Begin typing your search above and press return to search.

మహమ్మారిపై అధిపత్యం భారత్ కు సాధ్యమవుతోంది

By:  Tupaki Desk   |   24 Jan 2021 1:00 PM IST
మహమ్మారిపై అధిపత్యం భారత్ కు సాధ్యమవుతోంది
X
ప్రపంచాన్ని వణికించిన కరోనా.. ఇప్పటికి పలు దేశాల్లో చుక్కలు చూపిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికాలో ఇప్పటికి కోవిడ్ కారణంగా మరణాలు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. మన కంటే ముందు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కరోనా తీవ్రత.. మరణాల విషయంలో మాత్రం జోరు తగ్గని పరిస్థితి. ఇదిలా ఉంటే.. మన దేశంలో మాత్రం మహమ్మారిపై అధిక్యతను ప్రదర్శించే పరిస్థితికి వచ్చేసినట్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా తీవ్రత ఇప్పటికే ఒక కొలిక్కి రావటం.. కేసుల నమోదు తగ్గుముఖం పట్టటం తెలిసిందే.

అంతేకాదు..దేశంలో కోవిడ్ మరణాల తీవ్రత కూడా తగ్గుముఖం పడుతోంది. వైరస్ కు చెక్ పెట్టేలా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవుతోంది. టీకాల పంపిణీలో భారత్ సరికొత్త రికార్డుల దిశగా అడుగులు వేస్తోంది. ఒకదశలో రోజుకు 90వేలకు పైగా కేసులు నమోదు కావటమే కాదు.. మరికొద్దిరోజుల్లో రోజుకు లక్షకు పైగా కేసులు నమోదు కావటం ఖాయమన్న భయాందోళనలు వ్యక్తమైన పరిస్థితికి భిన్నంగా.. కేసుల నమోదు అంతకంతకూ తగ్గటం మొదలైంది.

మరణాల విషయంలోనూ అలాంటి పరిస్థితి. ఆర్నెల్ల క్రితం రోజుకు కనీసం రెండు వేల మంది మరణించేవారు. డిసెంబరు మొదటి వరకు ఈ తీవ్రత ఇలానే ఉండేది. తర్వాత నుంచి తగ్గటం మొదలైంది. జనవరి ప్రారంభానికే మరణాల సంఖ్య బాగా తగ్గిపోవటమే కాదు.. రోజుకు 200 కంటే తక్కువగా మరణాలు నమోదువుతన్నాయి. ఇప్పుడు అంతకంటే తక్కువ మరణాలు నమోదు కావటం చూస్తే.. కరోనా విషయంలో మన దేశం అధిక్యతను ప్రదర్శిస్తుందన్న భావన కలుగక మానదు.

ఇదిలా ఉంటే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది. ప్రస్తుతం రోజుకు 15వేల కంటే తక్కువ కేసులు నమోదువుతన్నాయి. మరణాలు 150-160 మధ్య నమోదవుతున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 1.06కోట్లుగా ఉండగా.. మరణాల సంఖ్య 1.53లక్షలుగా ఉంది. మొత్తం కేసుల్లో మరణాల రేటు 1.44 శాతంగా ఉంది. రివకరీ రేటు కూడా మెరుగ్గా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారత్ లోనే అత్యధికంగా రికవరీ రేటు ఉందంటున్నారు. ప్రస్తుతం 96.82 శాతం ఉన్నట్లుగా చెబుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకున్న కొద్దీ.. ఇది మరింత పెరగటం ఖాయమని చెప్పక తప్పదు.