Begin typing your search above and press return to search.

మరీ.. ఇంత దారుణంగా పెంచేస్తారా..?

By:  Tupaki Desk   |   10 Dec 2015 11:19 AM IST
మరీ.. ఇంత దారుణంగా పెంచేస్తారా..?
X
కారణాలు ఏమైనా కానీ.. భారీగా భారం పెంచుతూ నిర్ణయాలు తీసుకోవటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది. ఖర్చులు ఎంత పెరిగితే మాత్రం.. ఒక కోర్సుకు ఏడాదికి రూ.70వేలు ఉన్న ఫీజును ఏకంగా రూ.1.25 లక్షలకు.. రూ.90వేలున్న ఫీజును రూ.2.5లక్షలకు పెంచటం ఎంత వరకు సబబు? అన్న సందేహాలు కలిగేలా ఫీజులు పెంచేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రతిష్ఠాత్మక నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ).. ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లలో ఫీజుల్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫీజుల భారం పెద్దగా అనిపించదని.. నామమాత్రపు వడ్డీ రేట్లకే విద్యారుణాలు ఇస్తామని చెబుతున్నప్పటికీ.. ఈ భారం మోయలేనంతగా మారుతుందనటంలో సందేహం లేదు. తాజాగా పెంచిన ఫీజుల పుణ్యమా అని.. గతంలో నాలుగేళ్ల నిట్ కోర్సుకు రూ.2.8లక్షల నుంచి ఏకంగా రూ.5లక్షలకు ఫీజులు పెరగనున్నాయి. ఇక.. ఐఐటీ విద్యార్థులకు ఇప్పటివరకూ రూ.3.5లక్షలు ఖర్చు అయితే.. ఇకపై రూ.10లక్షలు ఫీజుల రూపంలో ఖర్చు కానుంది.

ఇక.. ఐఐటీల్లో పరిస్థితి మరింత దారుణం. ఇప్పటివరకూ ఏడాదికి రూ.90వేలు కాస్తా.. ఇకపై ఏడాదికి రూ.2.5లక్షలు అంటే.. అటూఇటూగా 260శాతం పెంపుగా చెప్పాలి. ఎంత ఖర్చులు పెరిగితే మాత్రం.. మరీ ఇంత భారీగా ఫీజులు పెంచేస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొన్న ప్రతిష్ఠాత్మక కోర్సులకు ఫీజులతో సంబంధం లేకుండా విద్యా బోధన అందిస్తే.. అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంటుంది.

భారీగా పెంచిన ఫీజుల కారణంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడరని అధికారులు చెబుతున్నా.. విద్యా రుణాన్ని ఇచ్చే బ్యాంకులు పెట్టే సవాలక్ష కొర్రీల విషయంలో అధికారులు జోక్యం చేసుకోరన్న విషయం మర్చిపోకూడదు. ఏమైనా ఈ భారీ పెంపు.. ఎంతోమంది పేద.. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి విద్యార్థులకు శరాఘాతంగా చెప్పొచ్చు.