Begin typing your search above and press return to search.

కిడ్నీ కావాలా.. ఇండియా వచ్చేయండి

By:  Tupaki Desk   |   13 Oct 2015 4:00 AM IST
కిడ్నీ కావాలా.. ఇండియా వచ్చేయండి
X
దక్షిణాసియా దేశాలు అవయవమార్పిడి కేంద్రాలుగా మారిపోయాయట.... అందులోనూ ఇండియా అన్నిటినీ మించిపోయిందట.... అయితే... ఇక్కడ అవయవాల మార్పిడితో పాటు అవయవాల వ్యాపారం పెద్ద ఎత్తున జరిగిపోతోంది. ఇండియాలో ఏటా 2000 మందికిపైగా తమ కిడ్నీలను అమ్ముకుంటున్నారని.... ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ ఇంత పెద్ద మొత్తంలో కిడ్నీలు అమ్ముకోవడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలే చెబుతున్నాయి. ఈ అవయవమార్పిడి కోసం డోనర్లను, విక్రయదారులను వెతుక్కోవడానికి విదేశీయులు రావడం... వారు తమ సొంత దేశాల్లో ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే అక్కడికే దాత వెళ్లడం వంటివాటిని ఇప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ టూరిజం అంటున్నారు.

దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ కిడ్నీలు, ఇతర అవయవాలను ఏర్పాటుచేసే బ్రోకర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాన్పూర్ - మీరట్ - ముంబయి - చెన్నై వంటి చోట్ల వీరి హడావుడి మరీ ఎక్కువగా ఉంది. కెనడా - ఇజ్రాయెల్ - బ్రిటన్ - సౌదీ అరేబియా - యూఏఈ - బహ్రయిన్ వంటి దేశాల నుంచి ఎక్కువమంది అవయవమార్పిడి కోసం వస్తున్నారు. వీరు ఎంతయినా ఖర్చు చేస్తుండడంతో బ్రోకర్లు వీరికి అవయవాలు సమకూర్చిపెడుతున్నారు.

కాగా నిబంధనల ప్రకారమైతే దాతల అనుమతి వంటి ఎన్నో మెలికలు ఇందులో ఉంటాయి. కానీ, వైద్యులు, ఆసుపత్రులు, బ్రోకర్లు ఏకమై రోగుల అవసరాలు.. విక్రయించే పేదల అవసరాలను సొమ్ము చేసుకుంటూ అవయవాల నల్ల బజారును సృష్టిస్తున్నారు. ఇండియాలోనే కాకుండా నేపాల్ - బంగ్లాదేశ్ - శ్రీలంక - ఇరాన్ లోనూ ఈ జాడ్యం విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ఒకటి చెబుతోంది. ఇండియా, శ్రీలంక, ఇరాన్లలో కిడ్నీ రాకెట్లు బయటపడుతున్నా వీటికి అడ్డుకట్ట పడడం లేదు. కాగా ఇరాన్ లో కిడ్నీలు విక్రయించుకోవడానికి చట్టపరమైన అనుమతి ఉంది... అక్కడది లీగల్... అయితే... విదేశీయులకు విక్రయించడానికి మాత్రం అక్కడ కూడా అనుమతించరు. ఇలా లీగల్ గా కిడ్నీ వ్యాపారానికి అవకాశం ఉన్న దేశం ఇరాన్ మాత్రమే.