Begin typing your search above and press return to search.

భార‌త భూభాగంలో చైనా సైన్యం..చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయ్!

By:  Tupaki Desk   |   7 Jun 2020 9:54 AM IST
భార‌త భూభాగంలో చైనా సైన్యం..చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయ్!
X
ఓవైపు దేశ‌మంతా క‌రోనాతో పోరాడుతుంటే.. స‌రిహ‌ద్దుల్లో సైన్యం దేశాన్ని కాపాడేందుకు శ‌త్రు దేశాల‌తో త‌ల‌ప‌డాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. అద‌ను చూసి భార‌త్‌ను దెబ్బ కొట్ట‌డానికి ఇటు పాకిస్థాన్ - అటు చైనా స‌రిహ‌ద్దుల్లో కాచుకుని ఉన్నాయి. ముఖ్యంగా భారత్ - చైనా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడటానికి దారి తీసిన లద్దాఖ్‌ సరిహద్దు వివాదం అంత‌కంత‌కూ పెద్ద‌ద‌వుతోంది. ఐతే ఈ విష‌యంలో ఘ‌ర్ష‌ణ మార్గంలో వెళ్తే మంచిది కాద‌ని భావించిన భార‌త్‌.. చైనాతో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మైంది. సరిహద్దు వివాదానికి కారణమైన లద్దాఖ్ సెక్టార్‌లోనే శ‌నివారం ఉదయం చర్చలు ఆరంభమ‌య్యాయి. చైనా - భారత సరిహద్దుల్లోని మాల్డో వద్ద ఏర్పాటు చేసిన బోర్డర్ మీటింగ్ పాయింట్ వద్ద ఈ చర్చలు సాగాయి. భారత్ తరఫున 14 కార్ప్స్ లెప్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ - చైనా తరఫున మేజర్ జనరల్ లియు చర్చల్లో పాల్గొన్నారు. రెండు దేశాల తరఫున చర్చల్లో పాల్గొన్న వారి సంఖ్య పరిమితంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చర్చల సందర్భంగా భారతే తన తొలి వాదనను వినిపించినట్లు సమాచారం. ఉద్రిక్తతలకు కారణమైన పరస్థితులను ఆయన సవివరంగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధులకు వివరించినట్లు తెలుస్తోంది. తామేమీ వివాదాల లోతుల్లోకి వెళ్లబోవట్లేదని హరీందర్ సింగ్ స్పష్టం చేశార‌ట‌. ఏప్రిల్‌కు ముందు నాటి ప్ర‌శాంత‌మైన‌ పరిస్థితులు సరిహద్దుల్లో నెలకొనడానికి సహకరించాలని సూచించినట్లు సమాచారం. ఏప్రిల్లోనే చైనా సైనికులు భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడం ఆరంభమైంది. మేలో అది మరింత పెరిగింది. దీంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. త‌మ భూభాగంలో మోహరింపజేసిన సైన్యాన్ని ఉపసంహరించుకోవాల‌ని.. వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పాటు చేసిన సైనిక శిబిరాలను, యుద్ధ సామాగ్రిని తరలించాలనే డిమాండ్‌ను హ‌రీంద‌ర్ చైనా ప్రతినిధుల ముందు ఉంచినట్లు చెబుతున్నారు. దీనిసై చైనా ప్ర‌తినిధులు ఏమ‌న్నారో తెలియాల్సి ఉంది. చైనా సైన్యం భార‌త భూభాగంలో మోహ‌రించిన సైన్యానికి సంబంధించి ఉపగ్రహ చిత్రాలు తాజాగా విడుదల అయ్యాయి.