Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మనో బలాన్ని పెంచుతున్న గులాబీ దళం తప్పులు

By:  Tupaki Desk   |   22 Sep 2021 3:54 AM GMT
కాంగ్రెస్ మనో బలాన్ని పెంచుతున్న గులాబీ దళం తప్పులు
X
భయానికి మించింది మరొకటి ఉండదంటారు. తన ప్రత్యర్థుల్లో భయాన్ని కలిగించి.. కోలుకోకుండా దెబ్బ తీయటమే గులాబీ బాస్ కేసీఆర్ బలంగా చెబుతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినా.. ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకం కేసీఆర్ లో ఉండేది కాదు. అనూహ్యంగా ప్రజలు ఇచ్చిన సానుకూల తీర్పు ఆయన చేతికి అధికారం వచ్చింది. దీంతో.. ఆయన ప్రభుత్వాన్ని స్థిరపర్చటంతో పాటు.. ప్రత్యర్థుల్ని వ్యూహాత్మకంగా బలహీనపరుస్తూ వచ్చారు. విపక్షం బలంగా ఉంటే.. అధికారపక్షానికి ఉండే తలనొప్పులు అన్ని ఇన్ని కావు. ఈ విషయం సుదీర్ఘకాలం విపక్షంలో ఉన్న కేసీఆర్ కు తెలియనిది కాదు

అందుకే ఆయన తీసుకున్న నిర్ణయాలు.. అనుసరించిన విధానాలు తెలంగాణలో ప్రతిపక్షం అన్నది లేనట్లుగా తయారైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పదేళ్లు కాంగ్రెస్ పవర్ లో ఉన్నప్పటికీ.. ఆ పార్టీ నేతలకు ఉనికే లేకుండా చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు బలంగా ఉండే కాంగ్రెస్ నేతలు.. కేవలం గతాన్ని గుర్తు చేసుకొని తమ ఘనత గురించి చెప్పుకోవాలే కానీ.. వర్తమానంలోనూ.. భవిష్యత్తులోనూ అలాంటి పరిస్థితే ఉండదన్నట్లుగా వ్యవహరించారు.

ఆయన ఎత్తులను చిత్తు చేసే సమర్థత కాంగ్రెస్ నాయకత్వంలో లోపించటంతో.. గడిచిన ఆరున్నరేళ్లుగా అంతకంతకూ దిగజారటమే కాదు.. బలాన్ని పెంచుకున్నది లేదు. దీంతో.. కాంగ్రెస్ నేతల్లోనూ.. కార్యకర్తల్లోనూ తీవ్రమైన నిరాశలోకి పడిపోయేలా చేశాయి. అంతేకాదు.. వరుస ఓటములతో గులాబీ దళం అంటేనే భయం కలిగించేలా చేశారు. గులాబీ ఫియర్ కాంగ్రెస్ కు ఎంతలా పట్టేసిందంటే.. నోరు విప్పి ఘాటుగా స్పందించే లక్షణాన్ని చాలామంది నేతలు మర్చిపోయారు. ఇలాంటివేళ.. కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ ను తెలంగాణ పార్టీ చీఫ్ గా నియమించటంతో పరిస్థితిలో మార్పు మొదలైంది.

జంకుబొంకు లేనట్లుగా ముఖ్యమంత్రి మొదలు ఎవరిపైనైనా సరే.. విరుచుకుపడటం రేవంత్ కు అలవాటు. అదే ఆయన అస్త్రం కూడా. అన్ని హంగులు ఉన్న రేవంత్.. వ్యూహాత్మకంగా ఒకటి తర్వాత ఒకటి చొప్పున యాక్టివిటీస్ ను షురూ చేయటం.. టీఆర్ఎస్ దళం మీద ఒత్తిడిని పెంచటం మొదలు పెట్టారు. గడిచిన కొన్నేళ్లుగా బలమైన నేతల్ని ఢీ కొనటం అనే కాన్సెప్టును మర్చిపోయిన గులాబీ దళానికి.. అధికారాన్ని చెలాయించటమే తప్పించి.. దాన్ని సవాలు విసిరే వారిని ఎదుర్కొనే తీరును వారు మర్చిపోయారు.

ఇదే వారికున్న అతి పెద్ద సమస్యగా చెప్పాలి. దీంతో.. రేవంత్ ను ఎలా డీల్ చేయాలన్న దానిపై ఒక వ్యూహం లేకుండా పోయింది. ఇది ఆయనకు మరింత కలిసి వచ్చేలా చేసింది. ఉద్యమ సమయంలో కేసీఆర్ కానీ కేటీఆర కానీ కవిత కానీ హరీశ్ లు కానీ.. తాము టార్గెట్ చేసిన పార్టీకి చెందిన అధినేతల్ని లక్ష్యంగా చేసుకొని మాటల తూటాల్ని విసిరేవారు. గులాబీ బాస్ కేసీఆర్ విషయానికే వస్తే.. నాటి ప్రధాని మన్మోహన్.. కాంగ్రెస్ అధినేత్రి కమ్ యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా (చాలా తక్కువ సార్లు)లను మాత్రమే కాదు.. చివరకు 2014 ఎన్నికల సమయంలో మోడీ మీదా విరుచుకుపడేందుకు ఆయన తటపటాయించలేదు. దేశంలో మరెక్కడా లేని రీతిలో.. మోడీపై ఆ స్థాయిలో నిప్పులు చెరిగింది కేసీఆరేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలా తన వ్యాఖ్యలతో అమితమైన ప్రచారాన్ని పొందటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.

కేటీఆర్.. కవిత.. హరీశ్ లు సైతం తమ స్థాయి మించి.. చంద్రబాబు మొదలు పెద్ద పెద్ద నేతల్ని టార్గెట్ చేయటం ద్వారా.. ప్రజలకు దగ్గరయ్యారు. పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడే వ్యూహాన్ని తాజాగా రేవంత్ అనుసరించారు. గులాబీ ముఖ్యుల ఒకప్పటి వ్యూహాన్ని తాజాగా రేవంత్ రిపీట్ చేయటం.. దాన్ని ఎదుర్కొనే విషయంలో టీఆర్ఎస్ అధినాయకత్వం సిద్ధంగా లేకపోవటం ఇబ్బందికరంగా మారింది.

ముందస్తు వ్యూహం లేకుండా చేస్తున్న యుద్దంలో గులాబీ దళం ఎదురు దెబ్బలు తింటోంది. దీని కారణంగా జరుగుతున్న నష్టం ఏమంటే.. గులాబీ దళాన్ని ఎదుర్కొవాలంటే మరేదో శక్తి ఉండాలన్న భావన తుడిచి పెట్టుకుపోవటమే కాదు.. టీఆర్ఎస్ ను ఢీ కొనే శక్తి తమకు లేదనే భయం సడలిపోతోంది. ఒకవిధంగా చెప్పాలంటే.. గులాబీ బాస్ కేసీఆర్ ఏళ్లు ఏళ్లు కష్టపడి తెచ్చిన భయం ఇప్పుడు తొలిగిపోతోంది. ఇదంతా ఆ పార్టీ ముఖ్యనేతల వ్యూహ లోపమనే మాట వినిపిస్తోంది. మరిప్పటికైనా కళ్లు తెరుస్తారా? లేక తప్పుల మీద తప్పులు చేస్తారా? అన్నది కాలమే నిర్ణయించాలి.