Begin typing your search above and press return to search.

సొంత నేతలకే టోపీ పెడుతున్న పార్టీలు

By:  Tupaki Desk   |   11 Nov 2017 3:30 PM GMT
సొంత నేతలకే టోపీ పెడుతున్న పార్టీలు
X
తెలుగు రాష్ర్టాల్లో పాలన సాగిస్తున్న అధికార పార్టీలు ప్రజలనే కాదు సొంత పార్టీ నాయకులను కూడా మాయ చేస్తున్నాయట. ఇతర పార్టీల నేతలను మాయచేసి ప్రలోభపెట్టి తమ పార్టీల్లోకి చేర్చుకున్న తరువాత నేతల సంఖ్య ఎక్కువైపోవడంతో నియోజకవర్గాల్లో ఎవరికి టిక్కెట్ వస్తుందో ఎవరికి రాదో తెలియని పరిస్థితి. దీంతో ముందు నుంచి పార్టీలో ఉన్నవారు, కొత్తవారి మధ్య టిక్కెట్ కోసం పోటీ ఉంటోంది. ఈ నేపథ్యంలో కొందరు నేతలు ఈ పోటీలో చివరికి ఏమవుతుందో తెలియదు కాబట్టి ముందే విపక్షంలోకి వెళ్లడం బెటరన్న ఆలోచనలో ఉంటున్నారు. అయితే... ఈ ప్రమాదం పసిగట్టిన అధికార పార్టీలు అడ్డగోలు హామీతో వారిని ఆశల్లో బతికేలా చేస్తున్నాయి. అసెంబ్లీ సీట్లు కచ్చితంగా పెరుగుతాయని ఆశలు కల్పిస్తూ ఎవరూ పార్టీ వీడకుండా ప్రస్తుతానికి కాపాడుకుంటూ వస్తున్నాయి.

నిజానికి ప్రధాని మోడీయే అసెంబ్లీ సీట్ల పెంపు లేనట్లేనని తేల్చేశారు. లెక్క ప్రకారం 2026 వరకు ఏపీ - తెలంగాణల్లో సీట్లు పెంచే చాన్సే లేదు. పోనీ... లెక్కల సంగతిని పక్కనపెట్టి అసెంబ్లీ సీట్లు పెంచే మార్గముందా అంటే ఉంది. కానీ... అది చాలా పెద్ద ప్రాసెస్. ఏపీ - తెలంగాణల్లో తమకు సీట్లు సాధించిపెట్టలేని సీట్ల పెంపు విషయాన్ని కేంద్రంలోని బీజేపీ చేపట్టే ఛాన్సే లేదు. పైగా ఇదంతా ఎన్నికల నాటికి పూర్తవ్వాలంటే ఇప్పుడే మొదలవ్వాలి. కానీ.. అలాంటి సూచనలే లేవు. సో... సీట్ల పెంపు లేనట్లే.

ఈ సంగతి తెలిసినా కూడా రెండు రాష్ర్టాల్లోని పాలక పక్షాలు తమ నేతలను మాత్రం సీట్ల పెంపు ఆశ చూపిస్తున్నాయి. తెలంగాణలోని టీఆరెస్ పార్టీ ఇటీవల ఈ విషయంలో కొంత తగ్గినా ఏపీలో చంద్రబాబు మాత్రం ఇంకా అదే పాట పాడుతున్నారు. సీట్లు పెరుగుతాయి.. అందరికీ టిక్కట్లు వస్తాయని చెప్తున్నారు. కొందరు నేతలకు ఇప్పుడిప్పుడే దీనిపై మబ్బుపొరలు వీడుతున్నా కొందరు మాత్రం ఇంకా ఆ మాటలను నమ్ముతున్నారట. దాంతో వారిని చూసి ఏపీ విపక్ష నేతలు కామెంట్లు చేస్తున్నారు. మోడీ అపాయింట్మెంటే రానప్పుడు కొత్తగా సీట్లెలా వస్తాయనుకుంటున్నారు? అంటూ టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. పాపం... ఆయా నేతల వద్ద దానికి సమాధానం లేకపోయినా ఏదో దింపుడు కళ్లెం ఆశ ఒకటి వారిని ఇంకా టీడీపీలో కొనసాగించేలా చేస్తోందట.