Begin typing your search above and press return to search.

మళ్లీ అదే మాట .. చైనాతో సైనిక చర్చలు విఫలం !

By:  Tupaki Desk   |   11 Oct 2021 9:01 AM GMT
మళ్లీ అదే మాట .. చైనాతో సైనిక చర్చలు విఫలం !
X
తూర్పు లడఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు చైనాతో ఆదివారం జరిగిన 13వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలపై భారత సైన్యం కీలక ప్రకటన చేసింది. కోర్ కమాండర్ స్థాయి చర్చలు ఫలించలేదని సోమవారం వెల్లడించింది. వివాదం పరిష్కారం కోసం భారత్‌ చేసిన నిర్మాణాత్మక సూచనలను చైనా అంగీకరించలేదని సైన్యం వెల్లడించింది. అంతేకాదు, పరిష్కారం కోసం ఎటువంటి ప్రతిపాదనలు కూడా ఆ దేశం చేయలేదని పేర్కొంది. దెప్సాంగ్‌ సహా ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై భారత్, చైనా మధ్య ఆదివారం కోర్ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి.

చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌లో ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ చర్చలు దాదాపు ఎనిమిదన్నర గంటల పాటు జరిగాయి. బలగాల ఉపసంహరణతో పాటు పలు అంశాలను లేవనెత్తిన భారత్.. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న చైనా ఏకపక్ష చర్యలను ప్రస్తావించినట్టు ఆర్మీ తెలిపింది.సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు చైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. అయితే వీటిపై చైనా నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని సైన్యం తెలిపింది.

నిన్న జరిగిన సమావేశంలో ఉద్రిక్త ప్రాంతాల్లో సమస్య పరిష్కారం కోసం భారత్‌ పలు నిర్మాణాత్మక సూచనలు చేసింది. కానీ చైనా వాటికి అంగీకరించలేదు సరికదా, వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఎలాంటి ప్రతిపాదనలు కూడా చేయలేదు. దీంతో ఉద్రిక్త ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై ఈ చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు. అయితే మైదానంలో స్థిరత్వం, కమ్యూనికేషన్ నెలకొల్పడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇరు దేశాల మధ్య సంబంధాల పూర్తి దృక్పథాన్ని చైనా పరిగణనలోకి తీసుకుంటుందని, ద్వైపాక్షిక ఒప్పందాలు, నిర్ణయాలకు కట్టుబడి సరిహద్దు వివాదంపై సత్వర పరిష్కారానికి పొరుగు దేశం కృషి చేస్తుందని భావిస్తున్నాం అని భారత సైన్యం వెల్లడించింది.

అటు, చర్చలు విఫలమైనట్టు చైనా సైతం సంకేతాలు వెలువరించింది. ‘చర్చలను సంక్లిష్టం చేసేలా అసమంజసమైన, అవాస్తవమైన డిమాండ్‌లపై భారత్ పట్టుబడుతోంది అని చైనా సైన్యం వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాదిన్నరగా వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడఖ్‌లో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ఉద్రిక్తతలను తగ్గించి, సైన్యాలను ఉపసంహరించడం కోసం పలు దఫాలుగా కోర్‌ కమాండర్‌ స్థాయి, దౌత్య పరమైన చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పాంగాంగ్‌ సరస్సు దక్షిణ, ఉత్తర ప్రాంతాల నుంచి, ఆగస్టులో గోగ్రా ప్రాంతం నుంచి భారత్, చైనాలు తమ బలగాలను ఉపసంహరించాయి. దెప్సాంగ్, హాట్ స్ప్రింగ్స్‌లో భారీగా మోహరించిన సైన్యాలను మళ్లించాల్సి ఉంది. ప్రస్తుతం 50 నుంచి 60 వేల సైన్యాలను ఒక్కో దేశం ఎల్ఏసీ వద్ద సున్నితమైన ప్రాంతాల్లో మోహరించాయి. రెండు దేశాలు సమంగా వెనక్కి తగ్గితే.. ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవించుకున్నట్టవుతుందని సూచించినప్పటికీ.. చైనా ఆర్మీ అధికారులు అంగీకరించలేదని స్పష్టం చేశారు.