Begin typing your search above and press return to search.

చైనాపై మరో ‘డిజిటల్ స్ట్రైక్’...43 యాప్ లు బ్యాన్

By:  Tupaki Desk   |   25 Nov 2020 12:30 AM GMT
చైనాపై మరో ‘డిజిటల్ స్ట్రైక్’...43 యాప్ లు బ్యాన్
X
కొద్ది నెలలుగా భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తోన్న చైనా బలగాలకు భారత సైన్యం దీటుగా జవాబిస్తోంది. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తీరు మారని చైనా సైన్యం....ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని సరిహద్దులో ఓ గ్రామాన్ని ఆక్రమించుకొని పాగా వేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సమాచార గోప్యత దృష్ట్యా మరో 43 చైనా యాప్ లపై మోడీ సర్కార్ నిషేధం విధించింది. చైనా నుంచి నడుస్తోన్న ఈ 43 యాప్ లపై ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ నిషేధం విధించిందని కేంద్రం ప్రకటించింది. కేంద్ర హోం శాఖతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత, సమాచార గోప్యతకు భంగం కలిగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 267 చైనా యాప్ లై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

గతంలో టిక్ టాక్, పబ్ జీ వంటి ప్రముఖ యాప్ లతో పాటు తాజాగా నిషేధించిన కేంద్రం తాజాగా అలీ ఎక్స్‌ప్రెస్‌, స్నాక్‌ వీడియో, మ్యాంగో టీవీ వంటి పలు యాప్ లపై ఉక్కుపాదం మోపింది. సమాచార గోప్యత పాటించడం లేదన్నకారణంతో వీటిపై కేంద్రం ఐటీ చట్టం 69 ఏ సెక్షన్‌ ప్రకారం నిషేధం విధించింది. చైనా రిటైల్‌ దిగ్గజం అలీ బాబా గ్రూప్‌నకు చెందిన 4 యాప్‌లతో పాటు మరికొన్ని ప్రముఖ చైనా యాప్ లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ 43 యాప్ లపై భారతీయ యూజర్ల నుంచి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని, అందుకే నిషేధం విధించామని కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ తెలిపింది. గాల్వన్ లోయలో ఘర్షణల అనంతరం పాక్ పై సర్జికల్ దాడుల తరహాలో చైనాపై 'డిజిటల్ స్ట్రయిక్స్' పేరిట యాప్ లపై నిషేధం విధిస్తూ చైనాకు బుద్ధి చెబుతోందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.