. వారి ప్రాణాలు ప్రమాదంలో పడటం ఎంత ముఖ్యమో.. ఆర్థికంగా దేశానికి ఎదురయ్యే సవాళ్లు అన్ని ఇన్ని కావు.

ఈ విషయం మొదట్లో అర్థం కాకున్నా.. లాక్ డౌన్ విధించిన వారానికే దేశ ప్రజలకు విషయం ఇట్టే అర్థమైపోయింది. బండి బాగా నడుస్తున్నప్పుడు ఉండే ధీమాకు.. ఏ మాత్రం తేడా వస్తే.. చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం అందరి అనుభవంలోకి వచ్చింది. రాజు.. పేద.. సంపన్న.. మధ్యతరగతి.. ఇలా వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కరోనా దెబ్బకు ఆర్థికంగా ప్రభావితమైన పరిస్థితి. దీంతో.. కరోనా వేళ ఆర్థిక సవాళ్లను అధిగమించటం ఎలా అన్నది ఇప్పుడో సమస్యగా మారింది అందరికి.

ఈ కారణంతోనే లాక్ డౌన్ ను అన్ లాక్ 1..2..3..4.. పేరుతో సడలించటాన్ని చూడొచ్చు. ఆర్థిక వ్యవస్థను ఎంత త్వరగా కోలుకునేలా చేస్తే తప్ప.. దేశం పరిస్థితి బాగుపడదన్న వైనాన్ని కేంద్ర.. రాష్ట్ర ప్రబుత్వాలు సైతం గుర్తించాయి. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. అదెంతన్న వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. లాక్ డౌన్ తో పోలిస్తే.. అన్ లాక్ తో పరిస్థితులు కాస్తంత మెరుగుపడ్డాయే కానీ.. పూర్తిస్థాయిలో కాదన్నది వాస్తవం. దీనికి తోడు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేపట్టిన సంక్షేమ పథకాలు పాలకులకు గుది బండగా మారాయి.

దేశంలో నెలకొన్న తాజా ఆర్థిక పరిస్థితిపై ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఒక నివేదికను సిద్ధం చేసింది. దీని ప్రకారం ఆసియాలో కరోనా కారణంగా దారుణమైన ప్రభావానికి గురైన దేశం భారతేనని పేర్కొంది. ఆసియా దేశాల్లో దెబ్బ తిన్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో రోజువారీగా పుట్టుకొస్తున్న కరోనా కేసుల్లో భారత్ వాటా 30 శాతంగా చెబుతున్నారు. మరెన్ని రోజులకు దీని బారి పడి ఉండాలో అర్థం కాని పరిస్థితి. భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకోవటానికి మరింత సమయం పడుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా వ్యాప్తి సామూహిక వ్యాప్తి దశకు చేరుకున్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు. ఈ నివేదిక ప్రకారం మధ్యస్థాయి పట్టణాలు.. గ్రామాల్లోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.