Begin typing your search above and press return to search.

ఒక్క డాలర్.. 144 రూపాయలు!

By:  Tupaki Desk   |   30 Nov 2018 5:14 PM GMT
ఒక్క డాలర్.. 144 రూపాయలు!
X
పొరుగు దేశ‌మైన పాకిస్థాన్ ఆర్థికంగా దివాళ దిశ‌గా ప‌య‌నిస్తోంది. పాకిస్థాన్ కరెన్సీ దారుణంగా పతనమవుతుండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. శుక్రవారం అది మరింత పతనమైన జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఏకంగా ఒక డాలర్.. రూ.144కు చేరడం విశేషం. ఇమ్రాన్‌ ఖాన్ ప్రభుత్వం తమ వంద రోజుల పాలనను సెలబ్రేట్ చేసుకున్న మరుసటి రోజే పాకిస్థాన్ రూపాయి దారుణంగా పతనమైంది. శుక్రవారం ఒక్క రోజే రూ.10 పతనమైంది. దేశానికి కొత్త పెట్టుబడులు వస్తున్నాయంటూ వంద రోజుల పాలన సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పినా.. కరెన్సీ పతనాన్ని ఆపలేకపోయింది.

ఇటీవ‌లే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు మరో షాకిచ్చింది. దేశాన్ని ఈ సంక్షోభం నుంచి బయట పడేయానికి ఐఎంఎఫ్ ఇచ్చే బెయిల్‌ ఔట్ ప్యాకేజీయే శరణ్యం. అయితే ఐఎంఎఫ్ మాత్రం ఈ ప్యాకేజీ కోసం కఠిన నిబంధనలను పాకిస్థాన్ ప్రభుత్వానికి విధిస్తోంది. ఇప్పటికే సంస్థ బృందం పాకిస్థాన్‌ లో పర్యటిస్తున్నది. పాక్‌ కు కావాల్సిన మొత్తంపై అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. పాక్ ప్రజలపై 15 వేల కోట్ల అదనపు పన్నులు విధించడం - రూపాయి విలువను మరింత తగ్గించడం - ఆర్థిక విధానాన్ని కఠినంగా అమలు చేయడంతోపాటు పాకిస్థాన్‌ కు చైనా అందిస్తున్న ఆర్థిక సాయం వివరాలను పూర్తిగా అందిస్తేనే బెయిల్‌ ఔట్ ప్యాకేజీపై తమ నిర్ణయం ప్రకటిస్తామని ఐఎంఎఫ్ స్పష్టంగా చెప్పింది. దీనికి పాక్ ఇంకా అధికారికంగా స్పందించ‌లేదు.

అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీ అందుకోవడంలో భాగంగా కావాలనే రూపాయి విలువను తగ్గించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యే ఐఎంఎఫ్ అధికారులు పాకిస్థాన్‌ లో పర్యటించిన సందర్భంగా చైనా చేస్తున్న ఆర్థిక సాయాన్ని వెల్లడించడంతోపాటు ఇంధన ధరలను పెంచాలని - మరిన్ని పన్నులు విధించాలని - రూపాయి విలువను తగ్గించుకోవాలన్న షరతులు విధించింది. ఐఎంఎఫ్‌ తో ఒప్పందానికి ముందే రూపాయి విలువను తగ్గిస్తారన్న అంచనా ఉన్నట్లు ఎక్స్‌ చేంజ్ కంపెనీస్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్థాన్ అధికారి జాఫర్ పరాచా చెప్పారు. మార్కెట్‌ లో ఓ రకమైన భయం నెలకొన్నదని - అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అధికారి ఒకరు వెల్లడించారు.