Begin typing your search above and press return to search.

కొండలా అప్పులు పెరుగుతున్నా.. జగన్ కానుక తగ్గట్లేదుగా?

By:  Tupaki Desk   |   27 Dec 2021 12:05 PM IST
కొండలా అప్పులు పెరుగుతున్నా.. జగన్ కానుక తగ్గట్లేదుగా?
X
ఎవరెన్ని చెప్పినా సరే.. తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేసే విషయంలో వెనక్కి తగ్గని మొండితనం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతం. ఓపక్క కొండలా పెరిగిపోతున్న రాష్ట్ర అప్పులు.. రోజురోజుకు దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి. ఇలాంటివేళలోనూ.. వరాలు ఇవ్వటం.. లబ్థిదారులకు తాయిలాల్ని పెద్ద ఎత్తున ఇవ్వటం లాంటివి ఏపీ సీఎం జగన్ కు తప్పించి మరే సీఎంకు సాధ్యం కాదేమో? కష్టాలు ఎన్ని వచ్చినా.. ఆర్థిక ఇబ్బందులు ఎంత తీవ్రంగా ఉన్నా.. తాను అనుకున్న వారికి అనుకున్నట్లుగా సంక్షేమ పథకాల్ని పంపిణీ చేయటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

అందుకుతగ్గట్లే.. కొత్త సంవత్సరం వేళ ఫించన్ దారులకు సంతోషకర వార్తను ప్రకటించారు. కొత్త సంవత్సరం మొదటి నుంచి ఇప్పటివరకు ఇస్తున్న ఫించన్ కు అదనంగా రూ.250 జత చేయనున్నారు. దీంతో.. ఫింఛన్ మొత్తం నెలకు రూ.2500కానుంది. ఇప్పటివరకు పెద్ద వయస్కులకు ఇస్తున్న పెన్షన్ రూ.2250గా ఉంటే.. ఇప్పుడు మరింత పెరగనుంది. దీనికి సంబంధించి లబ్థిదారులకు సీఎం జగన్ లేఖలు రాశారు.

గత ప్రభుత్వం దిగిపోవటానికి ఆర్నెల్ల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య 39 లక్షలు అయితే.. అది కాస్తా ఇప్పుడు 61 లక్షలుగా మారింది. గత ప్రభుత్వం పెన్షన్ల మీద పెట్టిన ఖర్చు నెలకు రూ.400 కోట్లు అయితే.. ఇప్పటి ప్రభుత్వం దాదాపు రూ.1450 కోట్లుగా వెల్లడించారు. ఆర్థిక భారమైనా.. కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా.. అవ్వాతాతలు.. అక్కచెల్లెమ్మల ముఖాల్లో ఆనందం చూడాలన్న తపనతో ఏటా రూ.18వేలకోట్ల పెన్షన్ల ఖర్చును చిరునవ్వుతో మనందరి ప్రభుత్వం భరిస్తోంది. తాజాగా పెంచిన మొత్తంతో ఈ ఖర్చు వచ్చే ఏడాది నుంచి దాదాపు రూ.20వేల కోట్లకు పెరగనుంది.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెన్షన్ల పెంపు చేయటంతో పాటు.. ప్రతి నెల మొదటి రోజు మీ గడప ముందుకు వచ్చి.. మీ తలుపు కొట్టి మీకు గుడ్ మార్నింగ్ పెట్టి మరీ పెంచిన పెన్షన్ అందేలా వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాను. కరోనా కారణంగా ఎన్ని ఇక్కట్లు ఉన్నా.. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా.. మీ కష్టాలు తెలుసు కాబట్టే.. ఠంఛన్ గా పించన్ అందేలా చూస్తున్నాను. పెన్షన్ల భారాన్ని ఎలా తగ్గించాలన్నది గత పాలకుల విధానం అయితే.. అర్హులైన ఏ ఒక్కరు పెన్షన్ కు దూరంగా ఉండకూడదన్నది తన పోరాటంగా జగన్ పేర్కొన్నారు.