Begin typing your search above and press return to search.

భారత్ కు పాక్, చైనా కంటే ఎక్కువ ముప్పు?

By:  Tupaki Desk   |   14 Oct 2016 10:07 AM IST
భారత్ కు పాక్, చైనా కంటే ఎక్కువ ముప్పు?
X
భారతదేశానికి సరిహద్దునున్న పాకిస్థాన్ నుంచి - చైనా నుంచి చాలా ప్రమాదం ఉందనేది అంతా తెలిసిన విషయమే. ముఖ్యంగా ప్రత్యక్షంగా పాక్ చేసే పనికిమాలిన పనులు - పరోక్షంగా చైనా చేసే కార్యక్రమాలు భారత్ కు ఎప్పటికైనా సమస్యలే. పాక్ చేస్తున్న ఉగ్రదాడులు - అప్రకటిత కాల్పులు అయినా., చైనా చేసే అనవసరంగా వేలుపెట్టే విషయాలైనా భారత్ కు చికాకు కల్గించే విషయాలే. అయితే ఈ విషయంలో జాతీయ భద్రతా మాజీ సలహాదారు శివశంకర్ మీనన్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. వీరివల్ల కంటే ఎక్కువ ప్రమాదం భారత్ కు భారత్ లోనే ఉందని చెబుతున్నారు.

భారతదేశానికి పాకిస్థాన్ - చైనా లాంటి ఇతర దేశాల కంటే దేశంలో నుంచే ఎక్కువ ముప్పు ఉందని మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ అంటున్నారు ఆ రెండు దేశాల వల్ల భారతదేశానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేస్తున్న ఆయన... జాతీయ భద్రతకు అసలైన ముప్పు దేశం లోపలి నుంచే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో ఎన్.ఎస్.ఏ. గా పనిచేసిన మీనన్... భారతదేశానికి ప్రస్తుతం ఉన్న సమస్య దేశంలోనే అని, అది సంప్రదాయ శాంతిభద్రతల సమస్య కాదని తెలిపారు. 1950లలో బయటినుంచి ముప్పు ఉండేదని.. 60లలో చివరి వరకు కూడా అంతర్గతంగా వేర్పాటువాదులతో ముప్పు ఉండేదని.. ప్రస్తుతం దేశంలో వామపక్ష తీవ్రవాదం - ఉగ్రవాదం ఇవన్నీ క్రమంగా తగ్గుతున్నాయని చెప్పిన ఆయన ఇవన్నీ ఎక్కువ కాలం ఉండేవి కాదని తెలిపారు.

అయితే, 2012 తర్వాతి నుంచి దేశంలో మతఘర్షణలు - సామాజిక హింస - అంతర్గత హింస చాలా ఎక్కువైపోయాయని - వీటినే తక్షణం అరికట్టాలని మీనన్ సూచించారు. మహిళలపై హింస - వర్గాల మధ్య ఘర్షణ - కులాల మధ్య కుమ్ములాటలు... ఇలాంటివన్నీ సామాజిక - ఆర్థిక మార్పుల వల్లే వస్తున్నాయని వీటివల్ల దీర్ఘకాలంలో చాలా సమస్య తలెత్తుతుందని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/