Begin typing your search above and press return to search.

ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి సంయుక్త కిసాన్ మోర్చా పెద్ద షాకే ఇచ్చింది

By:  Tupaki Desk   |   4 Feb 2022 4:56 AM GMT
ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి  సంయుక్త కిసాన్ మోర్చా పెద్ద షాకే ఇచ్చింది
X
ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి సంయుక్త కిసాన్ మోర్చా పెద్ద షాకే ఇచ్చింది. మొదటి విడత పోలింగుకు సరిగ్గా వారం రోజులుందనగా బీజేపీకి ఓట్లు వేయద్దంటు సంయుక్త కిసాన్ మోర్చా రైతులకు పిలుపిచ్చింది. నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు దాదాపు ఏడాదికి పైగా ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ శివార్లు కేంద్రంగా జరిగిన ఉద్యమంలో పంజాబ్, హర్యానా, యూపీకి చెందిన రైతు సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు ఉద్యమంలో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు. అయితే ఇంకా కొన్ని డిమాండ్లు మాత్రం అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ప్రధానంగా యూపీలోని లఖింపూర్ ఖేరిలో ర్యాలీగా వెళుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి కొడుకు వాహనం ఎక్కించేశారు. దాంతో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించారు. కేంద్రమంత్రిని బర్తరఫ్ చేసి, కేసు పెట్టి అరెస్టు చేయాలంటు రైతులు ఎంతగా ఆందోళన చేస్తున్నా మోడీ పట్టించుకోవటంలేదు.

ఇదే విషయమై కిసాన్ మోర్చా యూపీలోని రైతులకు పిలుపిచ్చింది. రైతులు ఎట్టి పరిస్ధితుల్లోను బీజేపీకి ఓట్లు వేయద్దని భారతీయ కిసాన్ సంఘ్ కీలక నేత రాకేష్ తికాయత్ కూడా పదే పదే చెబుతున్నారు. తికాయత్ ది యూపీలోని పశ్చిమ ప్రాంతం. పైగా జాట్ సామాజివకర్గానికి చెందిన నేత. బీజేపీపై జాట్లు చాలాకాలంగా మండిపోతున్నారు. అందుకనే తాజాగా సంయుక్త కిసాన్ మోర్చా బీజేపీకి వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపు ఎక్కువ ప్రభావం చూపుతుందనే అనుకుంటున్నారు.

యూపీలో రైతుల ఓట్లు చాలా ఎక్కువ. పశ్చిమ యూపీలోనే 128 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ గనుక బీజేపీకి దెబ్బపడితే అధికారంలోకి రావటం అనుమానమనే చెప్పాలి. రైతులు, జాట్లు పశ్చిమ ప్రాంతంలో మాత్రమే కాదు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉన్నారు. పైగా జాట్ల పార్టీగా చెప్పుకుంటున్న ఆర్ఎల్డీ ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీతో పొత్తుపెట్టుకుంది. కాబట్టి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు బీజేపీకి షాకనే చెప్పాలి.