Begin typing your search above and press return to search.

లాభమెంత?; ఈసారి ఆదాయపన్ను సంగతేంటి?

By:  Tupaki Desk   |   29 Feb 2016 1:22 PM GMT
లాభమెంత?; ఈసారి ఆదాయపన్ను సంగతేంటి?
X
బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారంటే.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ చూసే అంశాలు రెండే. అందులో బడ్జెట్ కారణంగా పెరిగేవి.. తగ్గేవి ఒకటైతే..రెండోది.. ట్యాక్స్ పేయర్స్ కు విత్తమంత్రి ఇచ్చే పన్ను రాయితీ. అరుణ్ జైట్లీ తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తగ్గేవి.. పెరిగేవి ఏమిటన్న విషయాలపై స్పష్టత వచ్చేసింది. ఇక.. ట్యాక్స్ పేయర్స్ ఎంతో ఆశగా చూసే ఆదాయ పన్ను పరిమితిని పెంచటం ద్వారా కలిగే లాభం విషయంలోకి వెళితే.. జైట్లీ చాలా తెలివైన ఎత్తుగడ వేశారు.

ఏడాదికి రూ.5లక్షల లోపు ఆదాయం (అంటే నెలకు రూ.41వేలు) ఉన్న వారికి ఇప్పటివరకూ రూ.2వేలు పన్ను రాయితీ ఉండేది. అంటే.. రూ.5లక్షల ఆదాయానికి కట్టాల్సిన పన్నును కట్టాక (ఇందులో మినహాయింపులు తీసేసిన తర్వాత కట్టే మొత్తం) ఒకవేళ ఆ మొత్తం రూ.2వేలు ఉంటే ఆ మొత్తాన్ని ఐటీ శాఖ తిరిగి ఇచ్చేసేది. ఇప్పుడా పరిమితిని రూ.2వేల నుంచి రూ.5వేలకు పెంచారు.

ఈ ప్రయోజనం 2 కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ కు లభించనున్నట్లు బడ్జెట్ సందర్భంగా విత్త మంత్రి పేర్కొన్నారు. అయితే.. ఈ రెండు కోట్ల మందిలో తాము కట్టాల్సిన పన్నుకు సంబంధించి ఇంటి లోన్ తీసుకుంటే దాని వడ్డీ మొత్తం.. బీమా.. ఆరోగ్య బీమా.. పిల్లల చదువులకు సంబంధించి చెల్లింపులు..ఏదైనా స్వచ్ఛంద సంస్థకు కానీ.. పన్ను రాయితీ ఉన్న సంస్థలకు..కార్యక్రమాలకు విరాళాలు ఇస్తే అవన్నీ కూడా పన్ను కట్టాల్సిన పని లేదు.అలాంటి వాళ్లకు ఈ రూ.5వేల ప్రయోజనం తూచ్.

అంటే.. రూ.5లక్షల లోపు ఆదాయం ఉండి..ఆదాయ పన్ను శాఖకు రూ.5వేలు పన్ను కడితే తప్ప.. ఆ డబ్బు తిరిగి రాదు. ఈ నేపథ్యంలో పైకి రూ.3వేల ప్రయోజనాన్ని ఆర్థికమంత్రి కల్పించినట్లు కనిపించినా.. అంతిమంగా కలిగే ప్రయోజనం అంతంత మాత్రమే అన్న విషయం.. లోతుగా లెక్కల్లోకి వెళితే అర్థమవుతుంది. మొత్తంగా జైట్లీ ప్రయోజనం కలిగించినట్లే కలిగించి.. చాలా తెలివిగా వ్యవహరించారని చెప్పక తప్పదు.