Begin typing your search above and press return to search.

వ‌ల‌స‌దారుల‌కు ట్రంప్ తాజా షాక్ ఇది

By:  Tupaki Desk   |   5 Aug 2017 9:40 AM GMT
వ‌ల‌స‌దారుల‌కు ట్రంప్ తాజా షాక్ ఇది
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వ‌ల‌స‌దారుల‌కు మ‌రో షాక్ ఇచ్చారు. విదేశీయుల వలసల సంఖ్యను సగానికి తగ్గించే ఉద్దేశంతో రూపొందించిన ‘రీఫార్మింగ్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ ఫర్‌ స్ట్రాంగ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (రైస్‌)’ బిల్లుకు సమ్మతి తెలిపి రెండ్రోజులు కూడా కాక‌ముందే ఇంకో చేదు వార్త‌ను వినిపించారు. త‌న వారాంత‌పు రేడియో, వెబ్ ప్ర‌సంగంలో ట్రంప్ మాట్లాడుతూ...వ‌ల‌సదారుల సంక్షేమం విష‌యంలో నూత‌న మార్పులు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. గ‌తంలో వ‌లే వ‌ల‌సదారులు దేశంలో అడుగుపెట్ట‌గానే అమెరికా ప్ర‌భుత్వం నుంచి ద‌క్కే ప్ర‌యోజ‌నాలు ఇక క‌లుగ‌బోవ‌ని ట్రంప్ తేల్చిచెప్పారు. అమెరికా వ‌చ్చిన ఐదేళ్ల వ‌ర‌కు ఎలాంటి సంక్షేమాలు వ‌ర్తించ‌వ‌ని దేశ‌ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగంలో ట్రంప్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు తెలిపారు.

ట్రంప్ తాజా నిర్ణ‌యం అమెరికాలో నివ‌సిస్తున్న వ‌ల‌స ప్ర‌జ‌ల‌కు షాక్ వంటిదని భావిస్తున్నారు. తాజాగా మార్చిన గ్రీన్ కార్డ్ నిబంధ‌న‌ల బిల్లు చట్టంగా మారితే అమెరికా పౌరసత్వమైన ‘గ్రీన్‌ కార్డు’ల జారీ విధానంలో అనేక మార్పులు వస్తాయని, వలసలు సగానికి తగ్గుతాయని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఉన్నత చదువులు చదివి, ఉత్తమ నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రం ఈ విధానం ఎంతో ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా భారత్‌కు చెందిన యువతకు ఇది తీపికబురేనని చెప్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఏటా పదిలక్షల మంది విదేశీయులను లాటరీ ద్వారా ఎంపిక చేసి గ్రీన్‌ కార్డులు అందిస్తోంది. దాదాపు 50 ఏళ్లుగా అమలులో ఉన్న ఈ విధానం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ కలుగుతున్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు.

గ్రీన్‌ కార్డ్‌ పొందుతున్నవారిలో ఉన్నత చదువు, ఉత్తమ నైపుణ్యాలు, ఇంగ్లిష్‌ పరిజ్ఞానం ఉన్నవాళ్లు చాలా తక్కువ మంది ఉంటున్నారని చెప్తున్నారు. ప్రతి 15 మందిలో ఒక్కరు మాత్రమే తమ నైపుణ్యాలతో గ్రీన్‌ కార్డ్‌ సంపాదించుకుంటున్నారని, అమెరికాలో నివసిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారని వివరిస్తున్నారు. మిగతావారు అమెరికాకు భారంగా మారుతున్నారన్నారు. రైస్‌ చట్టం ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.