Begin typing your search above and press return to search.

భారత ఆర్థిక వ్య‌వ‌స్థ బాగు ప‌డాలంటే రూ.ప‌ది ల‌క్ష‌ల కోట్లు కావాలి!

By:  Tupaki Desk   |   12 April 2020 3:00 PM IST
భారత ఆర్థిక వ్య‌వ‌స్థ బాగు ప‌డాలంటే రూ.ప‌ది ల‌క్ష‌ల కోట్లు కావాలి!
X
క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌నే ఉద్దేశంతో దాని నివార‌ణ‌కు మార్చి 24వ తేదీ నుంచి లాక్‌ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా చిల్ల‌ర వ‌ర్త‌కం మిన‌హా ఏ ఆర్థిక కార్య‌క‌లాపాలు కొన‌సాగ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆర్థిక వ్య‌వ‌స్థ తీవ్ర సంక్షోభంలోకి ప‌డింది. దేశం - రాష్ట్రాల్లో సంప‌ద మార్గాలు - ఉత్ప‌త్తి కేంద్రాల‌న్నీ మూత‌ప‌డ‌డంతో ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ స‌మ‌యంలో భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ కోలుకునేలా త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంది. లేకుంటే పెను ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో కొంద‌రు ఆర్థిక‌వేత్త‌లు - నిపుణులు ప‌లు సూచ‌న‌లు అందిస్తున్నారు.

ఉపాధి కోల్పోయి గ‌డ్డు ప‌రిస్థితుల్లో ఉన్న పేద‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని రోజుల కింద‌ట రూ.1.70 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే అది కేవ‌లం పేద‌ల కోసమే వెచ్చించార‌. కానీ లాక్‌ డౌన్ వ‌ల‌న ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. వ్యాపారాలు కొన‌సాగ‌డం లేదు. అన్ని రంగాలు మూత‌ప‌డ‌డంతో తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. ఈ క్ర‌మంలో మొత్తం భార‌త‌దేశంలో ప్ర‌జ‌ల ఇబ్బందులు తీర్చేందుకు ఇప్పుడు ఏకంగా ప‌ది ల‌క్ష‌ల కోట్ల ఉద్దీప‌న ప్యాకేజీ ప్ర‌క‌టించాల‌ని కొన్ని ఆర్థిక సంస్థ‌లు - ఆర్థిక‌వేత్త‌లు - విశ్లేష‌కులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్ పొడిగించే అవ‌కాశాలు ఉండ‌డంతో ఆ సంఖ్య పెరిగే అవ‌కాశం కూడా ఉంది.

ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్దీపనాల కోసం ఆర్థిక వ్య‌వ‌స్థ కోలుకోవ‌డం ఎంత ప్యాకేజీ అవసరమో గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సీ అంచనా వేసింది. కరోనా వైర‌స్ ధాటికి దెబ్బ‌తిన్న భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకోవడానికి రూ.6 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల స్థాయిలో అదనపు ఉద్దీపన ప్యాకేజీ అవసరమని మెకిన్సే వెల్ల‌డించింది. ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ సుస్థిరత కోసం కనీసం రూ.6 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల అదనపు ఉద్దీపనల అవసరం ఉంద‌ని ఆ సంస్థ తన అధ్యయనంలో తెలిపింది. ఈ విష‌య‌మై ప్రస్తుత పరిస్థితుల అంచనా, సమస్యల పరిష్కారంపై వివిధ రంగాల్లోని 100 సంస్థల విధానకర్తలు - మార్కెటింగ్ నిపుణులు - సీనియర్ ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించి అధ్య‌య‌నం చేసినట్లు ఆ సంస్థ వివ‌రించారు. దీంతో పాటు ఆర్థిక వ్యవస్థ పురోగతికి మరిన్ని ఉద్దీపనాలు అవసరమని గుర్తుచేసింది.

అయితే ఆ సంస్థ భార‌త‌దేశంపై కరోనా ప్రభావం మూడు విధాలుగా ఉందని తెలిపింది. ఈ విపత్కర ఆర్థిక పరిస్థితులు ఎంఎస్ఎంఈలకు భారమని తేలింది. బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఐలు పెరగవచ్చునని హెచ్చిరించింది. అయితే జీడీపీ - వృద్ధిరేటుపై కూడా ఆ సంస్థ అధ్య‌య‌నం చేసి నివేదిక రూపొందించింది. ఏప్రిల్ 15వ తేదీకు లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు కేవ‌లం 1 శాతం నుంచి 2 శాతం నమోదు కావొచ్చునని అంచనా వేసింది. మే తొలి వారం వరకు కొన‌సాగిస్తే వృద్ధిరేటు క్షీణించి మైనస్ 2 శాతం నుంచి మైనస్ 3 శాతానికి పతనం కావొచ్చునని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

లాక్‌డౌన్‌తో అసంఘటిత రంగంలోనే పని చేసే వారు, రోజువారీ కూలీల భవితవ్యం ప్రమాదంలో పడిందని పేర్కొంది. కొనుగోళ్ల సామర్థ్యం పెంచేలా భారీగా అన్ని రంగాలకు ఉద్దీపనలు ప్రకటిస్తే పరిస్థితులు మెరుగుపడతాయని సూచించింది. విమానయానం, పర్యాటక రంగాలు తీవ్రంగా నష్టపోగా - ఐటీ అనుబంధ సేవలు - ఫార్మా - నిర్మాణ - బ్యాంకింగ్‌ రంగాలకు కూడా ఇబ్బందికరమేనని పేర్కొంది. రిటైల్‌ - ర్నిషింగ్ వంటి వాటిలో 30 శాతం డిమాండ్ వరకు పడిపోవచ్చునని - ఆహారం - యుటిలిటీస్ డిమాండ్ 10 శాతం మేర పడిపోవచ్చునని అధ్య‌య‌నంలో తేలింద‌ని ఆ సంస్థ తెలిపింది.

ఎంఎస్ ఎంఈ - ఎస్ ఎంఈల రుణాలు 25 శాతం వరకు డిఫాల్టుగా మారే ప్రమాద ఉందని హెచ్చ‌రించింది. లిక్విడిటీని అందించేందుకు - నష్టాన్ని తగ్గించేందుకు - నిరుపేదలకు బాధలు తగ్గించాలంటే ప్రభుత్వం ప్ర‌క‌టించిన రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ చాల‌ద‌ని చెబుతూనే ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే రూ.10 లక్షల కోట్లు లేదా జీడీపీలో 5 శాతం మొత్తంతో చర్యలు అవసరమని సూచించింది. అసంఘటిత రంగంలోని 13.5 కోట్ల మంది కార్మికులకు ప్రత్యక్ష ఆదాయ సహకారం అవసరమని తెలిపింది. ఈ నివేదిక భారత ఆర్థిక వ్య‌వ‌స్థ పుంజుకోవ‌డానికి దోహ‌దం చేసేలా ప‌లు అంశాలు ఉన్నాయి. దీన్ని ప‌రిశీలించి కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటే కొంత‌లో కొంత ఆర్థిక వ్య‌వ‌స్థ పుంజుకునే అవ‌కాశం మాత్రం ఉంది.