Begin typing your search above and press return to search.

గిఫ్ట్ అమ్ముకుని పరువు పోగొట్టుకున్న ఇమ్రాన్

By:  Tupaki Desk   |   14 April 2022 10:52 AM IST
గిఫ్ట్ అమ్ముకుని పరువు పోగొట్టుకున్న ఇమ్రాన్
X
దాయాది పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఎంతటి కక్కుర్తి మనిషో యావత్ ప్రపంచానికి తెలిసింది. ఇమ్రాన్ చేసిన పని తెలియగానే అందరూ విస్తుపోతున్నారు. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎవరో ప్రముఖులు ఇచ్చిన వజ్రాల నెక్లెస్ ను రు. 18 కోట్లకు అమ్మేసుకున్నట్లు తాజాగా బయటపడింది. ఈ విషయమై పాకిస్థాన్ దర్యాప్తు సంస్ధ ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) కేసు టేకప్ చేసింది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉన్నపుడు ఎవరో ప్రముఖుడు ఖరీదైన నెక్లెస్ ను బహుకరించారట. ఆ బహుమానాన్ని ఇమ్రాన్ స్టేట్ గిఫ్ట్ రిపోజిటరీ అంటే పాకిస్తాన్ కోశాగారానికి అందచేయాలట. ఒకవేళ ఆ బహుమతిని సొంతం చేసుకోవాలని అనుకుంటే ఆ బహుమతి వాస్తవ ఖరీదులో సగం మొత్తాన్ని చెల్లించాలట. అలా చెల్లిస్తేనే సదరు ఖరీదైన బహుమతి ఇమ్రాన్ సొంతమవుతుంది.

కానీ ఇమ్రాన్ ఏమి చేశారంటే అసలు ఖరీదులో కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించి నెక్లెస్ ను సొంతం చేసేసుకున్నారు. ఎప్పుడైతే నక్లెస్ సొంతమైపోయిందో వెంటనే దాన్ని తన సన్నిహితుడు అయినా జుల్ఫికర్ బుఖారీకి ఇచ్చి అమ్మించేశాడు. బుఖారీ ఆ నెక్లెస్ ను లాహోర్ లోని ఓ నగల వ్యాపారికి అమ్మేశాడు. ఆ విషయం ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ అనే మీడియా బయటపెట్టింది. మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా ఏజెన్సీ విచారణ మొదలుపెట్టింది.

ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ తన కథనంలో నెక్లెస్ ఎవరు బహుకరించారు ? ఎవరి ద్వారా అమ్మించాడు, ఎంతకి ఏ వ్యాపారి కొనుగోలు చేశాడనే వివరాలను కూడా అందించింది. పక్కా సమాచారం లేకపోతే మాజీ ప్రధానమంత్రి మీద అంతటి గాలి వార్త ఇచ్చే అవకాశం లేదు. పైగా నెక్లెస్ ను ఇచ్చిందెవరు ? కొన్నదెవరు ? ఎంతకి అమ్మారనే విషయాన్ని కూడా వివరంగా ప్రచురించింది. కాబట్టి కథనం నూరుశాతం వాస్తవమయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. మరి ఇమ్రాన్ భవిష్యత్తు ఏమిటో ఈ విచారణతో తేలిపోతుందేమో.