Begin typing your search above and press return to search.

క‌న్న‌డ నాట ఐటీ పంజా!...సీఎం ల‌క్ష్యంగా ఐటీ దాడులు!

By:  Tupaki Desk   |   5 April 2019 8:44 AM GMT
క‌న్న‌డ నాట ఐటీ పంజా!...సీఎం ల‌క్ష్యంగా ఐటీ దాడులు!
X
క‌న్న‌డ నాట ఐటీ దాడుల క‌ల‌క‌లం ఆగ‌డం లేదు. ఇటీవ‌లే అక్క‌డ జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడిపోయిన త‌ర్వాత ఐటీ దాడుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టిన నాటి నుంచి అక్క‌డ ఐటీ దాడులు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఎన్నిక‌ల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించిన బీజేపీ అధికార పీఠం ఎక్కినా... మెజారిటీ నిరూపించుకోలేని నేప‌థ్యంలో కింగ్ మేక‌ర్‌గా అవ‌త‌రించిన జేడీఎస్ నేత కుమార స్వామి సీఎంగా కాంగ్రెస్ పార్టీ ప‌క‌డ్బందీ వ్యూహం అమ‌లు చేసింది. ఈ వ్యూహాన్ని బ‌ద్ద‌లుకొట్టేందుకు బీజేపీ చేయ‌ని య‌త్న‌మంటూ లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే క‌న్న‌డ‌నాట ఐటీ దాడుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఐటీ దాడులు కొన‌సాగుతుండ‌టం నిజంగానే ఆశ్చ‌ర్యం రేకెత్తించే విష‌య‌మే.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బెంగ‌ళూరు నుంచి బ‌య‌లుదేరిన సీఎం కుమార‌స్వామి, ఆయ‌న త‌న‌యుడు మండ్య కూట‌మి అభ్య‌ర్థి నిఖిల్ గౌడ‌లు మండ్య జిల్లాలోని కృష్ణ‌సాగ‌ర‌లోని రాయ‌ల్ ఆర్కిడ్ హోట‌ల్ లో బ‌స చేశారు. ప్ర‌చారం నిమిత్తం వారు బ‌య‌ట‌కు వెళ్లిన వేళ‌... ఐటీ అధికారులు ఆ హోట‌ల్ ను రౌండ‌ప్ చేశారు. ఏకంగా సీఎం బ‌స చేసిన హోట‌ల్ గదిని కూడా త‌నిఖీ చేశారు. నిన్న మ‌ధ్యాహ్నం ఏకంగా 30 ఐటీ అధికారుల బృందాలు ఈ సోదాల్లో పాలుపంచుకున్నాయి. ఈ వార్త తెలిసిన వెంట‌నే హుటాహుటీన హోట‌ల్ చేరుకున్న కుమార‌స్వామి ఐటీ అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. తాను హోట‌ల్ లో లేని స‌మ‌యంలో దాడులు జ‌ర‌గ‌డ‌మేమిట‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జేడీఎస్, కాంగ్రెస్‌ నేతలే లక్ష్యంగా ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోందని ఆరోపించారు.

ఇదంతా చూస్తుంటే... త‌మ‌ను రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఐటీ దాడులు జ‌రుగుతున్నాయ‌ని భావించ‌క త‌ప్ప‌డం లేద‌ని కూడా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌లే త‌న కేబినెట్ లోని ఓ మంత్రి నివాసంలో జ‌రిగిన ఐటీ దాడుల‌కు నిర‌స‌న‌గా ఏకంగా సీఎం - డిప్యూటీ సీఎం - ఇత‌ర కేబినెట్ స‌భ్యులంతా క‌లిసి బెంగ‌ళూరు న‌డిరోడ్డులో ఐటీ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నాకు దిగిన సంగతి తెలిసిందే. నాడు మంత్రిని టార్గెట్ చేసిన ఐటీ... నేడు ఏకంగా సీఎంనే టార్గెట్ చేస్తూ సోదాలు నిర్వ‌హించ‌డం పెను క‌ల‌క‌లం రేపుతోంది. దాడుల్లో భాగంగా ఐటీ అధికారులకు పెద్ద‌గా ఏమీ దొర‌కకున్నా... త‌మ వైరి వ‌ర్గాన్ని భ‌య‌పెట్టేందుకే ఈ దాడులు జ‌రిగాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

అయితే ఈ త‌ర‌హా భావ‌న వ్య‌క్తం కాకుండా చాలా ప‌క‌డ్బందీ వ్యూహం ర‌చించిన బీజేపీ... త‌మ పార్టీకి చెందిన మాజీ సీఎం, క‌ర్ణాట‌క అసెంబ్లీలో విప‌క్ష నేత‌గా ఉన్ బీఎస్ య‌డ్యూర‌ప్ప‌పైనా ఐటీ సోదాలు జ‌రిగిన‌ట్టుగా క‌ల‌రింగ్ ఇచ్చారు. యడ్యూరప్ప ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ను ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు గురువారం తనిఖీ చేశారు. ఈ ఘటన బాగలకోటె జిల్లా బాగలకోటె నవనగరలోని హెలీప్యాడ్‌ వద్ద జరిగింది. మొత్తంగా కన్న‌డ‌నాట చోటుచేసుకుంటున్న ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.