Begin typing your search above and press return to search.

దేశానికి భారీ ఆర్థిక విపత్తు..మోడీతో కష్టమే?

By:  Tupaki Desk   |   22 May 2020 7:00 AM GMT
దేశానికి భారీ ఆర్థిక విపత్తు..మోడీతో కష్టమే?
X
మహమ్మారి వైరస్ ధాటికి భారతదేశం భారీ ఆర్థిక విపత్తులోకి జారిపోనుందా? దుర్భర దారిద్ర్యం.. ఆకలిచావులు, నిరుద్యోగం దేశంలో పెరిగిపోనుందా? ప్రధాని మోడీ దీన్ని హ్యాండిల్ చేయలేడా? ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశాన్ని ఎవరూ కాపాడలేరని ప్రఖ్యాత ఆర్థిక వేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ హెచ్చరించారు. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు.

తాజాగా రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశం ఎదుర్కోబోయే విపత్తు గురించి ఆందోళనగా ఉందని.. ప్రభుత్వం, ప్రతిపక్ష సలహాలు తీసుకోకుండా ప్రధాని మోడీ ఒంటిచేత్తో ఏమీ చేయలేరని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో చేయాలని.. లేదంటే దేశం భారీ ఆర్థిక విపత్తులోకి కూరుకుపోతుందని రఘురాం రాజన్ స్పష్టం చేశారు.

మహమ్మారి వల్ల భారత్ పెను సంక్షోభాన్ని ఎదుర్కోనుందని.. దేశంలోని నిపుణులను సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకోవాలని రాజన్ సలహా ఇచ్చారు. కరోనాతో కలిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఒక్కటే కాదని.. మూడు నాలుగేళ్ల కిందటి ఆర్థషిక వైభవం అందుకోవడం కీలకమన్నారు. ప్రస్తుతం రాజకీయాలు చూడవద్దని.. కలిసి పనిచేయాలని మోడీకి రాజన్ హితవు పలికారు. నైపుణ్యం గల వారి సలహాలు తీసుకోవాలన్నారు.

ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ భారత్ లో మహమ్మారి వల్ల కలిగిన నష్టంతో పోలిస్తే సరిపోదని రఘురాం రాజన్ స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న అన్ని రంగాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. లేదంటే ఏడాదిలోగా ఆర్థిక వ్యవస్థ మరింత భారీగా నష్టపోయే ప్రమాదముందన్నారు. మౌలిక ప్రాజెక్టులు, నిర్మాణ రంగంపై దృష్టిపెట్టాలని సూచించారు. ద్రవ్యలోటు పెరిగి, అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థలు దేశ పరపతి రేటింగ్ ను తగ్గిస్తాయనే ఆందోళన పక్కనపెట్టాలన్నారు.

అమెరికా వలే భారత దేశంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం సాధ్యం కాదని రఘురాం రాజన్ చెప్పుకొచ్చారు. ఎయిర్ లైన్స్, పర్యాటకం, మ్యాను ఫ్యాక్చరింగ్, నిర్మాణ రంగాలు భారత్ లో కుప్పకూలాయన్నారు. సంస్థలను ఆదుకునేందుకు రుణ పునర్ వ్యవస్థీకరణతోపాటు మూల ధన సాయం కూడా అవసరం కావొచ్చని చెప్పారు.

ఇక లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన.. దేశంలో హృదయవిదారకంగా ఉన్న వలస కార్మికులను మోడీ ప్రభుత్వం ఆదుకోవాలని.. వారికి నిత్యావసరాలు, షెల్టర్ ఇవ్వాలని రఘురాం రాజన్ సూచించారు. రేషన్ ఇస్తే సరిపోదన్నారు. ఉచిత నగదు కూడా చేతికి ఇవ్వాలన్నారు.