Begin typing your search above and press return to search.

'ఆత్మ నిర్భర్ భారత్' పై ప్రసంశలు కురిపించిన ఐఎంఎఫ్ !

By:  Tupaki Desk   |   25 Sep 2020 3:30 PM GMT
ఆత్మ నిర్భర్ భారత్ పై ప్రసంశలు కురిపించిన ఐఎంఎఫ్ !
X
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దాన్ని ఇంకా పెరగకుండా అరికట్టేందుకు లాక్ డౌన్ అమలు చేయడంతో చాలా రంగాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ సమయంలో అన్ని రంగాలకి చేయూతనిచ్చేలా భారతదేశ స్వయం సమృద్ధి సాధనకు ‘ఆత్మ నిర్భర్‌ భారత్’ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మంచి ప్రయత్నమని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తెలిపింది. ఈ ఆత్మ నిర్భర్‌ భారత్ ప్యాకేజి గురించి ఐఎంఎఫ్ సంస్థ ఉన్నతాధికారి గెర్రీ రైస్‌ మీడియాతో మాట్లాడుతూ ... కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్ పేరిట ప్రకటించిన ప్యాకేజీ ఆర్థిక వ్యవస్థకు పూర్తిగా మద్దతు ఇచ్చిందని, భారీ నష్టాలను తగ్గించిందని , లేకపోతే పరిస్థితులు మరింత అద్వానంగా ఉండేవని తెలిపారు.

‘‘మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌’ లక్ష్యాన్ని సాధించేందుకు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ద్వారా ప్రపంచంతో అనుసంధానం చేసే విధానాలపై దృష్టిపెట్టాలని తెలిపారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ప్రముఖ పాత్ర పోషించాలంటే..ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని, పోటీతత్వాన్ని మెరుగుపరిచి, ఉత్తేజమైన విధానాలను అనుసరించడం చాలా అవసరం అని రైస్ అభిప్రాయపడ్డారు. కాగా, ఆరోగ్య సంబంధిత స్థిరమైన లక్ష్యాలలో అధిక పనితీరును సాధించడానికి ఆరోగ్య రంగంలో పెట్టే వ్యయాన్ని క్రమంగా పెంచాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి ఐఎంఎఫ్ చేసిన అధ్యయనం వెల్లడిచేస్తుందని రైస్ తెలిపారు. స్థిరమైన వృద్ధిని సాధించడానికి నిర్మాణాత్మక సంస్కరణల అవసరాన్నీ గుర్తుచేశారు.