Begin typing your search above and press return to search.

ఫ్రంట్ లైన్ వారియర్స్ చచ్చినా స్మరించుకోరా...కేంద్రమంత్రిపై ఐఎంఏ విమర్శలు

By:  Tupaki Desk   |   17 Sept 2020 12:00 PM IST
ఫ్రంట్ లైన్ వారియర్స్ చచ్చినా స్మరించుకోరా...కేంద్రమంత్రిపై ఐఎంఏ విమర్శలు
X
దేశంలో కరోనా వైరస్ తీవ్రతకు అడ్డుకట్ట పడటం లేదు. ఏరోజుకారోజు సరికొత్త రికార్డు నమోదు చేస్తూనే ఉంది. ఇప్పటికే మన దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. పాజిటివ్ కేసులతో ఆస్పత్రులకు వెళ్తున్న వారికి వైద్యులు మెరుగైన సేవలు అందిస్తూ ఫ్రంట్లైన్ వారియర్స్ గా నిలుస్తున్నారు. కాగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కరోనా కేసుల గురించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ వైద్యులు అందజేస్తున్న సేవల గురించి వివరించారు. అయితే మంత్రి తన ప్రసంగంలో చనిపోయిన వారి త్యాగాలను స్మరించుకోలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రోగులకు సేవలందిస్తూ ఎంతో మంది వైద్యులు ప్రాణాలు పోగొట్టుకున్నా వారిని స్మరించుకోకపోవడం ఏంటని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ ) మంత్రి ప్రసంగం పై విమర్శలు చేసింది. కరోనా బాధితులకు సేవలందిస్తూ వైద్యులు ప్రాణాలు కోల్పోయారని తెలిపిన మంత్రి.. కనీసం ఇంత సంఖ్యలో మరణం పొందారని డేటా తెలియపరచడంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించడం ఏంటని ఐఎంఏ మండిపడింది.

కరోనా రోగులకు వైద్యం అందిస్తూ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 382 మంది వైద్యులు చనిపోయారని ఐఎంఏ తెలిపింది. వీరిలో 27 ఏళ్ల వయసు ఉన్న వైద్యుల నుంచి 85 ఏళ్ల సీనియర్ వైద్యులు కూడా ఉన్నారని చెప్పింది. కరోనాను లెక్కచేయక విధినిర్వహణలో ఇంతమంది ప్రాణాలు విడిచినా వారి పరిత్యాగం స్మరించుకోకపోవడం దారుణం అని ఐఎంఏ విమర్శించింది. ఇంతమంది సంఖ్యలో వైద్యులు చనిపోయారని బయటకు చెప్పకుండా దాచాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. వైద్యులు చేస్తున్న కృషిని గుర్తించాలని కోరింది. కరోనా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రూ.22.12 లక్షలు, వైద్యులకు రూ.50 లక్షలు బీమా ఉంటుందని ప్రభుత్వం గతంలో ప్రకటన చేసింది. అయితే చనిపోయిన వైద్యుల సంఖ్యను మీరు లెక్కించక పొతే వారు మరణించినట్లు కాదా.. అని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.