Begin typing your search above and press return to search.

'ఐకియా' ఇప్పుడెందుకు అంత హాట్ టాపిక్!

By:  Tupaki Desk   |   9 Aug 2018 3:36 AM GMT
ఐకియా ఇప్పుడెందుకు అంత హాట్ టాపిక్!
X
ఐకియా అన్న పేరు విన్నంతే.. దాని గురించి తెలీని వారు.. ఐడియా ఏమో అనుకుంటారు. అయితే.. షాపింగ్ మీదా.. ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్ల మీద అవ‌గాహ‌న ఉన్న వారికి ఐకియా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గ‌డిచిన కొద్ది నెల‌లుగా హైద‌రాబాదీల్లో అదే ప‌నిగా వినిపిస్తున్న ఐకియా షోరూం.. ఈ రోజు స్టార్ట్ కానుంది.

హైటెక్ సిటీ ప్రాంతంలో మైండ్ స్పేస్ దాటిన త‌ర్వాత కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించే ఐకియా స్టోర్ ప్ర‌త్యేక‌త ఏమిటి? దాని గురించి హైద‌రాబాదీలు అంత ఎక్కువ‌గా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? దేశంలోనే తొలి ఐకియా స్టోర్ ను హైద‌రాబాద్ లో స్టార్ట్ చేస్తున్న నేప‌థ్యంలో దాని స్పెషాలిటీ ఏమిటి? అన్న‌ది చూస్తే.. చెబితే చాలానే ఉంద‌ని చెప్పాలి. అయితే.. సింఫుల్ గా ఐకియా గురించి చెప్పాల్సి వ‌స్తే.. హైద‌రాబాద్‌ లోని చాలామంది త‌మ ఫ‌ర్నీచ‌ర్ సామాగ్రిని కొనుగోలు చేయ‌కుండా.. ఐకియా ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు కొందామ‌ని ఎదురుచూస్తున్న ప‌రిస్థితి.

వినేందుకు కాస్త అతిశ‌యంగా అనిపించినా ఇది నిజం. ఎందుకంటే.. ఈ స్వీడిష్ కంపెనీ స్టోర్ ప్ర‌త్యేక‌త‌లు అంత భారీగా ఉంటాయి మ‌రి. ఫ‌ర్నీచ‌ర్ రంగంలో హైద‌రాబాదీయులు ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ చూడ‌ని స‌రికొత్త షాపింగ్ అనుభూతిని పొంద‌నున్నారు.

హోమ్ ఫ‌ర్నీచ‌ర్ కేట‌గిరిలో దిగ్గ‌జ హోదా ఉన్న ఐకియా అడుగు పెట్టిన చోట‌ల్లా ఆ బ్రాండ్ ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌గా ద‌గ్గ‌రైపోతుంది. ఎందుకంటే.. దాని వ్యాపార వ్యూహం అలా ఉంటుంది మ‌రి. హైద‌రాబాద్‌లో ఈ రోజు స్టార్ట్ కానున్న ఐకియా స్టోర్ విశేషాలే చూస్తే.. ఈ స్టోర్ కోసం ప్ర‌భుత్వం 13 ఎక‌రాల్ని కేటాయించింది. ఇందులో 4 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్ ను నిర్మించారు. రూ.1000 కోట్ల పెట్టుబ‌డితో ఏర్పాటు చేసిన ఈ బాహుబ‌లి స్టోర్ లో ప్ర‌త్య‌క్షంగా 950 మందికి ఉపాధి క‌ల్పిస్తుండ‌గా.. దాదాపు 1500 మందికి పైనే ప‌రోక్షంగా ఉపాధిని క‌ల్పించ‌నున్నారు.

రానున్న ఏడేళ్ల వ్య‌వ‌ధిలో దేశంలో మొత్తం పాతిక స్టోర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఐకియా భావిస్తోంది. ఇందులో భాగంగా మొద‌టి స్టోర్ ను హైద‌రాబాద్‌లో ఈ రోజు (గురువారం) స్టార్ట్ కానుంది. వ‌చ్చే ఏడాది ఈ-కామ‌ర్స్ రంగంలోకి అడుగు పెట్ట‌నున్న ఐకియా స్టోర్ లో ఏముంటుంది? అన్న‌ది చూస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలు చాలానే క‌నిపిస్తాయి.

ఈ స్టోర్ ను ఏర్పాటు చేయ‌టానికి ముందు హైద‌రాబాద్‌లోని వెయ్యి ఇళ్ల‌ను స్వయంగా సంద‌ర్శించి.. ఇక్క‌డి ప్ర‌జ‌ల అవ‌స‌రాలు.. అల‌వాట్ల మీద అధ్య‌య‌నం చేసింది ఐకియా. ఏ ధ‌ర‌లో అయితే ఎక్కువ‌గా ఫ‌ర్నీచ‌ర్ కొంటార‌న్న దానిపై స్ట‌డీ చేసిన ఐకియా.. త‌న స్టోర్ లో 15 రూపాయిలు మొద‌లు ల‌క్ష‌లాది రూపాయిలు విలువ చేసే వ‌స్తువుల్ని ఏర్పాటు చేసింది. రూ.200 లోపు ఉన్న వ‌స్తువులు ఈ భారీ షోరూంలో దాదాపు వెయ్యి వ‌ర‌కూ ఉత్ప‌త్తులు ఉన్నాయంటే.. ఎంత ప‌క్కా ప్లానింగ్ లో ఈ స్టోర్ ఉందో తెలుసుకోవ‌చ్చు.

ఈ స్టోర్ లో మ‌రో ప్ర‌త్యేక‌మైన అంశం ఏమంటే.. వెయ్యి మంది ఒకేసారి కూర్చొని తినే భారీ కేఫ్ టేరియా. అంటే.. ఫ‌ర్నీచ‌ర్ కొనేందుకు వ‌చ్చే వారు అలిసిపోతే.. ఒకేసారి వెయ్యి మంది కూర్చునే వీలున్న రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. 49 దేశాల్లో 403 స్టోర్లు ఉన్న ఐకియా.. తాజా ఎంట్రీతో ఫ‌ర్నీచ‌ర్ షాపింగ్ లో ఐకియా రూపురేఖ‌ల్ని మార్చేస్తుంద‌ని చెబుతున్నారు.