Begin typing your search above and press return to search.

సీఎం నియోజకవర్గంలో అక్రమ మద్యం రవాణా ... ఏకంగా ఎస్సైని ఢీ కొట్టి, ఈడ్చుకెళ్లారు !

By:  Tupaki Desk   |   29 Aug 2020 9:50 AM GMT
సీఎం నియోజకవర్గంలో అక్రమ మద్యం రవాణా ... ఏకంగా ఎస్సైని ఢీ కొట్టి,  ఈడ్చుకెళ్లారు !
X
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది. ఒకేసారి కాకుండా విడతల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఏపీలో మద్యం ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇది కూడా మద్యపాన నిషేధం లో ఓ భాగమే అని ప్రభుత్వం చెప్తుంది. అయితే , ఇదే సమయంలో రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణాదారులు కూడా రోజురోజుకి పెరిగిపోతున్నారు. అక్రమ మద్యం రవాణా చేస్తూ కూడా , ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. రోజురోజుకి వారి చేష్టలకి , ఆగడాలకు అడ్డు, అదుపులేకుండా పోతుంది.

తాజాగా మరో దారుణానికి ఒడిగట్టారు అక్రమ మద్యం రవాణాదారులు. సీఎం జగన్ సొంత నియోజకవర్గం అయిన పులివెందులలో అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఓ వ్యక్తి బరితెగించి , వాహనానికి ఎస్సై అడ్డురావడంతో ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో ఎస్సైకి చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుండి తప్పించుకుని ఆ నిందితుడిని అరెస్టు చేశారు.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. కారులో మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్టు సమాచారంతో ఎస్సై గోపినాథ్ రెడ్డి శుక్రవారం పులివెందులలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక రాఘవేంద్ర థియేటర్ సమీపంలో అటువైపుగా వెళ్తున్న ఓ కారును ఆపేందుకు ఎస్సై ప్రయత్నం చేసాడు. అయితే కారును నడుపుతున్న వ్యక్తి ..పోలీసులను చూసి వారిని, కారు ఆపకుండా వారిని భయపెట్టేందుకు కారును ఇంకాస్త వేగంతో నడిపాడు. దీనితో అప్రమత్తమైన ఎస్సై జారి కిందపడకుండా కారును గట్టిగా పట్టుకున్నారు. ఎస్సై కారుపై వేలాడుతుండగానే నిందితుడు దాదాపు రెండు కిలోమీటర్లు కారును అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు . ఈ క్రమంలో ఎస్సై గోపీనాథ్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి కారు అద్దాలను పగలగొట్టారు. ఇంతలో ఆ కారుని వెంబడిస్తూ వస్తున్నా పోలీసులు ఆ కారును అడ్డుకొని , డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఆ కారును, అందులోని 80 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాణాలకు తెగించి నిందితులను పట్టుకున్న ఎస్సైపై ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం సీఎం సొంత నియోజకవర్గం అయిన పులివెందులలో చోటుచేసుకోవడం తో దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.