Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ఐటీ రైడ్స్‌..చిన్న‌మ్మ‌కు చెక్ కోస‌మేనా?

By:  Tupaki Desk   |   28 Dec 2017 10:15 AM GMT
మ‌ళ్లీ ఐటీ రైడ్స్‌..చిన్న‌మ్మ‌కు చెక్ కోస‌మేనా?
X
త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జె.జ‌య‌ల‌లిత చ‌నిపోయిన త‌ర్వాత నిజంగానే ఆ రాష్ట్రంలో రాజ‌కీయాలు అగ‌మ్య గోచ‌రంగా మారిపోయాయి. మూడు ద‌శాబ్దాల త‌ర్వాత వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం అధికారం చేప‌ట్టిన నేత‌గా జయ రికార్డు నెల‌కొల్ప‌డ‌మే కాకుండా... డీఎంకేకు చుక్క‌లు చూపించేలా పదునైన వ్యూహాల‌ను ప‌క్కాగానే ర‌చించిన జ‌య‌... వాటిని అమ‌లు చేయ‌కుండానే క‌న్నుమూశారు. దక్షిణాదిలో ప్ర‌త్యేకించి ప్రాంతీయ పార్టీల‌కు పెట్ట‌ని కోట‌గా ఉన్న త‌మిళ‌నాట *ఒక్క అడుగు* అంటూ క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్న బీజేపీకి... జయ మ‌ర‌ణం త‌ర్వాత అక్క‌డ ఏర్ప‌డ్డ రాజ‌కీయ ప‌రిస్థితులు కాస్తంత ఆస‌క్తిని క‌లిగించాయి. రాజ‌కీయ శూన్య‌త ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడున్న అనుకూల ప‌రిస్థితులు మ‌రెన్న‌డూ కాన‌రావ‌న్న భావ‌న‌తో బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం యుద్ధ‌ప్రాతిపదిక‌న వ్యూహర‌చ‌న చేసింది. జ‌య మ‌ర‌ణం తర్వాత ఖాళీ అయిన స్థానంలో కూర్చున్న ప‌న్నీర్ సెల్వంను దించేసి తానే గ‌ద్దెనెక్కాల‌ని భావించిన జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ యోచ‌న‌ను ఆదిలోనే అడ్డుకున్న బీజేపీ... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏకంగా ఆమెకు శిక్ష ప‌డేలా వ్య‌వ‌హ‌రించింద‌న్న వాద‌న కూడా వినిపించింది.

ఇక ఆ త‌ర్వాత ప‌న్నీర్ స్థానంలో ఎడ‌ప్పాడి ప‌ళ‌నిసామి సీఎంగా ప‌దవీ బాధ్య‌త‌లు స్వీక‌రించినా... పెద్ద‌గా ముప్పేమీ లేద‌ని భావించిన బీజేపీ నేత‌లు... ఆర్కే న‌గ‌ర్ అసెంబ్లీకి జ‌రిగిన ఉప ఎన్నిక ముగిసే దాకా వేచి చూసే ధోర‌ణిలోనే ఉండిపోయింది. అయితే జ‌య లేకున్నా - ఇంకెవ‌రు లేకున్నా... త‌మ మ‌ద్ద‌తు మాత్రం త‌మిళుల‌కేన‌ని - అది కూడా ప్రాంతీయ పార్టీల‌కు చెందిన వారికేన‌ని ఆర్కే న‌గ‌ర్ ఓట‌ర్లు... మొత్తం త‌మిళ ప్ర‌జ‌లు క‌లిసిక‌ట్టుగా తీర్పు చెప్పిన రీతిలో ఓట్లు వేశారు. ఈ పోలింగ్‌ పై గంపెడాశ‌లు పెట్టుకున్న బీజేపీకి షాకిచ్చేలా... ఆ పార్టీ అభ్యర్థికి క‌నీసం నోటాకు ప‌డిన‌న్ని ఓట్లు కూడా వేయ‌లేదు. దీంతో షాక్ తిన్న బీజేపీ... త‌మిళ‌నాట ప‌ట్టు కోసం మ‌రో బ‌ల‌మైన ఎత్తు వేయాల్సిందేని యోచిస్తున్న‌ట్లుగా స‌మాచారం.

ఈ స‌మ‌యంలో విజ‌య‌గ‌ర్వంతో చ‌క్రం తిప్పేస్తున్న టీవీవీ దిన‌క‌ర‌న్ అధికార అన్నాడీఎంకే నుంచి ఏకంగా 30 మంది ఎమ్మెల్యేల‌ను త‌న వైపున‌కు తిప్పుకునేందుకు ప‌క్కా ప‌థ‌కం ర‌చించిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మేర‌కు ఆయ‌నే స్వ‌యంగా ఈ విష‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు కూడా. అన్నాడీఎంకే నాయ‌క‌త్వంతో వేగ‌లేక చాలా మంది త‌న వ‌ద్ద‌కు వ‌స్తున్నార‌ని - వీరి సంఖ్య 30కి పైగానే ఉంటుంద‌ని ఓ మూడు రోజుల క్రితం ఆయ‌న చెప్పారు. ఇదే జరిగితే... త‌మిళ‌నాట అస‌లు త‌మ‌కు కాలు మోపే అవ‌కాశం కూడా లేద‌ని బీజేపీ అధినాయ‌క‌త్వం భావించిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ చేరిక‌ల‌ను ఆపాలంటే - దిన‌క‌ర‌న్‌ ను మ‌రింత బ‌లేపేతం కాక‌ముందే మేల్కోవాల‌ని ఆ పార్టీ త‌న‌కు అలవాటుగా మారిన ఐటీ దాడుల అస్త్రాన్ని ప్ర‌యోగించింద‌ని కూడా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

ఇందులో భాగంగానే ఇప్పుడు శ‌శిక‌ళ‌ - ఆమె బంధువులు - ఆమె కంపెనీలు - ఆ కంపెనీల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగులు - శ‌శిక‌ళ కంపెనీల‌కు ఇత‌ర వ‌స్తువుల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న చిన్న కంపెనీల‌ను కూడా టార్గెట్ చేస్తూ ఐటీ అధికారులు గ‌డ‌చిన రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు. ఈ దాడుల‌కు సంబంధించి చిన్న మాట కూడా లీక్ కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న ఐటీ అధికారులు... బీజేపీ స‌ర్కారు త‌మ‌కు అప్ప‌గించిన ప‌నిని చాలా నిక్క‌చ్చిగానే కాకుండా... బీజేపీ వ్యూహం అమ‌ల‌య్యే దిశ‌గానే నాన్ స్టాప్‌ గా దాడులు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ దాడుల ద్వారా దినక‌ర‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చేందుకు సిద్ధ ప‌డ్డ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌ను బ‌ల‌హీనం చేయ‌డం ఒక ఎత్తు అయితే... అస‌లు శశిక‌ళ‌ - దిన‌క‌ర‌న్ ఆర్థిక మూలాల‌ను మ‌రింత‌గా బ‌ల‌హీనం చేయ‌డం మ‌రో ల‌క్ష్యంగా చెప్పుకుంటున్నారు.