Begin typing your search above and press return to search.

2 తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 14.8 లక్షల ఓట్లు తగ్గాయి

By:  Tupaki Desk   |   10 Nov 2022 4:49 AM GMT
2 తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 14.8 లక్షల ఓట్లు తగ్గాయి
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ 2023 ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఓటర్ల సంఖ్య భారీగా తగ్గటం ఆసక్తికరంగా మారింది. కొత్తగా చేరిన వారితో పోలిస్తే.. జాబితా నుంచి తొలగించిన వారి సంఖ్య భారీగా ఉండటం గమనార్హం. ఏపీ రాష్ట్రం వరకు వస్తే.. కొత్తగా 2.41 లక్షల మంది ఓటర్లు చేరితే.. 11.23 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగింపునకు గురయ్యారు.

నికరంగా చూస్తే.. కొత్తగా నమోదైన వారిని తొలగించిన వారిలో తీసేస్తే.. గతంలో పోలిస్తే ఓటర్ల సంఖ్య ఏకంగా 8.82 లక్షలు (8,82,366 మంది ఓటర్లు) మంది ఓట్లను తొలగించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏపీలో పురుష ఓటర్ల కంటే స్త్రీ ఓటర్లసంఖ్య 4,19,007 మంది ఎక్కువగా ఉన్నారు.

ఏపీలో అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లాగా అనంతపురం నిలిస్తే.. తర్వాతి స్థానాల్లో కర్నూలు.. నెల్లూరు నిలిచాయి. ఇక.. అతి తక్కువ ఓటర్లు ఉన్న జిల్లాగా అల్లూరి సీతారామరాజు జిల్లాగా నిలిచింది. శ్రీకాకుళం.. విశాఖపట్నం.. శ్రీసత్యసాయి మినహా మిగిలిన జిల్లాల్లో మాత్రం పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.

తెలంగాణ విషయానికి వస్తే.. ఏపీ మాదిరే ఓటర్ల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే 5,99,900 మంది ఓటర్లుతగ్గారు. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితానుఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం ఓటర్లు 2,95,65,669 మంది. మొత్తం ఓటర్లలో స్త్రీఓటర్ల కంటే పురుష ఓటర్లే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఏపీలో మాత్రం మహిళా ఓటర్లు అధికంగా ఉండటం తెలిసిందే.
తెలంగాణలో మొత్తం ఓటర్లలో 1.48 కోట్ల మంది పురుష ఓటర్లు అయితే..

1.47 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధిక ఓట్లు ఉన్న జిల్లాలుగా మొదటి మూడు స్థానాల్లో హైదరాబాద్ (41.46 లక్షలు), రంగారెడ్డి (30.47 లక్షలు), మేడ్చల్ (24.83 లక్షలు) జిల్లాలు ఉన్నాయి. ఇక.. అతి తక్కువ ఓటర్లు ఉన్న జిల్లాల విషయానికి వస్తే.. ములుగుజిల్లా నిలిచింది. ఈ జిల్లాలో ఓటర్ల సంఖ్య కేవలం 2.08 లక్షలు మాత్రమే. అతి తక్కువ ఓటర్లు ఉన్న జిల్లాల్లో ములుగు తర్వాతి స్థానాల్లో వనపర్తి 2.37 లక్షలు.. జయశంకర్ జల్లాలో 2.56 లక్షల మంది ఓటర్లు మాత్రమే ఉండటం గమనార్హం. అతి తక్కువ ఓటర్లు ఉన్న జిల్లాల మొత్తంతో పోలిస్తే.. హైదరాబాద్..రంగారెడ్డి జిల్లాల్లోని ఒక్కో నియోజకవర్గంలోనే అంతమంది ఓటర్లు ఉన్నారని చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.