Begin typing your search above and press return to search.

అబ్బే మాకేం న‌ష్టంలేదు...భార‌త్‌ పై మేం స్పందిస్తాం

By:  Tupaki Desk   |   26 Feb 2019 2:40 PM GMT
అబ్బే మాకేం న‌ష్టంలేదు...భార‌త్‌ పై మేం స్పందిస్తాం
X
పాకిస్తాన్‌ లోని ఖైబర్ ఫక్తూక్‌ క్వా ప్రావిన్స్‌ లోని బాలాకోట్‌ లో ఉన్న జైషే ఉగ్ర స్థావరాలపై ఐఏఎఫ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్ర‌తికార దాడిపై పాక్ ర‌గిలిపోతోంది. ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ దాడిపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ స్పందించారు. ఈ దాడి తర్వాత అత్యవసరంగా నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమావేశం తర్వాత మాట్లాడుతూ...బాలాకోట్‌ లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశామని - పెద్ద ఎత్తున ఉగ్రవాదులు చనిపోయారని భారత్ చెబుతున్నదంతా అబద్ధమని అన్నారు. భారత ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యపూరితంగా - తన సొంత ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించింది. తమ దేశంలో ఎన్నికల వాతావరణం ఉన్న నేపథ్యంలో అందులో లబ్ధి కోసం ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. దీనికోసం ఈ ప్రాంతంలోని శాంతిని - సుస్థిరతను ప్రమాదంలో పడేస్తున్నారు అని ఇమ్రాన్‌ ఖాన్ వాపోయారు.

``ఇండియా దాడి చేసిన ప్రాంతాలు ప్రపంచానికంతటికీ అందుబాటులో ఉంచుతాం. వాళ్లే క్షేత్రస్థాయిలో వాస్తవాలు చూసుకోవచ్చు. దేశీయ - అంతర్జాతీయ మీడియాను ఆ ప్రదేశాల దగ్గరికి తీసుకెళ్తాం. ఇండియా అనవసరంగా ఈ దాడికి పాల్పడింది. దీనికి సరైన టైమ్ - ప్లేస్ చూసి పాకిస్థాన్ స్పందిస్తుంది`` అని నేషనల్ సెక్యూరిటీ కమిటీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ప్రకటనకు అనుగుణంగా పాక్ ప్రజలు - భద్రతా బలగాలు ఎలాంటి పరిణామానికైనా సిద్ధంగా ఉండాలని ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నాయకత్వం దృష్టికి భారత్ బాధ్యతారాహిత్యాన్ని తీసుకెళ్లాలని ఇమ్రాన్ నిర్ణయించారు.

కాగా, ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ నియంత్రణ రేఖ వెంబడి చేసి దాడులపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఘాటుగా స్పందించారు. ఇండియా మరీ దూకుడుగా వ్యవహరించింది అని ఆయన అన్నారు. అయితే ఇది నియంత్రణ రేఖను ఉల్లంఘించడమే అవుతుంది. `పాకిస్థాన్‌ కు ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంది. మేము కూడా దీటుగానే స్పందిస్తాం` అని ఖురేషీ హెచ్చరించారు. పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ (పీటీఐ) ఆయన ప్రకటనను ట్విటర్‌ లో పోస్ట్ చేసింది. పాకిస్థాన్‌ తో పెట్టుకోవద్దు.. ఇండియా ఎలాంటి దుస్సాహసం చేసినా అందుకు తగినట్లు స్పందిస్తాం అని ఇండియాను ఖురేషీ హెచ్చరించారంటూ పీటీఐ మరో ట్వీట్ చేసింది. ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని ఇండియా చెడగొడుతున్నదని ఖురేషీ ఆరోపించడం గమనార్హం. ఈ దాడుల తర్వాత ఖురేషీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.