Begin typing your search above and press return to search.

మహిళల పై పెరిగి పోతున్న దాడులు.. రాష్ట్రపతి ఆందోళన !

By:  Tupaki Desk   |   11 Dec 2019 1:54 PM IST
మహిళల పై పెరిగి పోతున్న దాడులు.. రాష్ట్రపతి ఆందోళన !
X
ఈ సమాజం లో ఆడపిల్లగా పుట్టినందుకు ప్రతి ఆడపిల్ల భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు అంటే దేశంలో రోజురోజుకి ఆడవారిపై జరిగే అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు కానీ , ప్రభుత్వాలు కానీ ఆడవారి పై జరిగే దారుణాలని అరికట్టడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు. ఎన్ని చర్యలు , చట్టాలు తీసుకువచ్చినప్పటికీ మానవ మృగాళ్ల భారీ నుండి కొంతమంది అమాయకమైన అమ్మాయిల జీవితాలని కాపాడలేకపోతున్నారు. దీనిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కుల దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో మాట్లాడుతూ అయన ఈ విదంగా కామెంట్స్ చేసారు.

ఐక్యరాజ్యసమితి 1948లో యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (యూడీహెచ్‌ఆర్‌)ను ఆమోదించగా.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్‌ 10వ తేదీని మానవ హక్కుల దినంగా పాటిస్తున్నారు. యూడీహెచ్‌ఆర్‌ రూప కల్పన లో భారత్‌ కు చెందిన సంఘసంస్కర్త, విద్యావేత్త హన్సా జీవ్‌రాజ్‌మెహతా కీలకపాత్ర పోషించారని, ఆ ప్రకటనలోని ఆర్టికల్‌ 1 ముసాయిదా లో ‘ఆల్‌ మెన్‌ ఆర్‌ బోర్న్‌ ఫ్రీ అండ్‌ ఈక్వల్‌’ అన్న వాక్యాన్ని హన్సా ‘ఆల్‌ హ్యూమన్స్‌...’గా మార్చడానికి కృషి చేసి విజయం సాధించారని రాష్ట్రపతి గుర్తు చేశారు. అయితే స్త్రీ, పురుష సమానత్వం, మానవ హక్కుల విషయంలో హన్సా లాంటి దార్శనికుల స్వప్నాలను సాకారం చేసేందుకు చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని రాష్ట్రపతి అన్నారు.

దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస సంఘటనలు మనల్ని పునరాలోచనలో పడేస్తున్నాయని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని, ఇది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రతి ఒక్కరూ ఆత్మ శోధన చేసుకోవాలి అని అయన తెలిపారు. పిల్లలు, వెట్టిచాకిరీలో మగ్గుతున్న వారు, స్వల్ప నేరాలకు గాను దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న వారిపట్ల సానుభూతి చూపాల్సిన అవసరముందని, వీరి హక్కుల విషయంలో మరింతగా ఆలోచన చేయాల్సి ఉందని వివరించారు. మానవ హక్కుల ఉల్లంఘన పై ప్రపంచం అంతా చర్చ జరగాలి అని అయన అన్నారు.