Begin typing your search above and press return to search.

గాలి మెడకు కూతురి పెళ్లి ఖర్చు

By:  Tupaki Desk   |   21 Nov 2016 4:40 PM IST
గాలి మెడకు కూతురి పెళ్లి ఖర్చు
X
ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందట... గనుల రాజా గాలి జనార్దనరెడ్డి పరిస్తితి ఇప్పుడు అలాగే ఉంది. దేశంలో ఇంకెవరూ చేయని రేంజిలో కుమార్తె బ్రహ్మణి పెళ్లిని అంగరంగవైభవంగా జరిపిన గాలికి అది జరిగిన నాల్రోజుల్లోనే ఊహించని షాక్ తగిలింది. ఐటీ శాఖ ఇప్పుడు ఆయన ఆఫీసులపై దాడులు చేస్తోంది. మనీ లాండరింగ్ - ఇతర అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి ఈ మధ్యే బయటగాలి పీల్చుకుంటున్నారు. తాజాగా కూతురి పెళ్లి చేసి 500 కోట్ల కు పైగా ఖర్చు చేశారు. అదే ఇప్పుడు ఆయన కొంప ముంచింది.

గాలి మైనింగ్ కంపెనీలపై ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. కుమార్తె పెళ్లి సంద‌ర్భంగా జ‌రిగిన ఖర్చుతో పాటు ప‌లు అంశాల‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. బళ్లారిలోని ఓబులాపురం మైన్స్ కార్యాల‌యంలో త‌నిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి పలు కీల‌క ప‌త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా గాలి లెక్కలచిక్కులన్నీ ప్రభుత్వాలకు - ఆదాయపన్ను శాఖకు తెలియనవి కాకపోయినా... తాజాగా సామాజిక కార్యకర్త టి.నరసింహమూర్తి ఆదాయపు పన్ను డైరెక్టర్‌ జనరల్‌కు చేసిన ఫిర్యాదుతో దాడులకు దిగారు. మొత్తానికి మరోసారి గాలికి చిక్కులు తప్పేలా లేవు. ఇప్పుడిప్పుడే మళ్లీ తన పొలిటికల్ కెరీర్ ను గాడిన పెట్టాలని స్కెచ్ గీస్తున్న గాలికి ఇది గట్టి షాకే అనుకోవాలి.