Begin typing your search above and press return to search.

భారత్ లో ఒమిక్రాన్ కేసులు పెరగటానికి ఆ మాటే కారణమట

By:  Tupaki Desk   |   12 Jan 2022 6:30 AM GMT
భారత్ లో ఒమిక్రాన్ కేసులు పెరగటానికి ఆ మాటే కారణమట
X
నిజమే.. ఒక మాట చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ముంచుకొచ్చిన మూడో వేవ్ ను చూసినప్పుడు.. మొదటి రెండు వేవ్ లతో పోలిస్తే.. మహమ్మారి అంటే భయం తగ్గటంతో పాటు.. ఫర్లేదు ఏం కాదులే అన్న అనవసర భరోసా ఎక్కువైందన్న మాట వినిపిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలై.. తక్కువ వ్యవధిలో 125 దేశాలకు పైనే పాకిన ఒమిక్రాన్.. ఇప్పుడు భారత్ లోనూ తన ప్రభావాన్ని చూపుతుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే రోజువారీ కేసులకు సంబంధించి ఇబ్బందికరమైన గణాంకాలు బయటకు వస్తున్నా.. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్ విషయంలో భారత్ లో సాగిన ఫేక్ న్యూస్ ప్రచారం కూడా ప్రజల్లో లైట్ తీసుకునే గుణాన్ని పెంచి.. ఒమిక్రాన్ కేసులు పెరిగేందుకు సాయం చేస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. కరోనా కుటుంబంలో ఒమిక్రాన్ వేరియంట్ అన్నది ప్రకృతి అందించే సహజ వ్యాక్సిన్ అన్న తప్పుడు మాట ప్రజల్లోకి భారీగా వెళ్లిపోయిందంటున్నారు. నొప్పులు.. అలసట తప్పించి.. మరింకే లక్షణాలు పెద్దగా ఉండవన్న మాట కూడా.. ఒమిక్రాన్ కేసులు దేశంలో పెరగటానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒమిక్రాన్ సహజసిద్ధమైన వ్యాక్సిన్ అన్న తప్పుడు ప్రచారం.. ప్రజల్లో నిర్లక్ష్యాన్ని పెంచేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. వ్యాక్సిన్ మీద జరుగుతున్న అర్థం లేని అనుమానాలు కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతుందని చెబుతున్నారు. నిజానికి అమెరికా విషయాన్నే తీసుకుంటే.. ఈ రోజున ఇంత భారీగా కేసులు నమోదు కావటానికి కారణం.. వ్యాక్సిన్లు తీసుకోని వ్యక్తులేనని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సెకండ్ వేవ్ తో పోలిస్తే.. థర్డ్ వేవ్ లో కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఊరటను కలిగిస్తోంది.

అయితే.. తాజాగా ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ జనవరి 5 నుంచి తొమ్మిది మధ్యకాలంలో చోటు చేసుకున్న కరోనా మరణాలు 46గా చెబుతున్నారు. వీరిలో 35 మంది ఎలాంటి వ్యాక్సిన్ వేసుకోలేదన్న విషయం బయటకు వచ్చింది. ఈ లెక్కన చూసినప్పుడు తాజాగా చోటు చేసుకునే మరణాల్లో వ్యాక్సిన్ లేని వారికి ముప్పు ఎక్కువగా ఉందన్న విషయం స్పష్టమైంది. ఏది ఏమైనా.. ఒమిక్రాన్ విషయంలోనూ.. వ్యాక్సిన్ విషయంలోనూ తప్పుడు ప్రచారం.. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీయటంతో పాటు.. కుటుంబాలను కోలుకోకుండా చేస్తుందని చెప్పక తప్పదు.