Begin typing your search above and press return to search.

గాలి ఆప్తుడి ఇంటిపై ఐటీ దాడులు..

By:  Tupaki Desk   |   9 May 2018 10:54 AM GMT
గాలి ఆప్తుడి ఇంటిపై ఐటీ దాడులు..
X

కర్ణాటక శాసనసభ ఎన్నికలు శనివారం జరగనున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు బెంగళూరులోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ త‌నిఖీలు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆదాయ పన్నుశాఖ అధికారుల దాడులు... ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి... ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితులైన మంత్రుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు - పలువురు నేతల ఇళ్లను టార్గెట్‌ చేసి దాడులు చేశారు. అయితే కక్షపూరితంగా బీజేపీ... కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులు చేస్తుందనే విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా బీజేపీ నుంచి ఎన్నికల బరిలో ఉన్న శ్రీరాములు ఇళ్లు - ఆయన బంధువుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. చిత్రదుర్గలో శ్రీరాములు బంధువుల ఇళ్లపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన శ్రీరాములు బంధువుల ఇళ్లపై ఇప్పుడు ఐటీ దాడులు జరగడం చర్చగా మారింది.

మ‌రోవైపు కర్ణాటక శాసనసభ ఎన్నికలు శనివారం జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడుతున్నది. ఎన్నికల అధికారులు ఇవాళ కొప్పాల్ జిల్లాలోని గంగావతిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు విరూపాక్ష ఇంట్లో నుంచి రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత షమిద్ మానియర్ ఇంటి నుంచి రూ.30వేలు సీజ్ చేశారు. ఇదిలాఉండ‌గా...జలహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీగా నకిలీ ఓటరు కార్డులను గుర్తించారు. 9,746 ఓటరు ఐడీ కార్డులు - ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఓటరు ఐడీ కార్డులు లభించిన అపార్ట్‌మెంట్ ఓ కాంగ్రెస్ నేతకు సంబంధించిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు కుట్ర చేస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.