Begin typing your search above and press return to search.

రాజధాని ఏరియాలో రాజకీయ రౌడీయిజం

By:  Tupaki Desk   |   15 Dec 2015 6:36 AM GMT
రాజధాని ఏరియాలో రాజకీయ రౌడీయిజం
X
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విస్తరించనున్న కృష్ణా జిల్లాలో అప్పుడే రాజకీయ వికృత క్రీడ జడలు విప్పుతోంది. రాజకీయ రౌడీయిజం - నేతల నేరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉన్నా కృష్ణా జిల్లా - దాని పొరుగునే ఉన్న జిల్లాల్లోని ఒకట్రెండు నియోజకవర్గాల్లో మాత్రం రాజకీయ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా పేట్రేగిపోతున్నారు. ప్రజల జీవితాలతో - ఉద్యోగులు - అధికారులతో ఆటాడుకుంటున్నారు.

ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటుండడంతో పరిస్థితి దారుణంగా ఉంది. విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు కారు రేస్‌ లో ఒక విద్యార్థి ప్రాణాలు బలిగొన్నాడనే అభియోగం కొంతకాలం గందరగోళం సృష్టించింది. కొడుకు తప్పించేందుకు బొండా బాధితులను మేనేజ్ చేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపై గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కేసులు కూడా నమోదయ్యాయి. కొద్దిరోజుల క్రితమే విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు - మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబానికి చెందిన స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌ లో జరిగిన కల్తీ మద్యం వ్యవహారం కలకలం సృష్టించింది. అది సద్దుమనగన ముందే కాల్‌ మనీ వ్యవహారం తెరపైకి వచ్చింది. నీచాతినీచంగా ప్రజాప్రతినిధులు - రాజకీయ నాయకులు ఏకమై కాల్‌ మనీ పేరుతో డబ్బు వసూలు కోసం మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మాజీ శాసనసభ్యురాలు చెన్నుపాటి రత్నకుమారి సోదరుడు - మరో మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ మేనమామ అయిన చెన్నుపాటి శ్రీనివాస్ చిక్కుకున్నారు. టిడిపికి చెందిన ఒక ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ - పలువురు నాయకులు నేరస్థులుగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

ఇంతకుముందు మచిలీపట్నంకు చెందిన మాజీ శాసనసభ్యుడు - వైసిపి నేత పేర్ని నానిని ఎక్సైజ్ అధికారులపై దౌర్జన్యం చేయడం - ఆయన్ను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ఇక గుడివాడ ఎమ్మెల్యే - వైసీపీ నేత కొడాలి నాని ఇటీవల వైసీపీ కార్యాలయ అద్దె విషయంలో పడిన గొడవా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరంతా కృష్ణా జిల్లాకు చెందిన నేతలే కావడం విశేషం.

పొరుగునే ఉన్న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ కూడా తన దురుసుతో ప్రవర్తనతో వివాదాస్పదమవుతున్నారు. కృష్ణాజిల్లాలో ముసునూరు సరిహద్దుల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్కడి తహశీల్దార్ వనజాక్షిపై దౌర్జన్యం చేసిన కేసులో ప్రభాకర్ ఉన్నారు. ఆ తరువాత కూడా కైకలూరు పరిసరాల్లో కొల్లేరు నిషేధిత ప్రాంతంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం సాగిస్తూ ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అంతేకాదు... అంగన్ వాడీ కార్యకర్తలను బూతులు తిట్టి కూడా ఆయన వివాదాస్పదుడయ్యారు. ఇలా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల ఎమ్మెల్యేలు నిత్యం రచ్చకెక్కుతుండడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

- గరుడ