Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లోని ఆ ఆసుపత్రి మంటల్లో.. వీడియో చూస్తే వణుకే

By:  Tupaki Desk   |   1 Feb 2022 6:30 AM GMT
హైదరాబాద్ లోని ఆ ఆసుపత్రి మంటల్లో.. వీడియో చూస్తే వణుకే
X
శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్. హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఇదొకటి. కాకుంటే.. అపోలో.. యశోదా.. కిమ్స్.. కేర్ అంతటి భారీ ఆసుపత్రి కాకున్నా.. బడ్జెట్ హాస్పిటల్ కంటే పెద్దదిగా చెప్పొచ్చు. నిజాంపేట రోడ్డులో ఉండే ఈ ఆసుపత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు పేషెంట్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. తక్కువ ధరలకే వైద్యాన్ని అందించే ఈ ప్రైవేటు ఆసుపత్రి.. కేపీహెచ్ బీ.. నిజాంపేటతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ధరకు అందించే ఈ ఆసుపత్రిలో ఏదైనా లోపం ఉందంటే.. ఇక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి నిబంధనల్ని అస్సలు పాటించినట్లుగా కనిపించదు. ఎందుకంటే.. ఈ భవనం మొత్తం రద్దీగా ఉండే రోడ్డు మీదనే నిర్మించటంతో.. ప్రతి అడుగు జాగా అత్యంత ఖరీదుతో కూడుకున్నది కావటంతో.. నిబంధనలకు అనుగుణంగా నిర్మించకుండా.. పూర్తి చేసేశారు. అలాంటి ఆసుపత్రి సోమవారం అర్థరాత్రి వేళ.. అనూహ్యంగా అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది. ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం.. అనూహ్యంగా పెద్ద ఎత్తున మంటలువ్యాపించి.. పైకి వ్యాపించటంతో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

ఈ ఆసుపత్రి మొదటి అంతస్తులోనే ఐసీయూ ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం. దీంతో.. ఈ మంటల తీవ్రతతో పాటు.. దట్టంగా అలుముకున్న పొగతో రోగులు.. సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పెద్ద ఎత్తున అంబులెన్సుల్ని తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికగా.. ఆసుపత్రిలో ఉన్న దాదాపు 30 మంది పేషెంట్లను వేరే ఆసుపత్రికి తరలించినట్లుగా చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ అగ్నిప్రమాదం కారణంగా ఎలాంటి మరణాలు చోటు చేసుకోకున్నా.. ఆ అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన బయటకు వచ్చిన వీడియోల్ని చూసినంతనే వణుకు పుట్టేలా ఉన్నాయని చెప్పాలి. ఇంతకీ.. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్నది చూస్తే.. ఆసుపత్రిలో నిర్మాణ మరమ్మత్తులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి చోటు చేసుకున్న పొరపాట్లతో నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయని.. ఆ వెంటనే అంటుకోవటం.. చూస్తుండగానే మంటలు పెరిగి పెద్దవి అయినట్లుగా తెలుస్తోంది.

ఈ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది స్పందించటం.. రోగుల్ని క్షేమంగా వేరే ఆసుపత్రికి తరలించటంతో పాటు.. మంటల్ని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు చెబుతున్నారు. ఏమైనా.. హైదరాబాద్ లోని ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఎంత తక్కువన్న విషయాన్ని తెలియజేసేలా తాజా అగ్నిప్రమాదం ఉందని చెప్పాలి. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న వేళలో.. అధికారులు హడావుడి చేయటం.. ఆ తర్వాత వదిలేయటం జరిగేదే. ఈసారి ఇంతకు మించి జరిగేదేమీ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.