Begin typing your search above and press return to search.

ఆ దేశాల్లో పిల్లల పేర్లు పెట్టుకోవటానికి స్వేచ్ఛ లేదు

By:  Tupaki Desk   |   17 Nov 2020 6:00 PM IST
ఆ దేశాల్లో పిల్లల పేర్లు పెట్టుకోవటానికి స్వేచ్ఛ లేదు
X
పిల్లలు పుట్టినంతనే పేర్ల కోసం వెతుకులాట షురూ అవుతుంది. కొంతమంది మాత్రం కాస్త ముందుగానే బాబు పుడితే ఫలానా పేరు.. పాప పుడితే ఫలానా పేరు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యే జాగ్రత్త పరులు కనిపిస్తారు. ఎక్కువమంది మాత్రం పుట్టిన సమయం.. నక్షత్రం.. తిధి లాంటి వాటిని చూసుకొని పేర్లు పెట్టుకోవటం కనిపిస్తుంది. అయితే.. ఈ సౌకర్యం.. స్వేచ్ఛ చాలా దేశాల్లో కనిపించదు. బాగా డెవలప్ అయిన దేశాల్లోనూ పేరు విషయంలో ఉన్న పరిమితుల గురించి తెలిస్తే.. ఆశ్చర్యకరంగా ఉంటుందని చెప్పక తప్పదు.

పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో పలు దేశాల్లో నిబంధనలు చాలానే ఉన్నాయి. కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే పిల్లలకు పేర్లు పెట్టాల్సి ఉంటుంది. ఇదంతా తెలిసిన తర్వాత.. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు మురిసిపోకుండా ఉండలేం. అదే సమయంలో.. కొన్ని దేశాలు అనుసరిస్తున్న విధానాల్ని మనం మిస్ అవుతున్నామన్న భావన కలగటం ఖాయం. ఇంతకీ ఏ దేశంలో ఎలాంటి పరిమితులు ఉన్నాయో చూస్తే..

చైనా

చైనాలో పిల్లలు పుట్టగానే జ్యోతిష్యులతో పాటు ప్రభుత్వం చేసే సూచనలకు అనుగుణంగా పేర్లు పెట్టాల్సి ఉంటుంది. చైనాలోని ప్రతి ఒక్కరికి మన ఆధార్ మాదిరి గుర్తింపుకార్డు ఉంటుంది. అందులో వ్యక్తి పేరు కంప్యూటర్ స్కానర్లకు అనువుగా ఉండాలి. అందుకే..క్లిష్టమైన.. పలకటానికి కష్టమైన పేర్లు పెట్టకుండా సరళంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు.. దేశ సంప్రదాయాలు ప్రతిబింబించేలా పేరు ఉండాలి. విదేశీ పేర్లను అనుమతించరు. ఇంటిపేరు ఒకే అక్షరంతో ఉండాలి.

జపాన్

ఈ దేశంలోని వారికి వారి సంప్రదాయాలంటే మహా ఇష్టం. అందుకే.. వారి సంప్రదాయాలకు తగ్గట్లు పేర్లు పెడతారు. అక్కడి చట్టం ప్రకారం ప్రతి పిల్లాడికి పెట్టే పేరుతో పాటు ఇంటి పేరు తప్పనిసరి. విదేశీ భాషల్లోని పేరును జపనీస్ లోకి ట్రాన్స్ లేట్ చేసి పెట్టకూడదు. పేరు చదవటానికి.. పలకటానికి సులువుగా ఉండాలి.

జర్మనీ

పిల్లలకు పేరు పెట్టాలంటే ఈ దేశంలో పెద్ద ప్రహసనమే. పేరులోనే అబ్బాయా? అమ్మాయా? అన్నది స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి. పేరులో తేడాలు ఉండకూడదు. కంప్యూటర్ మిషన్లు చదివేలా ఉండాలి. ఎంపిక చేసుకున్న పేరును స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫీజు కట్టి పేర్కొంటే.. ఆ పేరు పెట్టుకోవచ్చో.. లేదో చెబుతారు. ఒకవేళ రిజెక్టు చేస్తే.. ఎంపిక చేసిన మరో పేరును మరోసారి ఫీజు కట్టి అనుమతి తీసుకోవాలి.

అమెరికా

పిల్లలకు పెట్టే పేరులో ఇంటిపేరులో కానీ.. పెట్టే పేరులో కానీ 40 అక్షరాలు మించకూడదు. గతంలో ఇది 26అక్షరాలే ఉండేది. తర్వాత దాని పరిమితి పెంచారు. పేరులో ఎలాంటి అభ్యంతరక అర్థాలు ఉండకూడదు.

ఆస్ట్రేలియా

పేరులో 26 అక్షరాలు మాత్రమే ఉండాలి. పెట్టిన పేరు పిల్లలకు నచ్చకపోతే.. తల్లిదండ్రులు ఆ పేరును పిలవకూడదు.

సౌదీ అరేబియా

ఈ దేశంలో అభ్యంతరకరమైన 50 పేర్లను తీసుకొచ్చారు. అవి తప్పితే వేరే పేర్లు పెట్టుకోవచ్చు. నిషేధించిన పేర్లను పెడితే కఠిన శిక్షలు ఉంటాయి. అంతేకాదు. సౌదీ జాబితాలో బ్యాన్ చేసిన పేర్లు ఉన్న విదేశీయుల్ని తమ దేశంలోకి రానివ్వరు.

ఐస్ లాండ్

పిల్లలకు ఏ పేరు పెట్టాలని డిసైడ్ చేసే కమిటీ ఒకటి కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. పేరుపెట్టిన తర్వాత ఆ కమిటీ.. పేరులో ఏదైనా వ్యాకరణంలో కానీ.. అర్థంలో కానీ దోషాలు ఉన్నాయా? అని పరిశీలిస్తారు. తల్లిదండ్రులు పెట్టే పేరు.. భవిష్యత్తులో చిన్నారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించదన్న విషయాన్ని సదరు కమిటీ నమ్మాలి. అప్పుడు మాత్రమే ఓకే చేస్తారు.

స్వీడన్

పిల్లలకు పేర్లు పెట్టాలంటే పుట్టిన మూడు నెలల లోపు తాము పెట్టే పేరుకు స్థానిక ప్రభుత్వ అధికారుల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఫ్రాన్స్

పిల్లల పేర్ల మీద ఎలాంటి పరిమితులు లేవు. కాకుంటే.. తల్లిదండ్రులు పెట్టే పేరు పిల్లలకు అభ్యంతరం లేదన్న విషయానికి సంబంధించిన నివేదికను సమర్పించాలి. పిల్లలకు వారి పేరు నచ్చకుంటే.. వెంటనే తొలగించే అధికారం కోర్టుకు ఉంటుంది.

ఫిన్ లాండ్
పిల్లలు పుట్టిన రెండు నెలల లోపే పేరు పెట్టాలి. ఏ పేరు అయినా పెట్టుకోవచ్చు. కానీ.. ఇంటి పేరు మాత్రం తప్పనిసరి. అనాధ అయినా ఇంటిపేరును ఎంపకి చేస్తారు. అలా అని విదేశీ పేర్లను పెట్టకూడదు. ఒకే కుటుంబంలోఉన్న పేరును మళ్లీ పెట్టకూడదు.

మలేషియా

అంకెలు.. రంగులు.. కూరగాయలు.. పండ్లు.. వస్తువుల పేర్లు లాంటివి అస్సలు పెట్టకూడదు. ఒకవేళ అలా పిలిస్తే శిక్షలు విధిస్తారు. ప్రభుత్వం నిషేధించిన జాబితాలోని పేర్లు పెట్టాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.


పోర్చుగల్

పిల్లలకు కేవలం పోర్చుగీస్ భాషలోనే పేర్లు పెట్టాలి. ముద్దు పేర్లు పెట్టకూడదు. పేరులో అమ్మాయా?అబ్బాయా? అన్నది తెలిసేలా ఉండాలి. పిల్లల పేర్లకు సంబంధించి ప్రభుత్వం 82 పేజీల పుస్తకం ఒకటి ప్రింట్ చేసింది. అందులోని పేరును మాత్రమే పెట్టాల్సి ఉంటుంది.