Begin typing your search above and press return to search.

ఐదున్న‌ర గంట‌ల ఐటీ విచార‌ణ‌లో అస‌లేం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   4 Oct 2018 6:00 AM GMT
ఐదున్న‌ర గంట‌ల ఐటీ విచార‌ణ‌లో అస‌లేం జ‌రిగింది?
X
ఉద‌యం ప‌ది.. ప‌ద‌కొండు గంట‌ల మ‌ధ్య అయకార్ భ‌వ‌నానికి వ‌చ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఐటీ అధికారుల విచార‌ణ కోసం లోప‌ల‌కు వెళ్లారు. అంతే.. అక్క‌డితో క‌థ స‌మాప్తం. లోప‌లేం జ‌రిగిందో తెలీదు. కాకుంటే..రెండు గంట‌ల అనంత‌రం రేవంత్ లోప‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాడంటూ హ‌డావుడి. కానీ.. రాలేదు. గంట‌కోసారి.. అదిగో వ‌చ్చేస్తున్నాడు.. ఇదిగో వ‌చ్చేస్తున్నాడంటూ మాట‌లు. దీంతో అయ‌కార్ బిల్డింగ్ గేటు బ‌య‌ట కాప‌లా కాస్తున్న ఎల‌క్ట్రానిక్ మీడియా విలేక‌రులు.. కెమేరామ‌న్లు హ‌డావుడి ప‌డ‌టం.. అంత‌లోనే.. ఇంకా రావ‌టం లేద‌ని తెలుసుకొని మ‌ళ్లీ నీర‌సంగా వెయిట్ చేయ‌టం క‌నిపించింది.

రోజూ ఉండే ఎండ తీవ్ర‌త‌తో పోలిస్తే నిన్న‌(బుధ‌వారం) ఎండ కాస్త గ‌ట్టిగానే ఉంది. దీంతో.. రోడ్ల మీద విధులు నిర్వ‌ర్తిస్తున్న టీవీ జ‌ర్న‌లిస్టులు.. కెమేరామ‌న్ల‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితే ఎదురైంది. ఇదంతా బ‌య‌ట సీను. మ‌రి.. విచార‌ణ ఎదుర్కొనేందుకు వ‌చ్చిన రేవంత్‌కు లోప‌ల ఎలాంటి ప‌రిస్థితి ఎదురైందన్న‌ది ఆస‌క్తిక‌రంగానే కాదు.. పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఐటీ అధికారుల విచార‌ణ‌కు వెళ్లిన రేవంత్.. ప్ర‌శ్న‌లు ఎదుర్కోవ‌టం కాదు.. తానే ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు సంధించిన‌ట్లుగా తెలుస్తోంది. అధికారుల ఎదుట ఐదున్న‌ర గంట‌ల పాటు ఉన్న‌ట్లుగా చెప్పిన‌ప్ప‌టికీ.. రేవంత్ విచార‌ణ గంట‌న్న‌రకే ముగిసిన‌ట్లుగా స‌మాచారం. ప్ర‌శ్న‌లు వేయాల్సిన అధికారుల‌కు.. రేవంత్ నుంచి వ‌చ్చిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి ఎదురైన‌ట్లుగా చెబుతున్నారు.

ఓటుకు నోటు ఎపిసోడ్‌ ను ప్ర‌స్తావించి.. రూ.50 ల‌క్ష‌లు ఎక్క‌డివి? అన్న ప్ర‌శ్న‌ను వేసిన‌ట్లుగా తెలుస్తోంది. దీనిపై రేవంత్ ఒకింత ఆగ్ర‌హనికి గురైన‌ట్లుగా చెబుతున్నారు. అయితే..వ‌స్తున్న కోపాన్ని త‌మాయించుకొని.. ప్ర‌స్తుతం కేసు కోర్టులో ఉంద‌ని.. అది తేలి.. తాను దోషిన‌ని తేలిన ప‌క్షంలో తాను స‌మాధానం చెప్పాల్సి ఉంటుంద‌ని చెప్ప‌ట‌మే కాదు.. కోర్టులో ఉన్న అంశం గురించి ఎందుకు ప్ర‌శ్నిస్తున్నారు? అంటూ సూటిగా ప్ర‌శ్నించ‌టం.. ఐటీ అధికారులు స‌మాధానం కోసం మాట‌లు వెతుక్కోవ‌టం లాంటి ప‌రిస్థితి ఎదురైన‌ట్లుగా చెబుతున్నారు.

మ‌రీ.. తొంద‌ర‌గా బ‌య‌ట‌కు పంపితే బాగోద‌న్న‌ట్లుగా గంట‌న్న‌ర‌కే విచార‌ణ ముగిసినా.. ఐదున్న‌ర గంట‌ల పాటు ఆపి.. ఆ త‌ర్వాత వెళ్లొచ్చ‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఐటీ అధికారుల ఎదుట విచార‌ణ సంద‌ర్భంగా క‌ఠిన ప‌రిస్థితుల్ని రేవంత్ ఎదుర్కొంటార‌న్న వాద‌న‌కు భిన్నంగా.. ఐటీ అధికారుల‌కే రేవంత్ ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేసిన‌ట్లుగా చెబుతున్నారు. త‌న ఇంటి నుంచి తెచ్చిన ప‌త్రాల గురించి ప్ర‌శ్నించిన రేవంత్ ప్ర‌శ్న‌కు.. ఐటీ అధికారులు సూటిగా స‌మాధానం చెప్ప‌లేద‌న్న మాట వినిపిస్తోంది. నా మీద ఐటీ అధికారుల్ని ఉసిగొల్పుతారంటూ త‌నిఖీల‌కు వారం ముందు నుంచే చెబుతున్న రేవంత్‌.. అలాంటి ప‌రిస్థితే వ‌స్తే ఏం చేయాలో ముందుగానే ప్రిపేర్ కాకుండా ఉంటారా? ఒక్క‌సారి ప్రిపేర్ అయితే.. రేవంత్‌కు ఎప్పుడేం చేయాలో ప్ర‌త్యేకించి ఒక‌రు చెప్పాలా..?