Begin typing your search above and press return to search.

భారత్ ఆర్మీ కరోనా కోసం 1,000 పడకల హాస్పిటల్ నిర్మించిందా?

By:  Tupaki Desk   |   1 April 2020 2:20 PM IST
భారత్ ఆర్మీ కరోనా కోసం 1,000 పడకల హాస్పిటల్ నిర్మించిందా?
X
భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య వేయి దాటింది. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య, ఆరోగ్య వ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరత. ఎందుకంటే, దేశంలో 70,000 ఐసీయూ పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అమెరికాలో లాగా ఈ కరోనా భారత్ లో విజృంభిస్తే ...ఇండియాని కాపాడటం ఎవరితరం కాదు. ఈ నేపథ్యంలో ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. "బాడ్‌ మేర్‌ లో మన సైన్యం వెయ్యికి పైగా పడకలు ఉన్న అత్యాధునిక ఆస్పత్రిని రెండు రోజుల్లో సిద్ధం చేసి రాజస్థాన్ ప్రభుత్వానికి మూడు ఆస్పత్రులను అంకితం చేసింది. దేశ జవాన్ల సత్తాకు సలాం. దేశానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, నా జవాన్లు, రైతులు దేశాన్ని కాపాడుతారు. జై జవాన్, జై కిసాన్” అని పెడుతున్నారు

మరో ట్వీట్‌ లో “మన సైన్యం రాజస్థాన్‌లోని బాడ్‌మేర్‌లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించింది. దీనిని సెటప్ చేయడానికి కొన్ని గంటలే పడుతుంది. ఇప్పటివరకూ మనం చైనా ఇలాంటి ఘన కార్యాలు చేసిందనే వార్తలు వింటున్నాం. మన సైన్యం సాధించినవాటిని మాత్రం మరిచి పోతున్నాం” అని పెట్టారు. ఈ పోస్టుతో పాటు మూడు ఫొటోలు కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ షేర్ అవుతున్నాయి.

అందులో మొదటి ఫోటో .. ఈ వాహనాలు ఉన్న మొబైల్ ఆస్పత్రి రష్యా లో నిర్మించిందని, కిర్గిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖకు దీనిని డొనేట్ చేశారని తెలిసింది. రెండో ఫొటోలో మన సైన్యం నిర్మించిన ఆస్పత్రి లోపల నుంచి ఎలా కనిపిస్తుందో చూడండి అని చెప్పారు. నిజానికి ఈ ఫొటో 2008 నవంబర్‌లో తీసింది. అమెరికా ఎయిర్‌ఫోర్స్ వెబ్‌సైట్‌ లో ఈ ఫొటో ఉంది. దానితోపాటు మొబైల్ ఫీల్డ్ ఆస్పత్రి లోపల ఇలా కనిపిస్తుంది అని రాశారు. ఈ ఆస్పత్రి లో క్లైమెట్ చేంజ్ సిస్టమ్ లాంటి అన్నిరకాల వైద్య పరికరాలు, రోగులకు విషమ పరిస్థితుల్లో కూడా చికిత్స అందించేందుకు ఉపయోగపడే మందులు ఉంటాయి. ఇలాంటి మూడు ఆస్పత్రులు నిర్మించారు.

ఇక మూడో ఫొటోలో ఇండియన్ ఆర్మీకి చెందిన కొంతమంది జవాన్లు కూర్చుని కనిపిస్తున్నారు. ఈ ఫొటో బాడ్‌ మేర్‌ లో నిర్మించిన ఆర్మీ ఆస్పత్రిదే అని చెబుతున్నారు. 2015లో నేపాల్‌లో భూకంపం వచ్చినపుడు ఇండియన్ ఆర్మీ సైన్యం అత్యవసర సేవల కోసం కాఠ్మండూ ఎయిర్ బేస్‌లో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటుచేసింది. అంటే, ఈ మూడు ఫొటోలూ పాతవి. సోషల్ మీడియా లో చెబుతున్న వాదనలకూ ఈ ఫొటోలకూ ఎలాంటి సంబంధం లేదు. దీని పై ఇండియన్ ఆర్మీ కూడా స్పందించింది.

మార్చి 23న భారత పదాతి దళ ప్రతినిధి తన ట్వీట్‌ లో భారత సైన్యం బాడ్‌మేర్‌లో కరోనావైరస్ బాధితుల కోసం వెయ్యి పడకల క్వారంటైన్ సెంటర్ నిర్మించిందని సోషల్ మీడియాలో వస్తున్న వాదనలు అబద్ధం అని చెప్పారు. దీనితో కరోనా రోగుల కోసం భారత సైన్యం ఎలాంటి వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించలేదనే విషయం స్పష్టం అయ్యింది. దానితోపాటూ రాజస్థాన్‌ లోని బాడ్‌ మేర్ జిల్లాలో కట్టినట్లుగా చెబుతున్న ఆస్పత్రులు నిజానికి రష్యా, అమెరికాలోని మొబైల్ ఆస్పత్రులకు చెందినవి అని తేలింది.